అనంతపురం: వెన్నుపోటు పార్టీ రాజకీయ కక్షసాధింపు చర్యల వల్ల రాయలసీమ ప్రాంతం సర్వనాశనం అవుతోందని మాజీ ఎంపీ తలారి రంగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో సీమకు కేటాయించిన కీలక సంస్థలను అమరావతికి తరలించి తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎయిమ్స్, లా కాలేజీ, టెక్నాలజీ సెంటర్లు, హైకోర్టు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలను తరలిస్తూ రాయలసీమ ప్రజల గొంతు కోస్తున్నారని ఆరోపించారు. రిజర్వాయర్లు, సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోకపోవడంతో కరువు ఛాయలు అలుముకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో రైతులు కరువు, నీటి కొరతతో అల్లాడుతుంటే రూ.24 వేల కోట్లు సాగునీటికి ఖర్చు చేశామని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్ గారి హయాంలో వచ్చిన వైద్య కళాశాలలు, నీటి ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని విమర్శించారు. వైఎస్సార్సీపీ హయాంలో జగన్ గారు రాయలసీమలో ఐదు కొత్త మెడికల్ కాలేజీలు, కొత్త జిల్లాలు తీసుకొచ్చి అభివృద్ధి వికేంద్రీకరణకు పెద్దపీట వేశారని గుర్తుచేశారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై అవాస్తవాలు ప్రచారం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని తలారి రంగయ్య డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... అమరావతి మీద ఉన్న శ్రద్ధ రాయలసీమ మీద ఏదీ?: రాయలసీమకు వెన్నుపోటు పార్టీ చేస్తున్న నష్టం రోజురోజుకీ పెరుగుతోంది. అనంతపురంలో ఉండాల్సిన ఎయిమ్స్‌ను మంగళగిరికి తీసుకెళ్లారు, కర్నూలుకు దక్కాల్సిన లోకాయుక్త, నేషనల్ లా కాలేజ్, మానవ హక్కుల సంస్థలను అమరావతికి తరలించారు. కొప్పర్తిలో వేల ఎకరాలు కేటాయించి ఏర్పాటు చేయాల్సిన ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను కూడా అమరావతికి తీసుకెళ్లారు. కడపలో ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు హెడ్‌ఆఫీస్‌ను కూడా తరలించారు. తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సంస్థలను తరలించడంతో పాటు, ఐఐటీ తిరుపతిని అభివృద్ధి చేయకుండా అమరావతిలో మరో సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబుకు అమరావతిలోని 29 గ్రామాలపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంపై లేదు. హైదరాబాద్‌లో అన్ని సంస్థలు ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్ల తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇదే విధంగా రాయలసీమకు అన్యాయం చేస్తే రాయలసీమ ఉద్యమానికి కూడా చంద్రబాబు ప్రభుత్వమే కారణమవుతుంది. చంద్రబాబుకి నిజంగా రాయలసీమపై ప్రేమ ఉంటే రాయలసీమ నుంచి తరలించిన సంస్థలను తిరిగి రాయలసీమకు తీసుకురావాలి. హంద్రీనీవా లైనింగ్ పనుల పేరుతో దోపిడీ: రాయలసీమలో ఈరోజు ఎండిన చెరువులు, బీడువారిన పొలాలు కనిపిస్తున్నాయి. రైతులకు నిరంతరాయ విద్యుత్ ఇవ్వడం లేదు, చీనీ, దానిమ్మ, అరటి, టమాటా పంటలు నీరు లేక దెబ్బతింటున్నాయి. రూ.24 వేల కోట్లు ఇరిగేషన్‌పై ఖర్చు చేశామని చెబుతున్న చంద్రబాబు, రాయలసీమలో కొత్తగా ఒక్క చెరువుకు నీరు వచ్చినా, ఒక్క కొత్త ఎకరా సాగులోకి వచ్చినా చూపించండి, ఆ రైతు ఎవరో చెప్పండి. హంద్రీ-నీవా కాల్వల వెంట కూడా ప్రజలకు నిజంగా మేలు జరిగిందా అని కలిసి వెళ్లి చూద్దాం. ఇప్పటికే రూ.3,850 కోట్లు ఐదు సంస్థలకే ఇచ్చారు, మళ్లీ రూ.1,600 కోట్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు; పాత కాంట్రాక్టర్లకే పనులు కట్టబెడుతూ కొత్తవారికి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, చంద్రబాబు సన్నిహితుడు రంగరాజు ఎండీగా ఉన్న ఎన్‌సీసీకి, టీడీపీ సానుభూతిపరుడికి చెందిన టీఎన్ఎంఆర్ ప్రాజెక్టుకి కు, చంద్రబాబు సన్నిహితుడు బలుసు శ్రీనివాసరావుకి చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రా కు పనులు అప్పగించిన మాట వాస్తవమో కాదో చెప్పాలి. చంద్రబాబుకి కరువు మ్యాన్ బిరుదు సరిపోతుంది: చంద్రబాబుకు ‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అనే బిరుదు తగదు, రాయలసీమ పరిస్థితి చూస్తే ‘కరువు మ్యాన్ ఆఫ్ ఇండియా’ అనే బిరుదే సరిపోతుంది. మేము వైఎస్సార్సీపీ తరఫున, రాయలసీమ రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముందుగా పంటలు, చెట్లను కాపాడండి, రైతులకు తక్షణ సాగునీరు అందించండి, రాయలసీమ నుంచి తరలించిన సంస్థలను తిరిగి తీసుకురండి. జగనన్న హయాంలో నంద్యాల, ఆదోని, మదనపల్లి, పులివెందుల, పెనుకొండలో ఐదు కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం; కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి పరిపాలనను వికేంద్రీకరించాం. ఇప్పటికైనా మభ్యపెట్టే మాటలు మానుకుని వాస్తవాలను చూడాలి. అలాగే తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన బాధ్యతారహిత వ్యాఖ్యలను ఉపసంహరించుకుని భక్తులకు క్షమాపణ చెప్పాలి, లడ్డూ అంశంపై వైఎస్సార్సీపీ నాయకులపై పెట్టిన తప్పుడు కేసులన్నింటినీ బేషరతుగా వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.