జవాబు చెప్పే దమ్ము లేకే 'సన్నాసి' మాటలు

హైదరాబాద్ :

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సాగునీటి ప్రాజెక్టుల మీద చూపిన నిర్లక్ష్యంపై తాను చేసిన విమర్శలకు సమాధానం చెప్పే ధైర్యంలేకే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనపై అసంబద్ధమైన విమర్శలు చేశారని వైయస్ఆర్ కాంగ్రె‌స్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాయంలో ఆయన మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ.. బాబు హయాంలో సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసిన తుమ్మల తాను లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పే యత్నం చేయకుండా ‘సన్నాసి’ అంటూ విమర్శించారన్నారు. రాజకీయాల్లో సీనియర్ అయిన తుమ్మల తనను సన్నాసి అన్నారంటే ఆయన ‌'సీనియ‌ర్ సన్నాసి' అవుతారని అన్నారు.

చంద్రబాబు సొంత నియోజకవరంగా కుప్పంలో శ్రీ జగన్‌ బహిరంగ సభ విజయవంతం కావడంతో టీడీపీ నాయకుల్లో భయం నెలకొందని గట్టు వ్యాఖ్యానించారు. ఒక విధంగా వారు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. తుమ్మల లాంటి సీనియర్‌ నాయకులు మాట్లాడినంత మాత్రాన చంద్రబాబు చేసిన పాపాలు ప్రక్షాళక కాబోవన్నారు. చంద్రబాబు హయాంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న తుమ్మలకు కూడా ఆ పాపంలో భాగం ఉందన్నారు. చంద్రబాబును పొగిడే వందిమాగధులంతా సన్నాసులే అన్నారు. టీడీపీ పాలనలో కర్నాటక, మహారాష్ట్రలో కట్టిన అక్రమ ప్రాజెక్టులను నిలువరించినా, మన రాష్ట్రంలోని సక్రమ ప్రాజెక్టులను సకాలంలో నిర్మించినా నీటి కోసం ఇప్పుడు మనకు ఇంత దుస్థితి వచ్చేది కాదన్నారు.

చంద్రబాబు నాయుడి తొమ్మిదేళ్ల పాలనలో మొత్తం సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిం ది 9 వేల కోట్ల రూపాయలు మాత్రమేనని, అసలు బడ్జెట్‌నే కేటాయించకుండా ప్రాజెక్టులు కట్టామని తుమ్మల చెప్పడం విడ్డూరమని గట్టు విమర్శించారు. టీడీపీ తొమ్మిదేళ్ళ అసమర్థ పాలన వల్లే ఇప్పుడు బ్రిజేష్‌ కుమార్‌ కమిటీ ఆంధ్రప్రదేశ్‌కు మరణశాసనం రాసిందని గట్టు ఆరోపించారు.

 ఒకప్పుడు సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన తుమ్మల ఇప్పుడు వందల కోట్లకు అధిపతి ఎలా అయ్యారో చెప్పాలని, తన ఆస్తులు, ఆయన ఆస్తులపై ఖమ్మంలో చర్చించడానికి సిద్ధమేనా అని గట్టు రామచంద్రరావు సవాల్ ‌చేశారు. సమైక్యాంధ్ర అనే దమ్ము లేకపోతే ఇంట్లో కూర్చోవాలి కానీ, తప్పు రాజకీయాలు చేస్తే ఖమ్మం జిల్లా ప్రజలు తుమ్మల నాలుక తెగ్గోస్తారని గట్టు హెచ్చరించారు.

Back to Top