స్థానిక ఎన్నికలపై అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయండి

కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల్ని కోరిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

తాడేపల్లి:     ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియపై స్పష్టత కోసం అత్యవసరంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని, అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లా అప్పిరెడ్డి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు లేఖలు రాశారు. ఎన్నికల సన్నాహక చర్యలు, ఏర్పాట్లపై రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఓటర్లకు స్పష్టమైన, ఏకరీతి సమాచారం అవసరమని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా అవసరమైన సర్టిఫికెట్ల జారీ ఆలస్యం, వార్డుల డీలిమిటేషన్‌, ఓటర్ల జాబితాలు, అధికార యంత్రాంగం ద్వారా బెదిరింపులు లేదా దుర్వినియోగం జరుగుతుందన్న ఆందోళనలపై సకాలంలో చర్చ జరగాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల్ని కోరారు.

అలాగే కుల/కమ్యూనిటీ, నో-డ్యూస్/ఎన్‌ఓసీ సర్టిఫికెట్ల జారీకి రాష్ట్రవ్యాప్తంగా సర్వర్‌ సమస్యలను కారణంగా చూపుతూ ఎదురవుతున్న అడ్డంకులపై చర్చించాలని వైఎస్సార్‌సీపీ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను కోరింది. సీనియర్‌ గ్రామ, వార్డు సచివాలయ అధికారుల పాత్రపై నిష్పాక్షిక విచారణ జరపాలని, సంబంధిత న్యాయ ఆదేశాలకు లోబడి చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేసింది. అలాగే రిజర్వేషన్లు, సీట్ల రొటేషన్‌, ఎన్నికల షెడ్యూల్‌, దశలవారీగా ఎన్నికల నిర్వహణ, నామినేషన్లు, పరిశీలన ప్రక్రియ, మేయర్లు-చైర్‌పర్సన్ల ఎన్నిక, ఓటింగ్‌ ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, అధికారుల తటస్థత, పోలింగ్‌-కౌంటింగ్‌ సమయంలో భద్రత, ఫిర్యాదుల సకాలంలో పరిష్కారం వంటి అంశాలను అఖిలపక్ష సమావేశంలో చర్చించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఈసీని, ఈసీఐని కోరింది.     

ప్రతి అర్హత కలిగిన అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించడంతో పాటు, అర్హులైన ప్రతి ఓటరు ఎన్నికల్లో పాల్గొనే హక్కును పరిరక్షించేందుకు సమగ్ర సంప్రదింపులు అవసరమని లేఖలో పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీకి ముందే, చట్టపరమైన, న్యాయపరమైన గడువులకు అనుగుణంగా వీలైనంత త్వరగా అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. ఈ సమావేశానికి ముందుగానే అజెండాను అన్ని పార్టీలకు పంపించాలని, సమావేశం అనంతరం స్పష్టమైన లిఖితపూర్వక మార్గదర్శకాలు జారీ చేసి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ఏకరీతిగా అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను కోరింది.

Back to Top