వైద్యారోగ్య శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తక్షణం రెగ్యులరైజ్‌ చేయాలి

 100 శాతం గ్రాస్‌ శాలరీ, డీఏ, హెచ్‌ఆర్‌ఏ చెల్లించాలి

నలమారు చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ 

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ఎంప్లాయీస్‌ అండ్‌ పెన్షనర్స్‌ వింగ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి 

రెండున్నరేళ్లుగా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోని కూటమి ప్రభుత్వం

కాంట్రాక్టు ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయించడం తగదు

సమాన పనికి సమాన వేతనం చెల్లించి న్యాయం చేయాలి  

ఎన్నికల హామీలను అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం 

ప్రెస్‌మీట్‌లో నలమారు చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరిక 

తాడేపల్లి: ప్రజారోగ్య రంగానికి వెన్నెముకగా నిలిచిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పట్ల ప్రభుత్వ వైఖరి అత్యంత అమానుషంగా ఉందని, ప్రభుత్వ తీరువల్ల ఉద్యోగులు అభద్రతా భావంతో పనిచేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్‌ అండ్‌ పెన్షనర్స్‌ వింగ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోవిడ్‌ సమయంలో ప్రాణాలకు తెగించి పని చేసిన వారిని సైతం రోడ్డు మీదకు ఈడ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని మండిపడ్డారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ తీరు వల్ల వైద్య ఆరోగ్య శాఖలో సేవలందిస్తున్న దాదాపు 14,600 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆక్షేపించారు.
    ఎన్నికల సమయంలో ఉద్యోగులకు వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తామని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం.. నేడు ఒక్క హామీని కూడా అమలు చేయకుండా తీవ్ర మోసానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. గత రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి కనీస చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. అర్హత ఉన్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరినీ న్యాయబద్ధంగా రెగ్యులరైజ్‌ చేయాలని, అప్పటివరకు జీవో ఆర్టీ నెం:459 ప్రకారం 100 శాతం గ్రాస్‌ శాలరీతో పాటు, డీఏ, హెచ్‌ఆర్‌ఏ వెంటనే చెల్లించాలని నలమారు చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 
ప్రెస్‌మీట్‌లో నలమారు చంద్రశేఖర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు న్యాయం చేయాలి:
    వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న 14,600 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు న్యాయం కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితిని కూటమి ప్రభుత్వం కల్పించింది. రెండు నెలలుగా ఉద్యోగులు వివిధ రూపాల్లో నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కోవిడ్‌ సమయంలో ప్రాణాలకు తెగించి రాత్రింబవళ్లు సేవలందించిన ఉద్యోగుల సేవలను ప్రభుత్వం మర్చిపోయింది. అర్హత ఉన్న ప్రతి కాంట్రాక్ట్‌ ఉద్యోగిని వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలి. రెగ్యులరైజేషన్‌కు సమయం పడితే జీవో ఆర్టీ నెం: 459 ప్రకారం 100 శాతం గ్రాస్‌ శాలరీతో పాటు పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ వెంటనే చెల్లించాలి. ప్రస్తుతం మినిమం టైమ్‌ స్కేల్‌తో పని చేస్తున్న స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, రేడియోగ్రాఫర్లు, ఈసీజీ, అనస్తీషియా టెక్నీషియన్లకు న్యాయం చేయాలి. 14,600 మంది ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తే ప్రభుత్వ వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఉద్యోగుల కడుపు కొట్టడం తప్ప, మేలు చేసే కార్యక్రమం ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం చేయడం లేదు.

కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్‌పై జగన్‌ నిర్ణయం: 
    జగన్‌ గారి ప్రభుత్వంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేశాం. దాదాపు 10,117 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని అప్పట్లో కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఏళ్ల తరబడి ప్రభుత్వ సేవల్లో కొనసాగుతూ కష్టపడి పని చేస్తున్నారని, వారిని గుర్తించి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం వర్తించేలా చర్యలు తీసుకున్నాం. అర్హులైన కాంట్రాక్ట్‌ ఉద్యోగులను అన్ని శాఖల్లో గుర్తించి రెగ్యులరైజ్‌ చేయడానికి చట్టపరమైన చర్యలు కూడా చేపట్టాం. 2023లో ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రెగ్యులరైజేషన్‌ ఆఫ్‌ సర్వీసెస్‌ ఆఫ్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యాక్ట్‌ను కూడా తీసుకొచ్చాం. కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారి కడుపు కొట్టడం తప్ప, మేలు చేసే కార్యక్రమం చేయడం లేదు. 

పీఆర్సీ విషయంలో ఇంకా జాప్యం తగదు: 
    ఉద్యోగులకు మేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. మంచి పీఆర్సీ, ఐఆర్, డీఏలు ఇస్తామని, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పింది. మెడికల్‌ ఉద్యోగులతో పాటు అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, మున్సిపల్‌ కార్మికులు, ఉపాధ్యాయులు, సీహెచ్‌వోలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సహకార బ్యాంకు ఉద్యోగులు ఇలా అనేక వర్గాలు తమ సమస్యల కోసం రోడ్డెక్కుతున్నాయి. రిటైర్‌ అయిన అధికారులకు పదేపదే రీ–అపాయింట్‌మెంట్లు ఇవ్వడం ఆపి, కిందిస్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో ఆందోళన తప్పదని నలమారు చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు.

Back to Top