తాడేపల్లి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును గత ఏడేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాల కోసం ఒక వెబ్ సిరీస్‌ను మించి నడిపిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు అందగానే వివేకా కుమార్తె డాక్టర్ సునీత నేరుగా వెళ్లి చంద్రబాబును కలవడమే వీరి కుట్రపూరిత రాజకీయ బంధానికి తిరుగులేని నిదర్శనమని ధ్వజమెత్తారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులు, ఆయన్ను దారుణంగా గొడ్డలితో చంపానని చెప్పిన దస్తగిరి వంటి హంతకులు, దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు ప్రమాదకరమైన 'మూడు ముక్కలాట' ఆడుతున్నారని ఆరోపించారు. కోర్టులో కేసు ట్రయల్ పూర్తయితే అసలు నిజాలు బయటపడి అవినాష్ రెడ్డి క్లీన్ చిట్‌తో బయటకు వస్తారనే భయంతోనే... సుప్రీంకోర్టు, హైకోర్టులలో పిటిషన్లతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తద్వారా దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసి ఈ కేసును 2029 ఎన్నికల వరకు సజీవంగా ఉంచేందుకు చంద్రబాబు, సునీత, హంతకుల ముఠా కుట్ర పన్నుతోందని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే.. అవినాష్‌రెడ్డికి ఈడీ నోటీసులు రాగానే బాబుతో సునీత భేటీ.. ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడేళ్లుగా వివేకానందరెడ్డి హత్య కేసును అడ్డం పెట్టుకుని చంద్రబాబు నీచమైన రాజకీయ క్రీడ నడుపుతున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఈడీ నోటీసులు అందిన వెంటనే సునీత నేరుగా వెళ్లి చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. వివేకా హత్య వెనుక, దాన్ని రాజకీయం చేస్తున్న వారి వెనుక ఉన్నది చంద్రబాబేనని మొదటి నుంచీ చెబుతున్న మా మాటలు ఈరోజు అక్షరాలా నిజమయ్యాయి. ఈ భేటీతో వారి ముఖాలకు ఉన్న రాజకీయ ముసుగు పూర్తిగా తొలగిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు, తమను తాము రక్షించుకునేందుకు సునీతను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారు. హంతకులు, దర్యాప్తు సంస్థలతో మూడు ముక్కలాట.. ఒకపక్క వివేకా కుటుంబ సభ్యులను, మరోపక్క ఆయన్ను అత్యంత కిరాతకంగా చంపామని ఒప్పుకున్న హంతకులను, ఇంకోవైపు ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను పెట్టుకుని చంద్రబాబు మూడు ముక్కలాట ఆడుతున్నారు. వివేకాను గొడ్డలితో తానే చంపానని బహిరంగంగా చెప్పిన అప్రూవర్ దస్తగిరి నిస్సిగ్గుగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి నేతలను కలిశాడు. మరో నిందితుడు సునీల్ ఎల్లో మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ ఏకంగా రాజకీయాల్లోకి వస్తానంటున్నాడు. నిన్న మొన్నటి వరకు పూట గడవని ఈ హంతకులు నేడు కడపలో కాన్వాయ్‌లు వేసుకుని తిరుగుతూ, మీసాలు తిప్పుతూ, దందాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. టీడీపీ అండదండలు, చంద్రబాబు ప్రోద్బలం చూసుకునే వీరు ఇంత బరితెగించి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. తండ్రిని చంపిన వారిపై సునీతకు ఎందుకంత ప్రేమ? కేసులో సుప్రీంకోర్టు వరకు పెద్ద సంఖ్యలో పిటిషన్లు వేసిన సునీత... తన తండ్రిని అత్యంత విచక్షణారహితంగా గొడ్డలితో నరికి చంపామని చెప్పిన దస్తగిరి, సునీల్ ల బెయిల్ రద్దు చేయాలని ఎందుకు ఒక్క పిటిషన్ కూడా వేయలేదు? సొంత తండ్రిని చంపిన వారిపై రగిలిపోవాల్సిన సునీతకు వారిపై ఎందుకంత ప్రేమ? సునీత పోరాటం చాలా గొప్పదంటూ ఆ హంతకులే ఆమెకు సర్టిఫికెట్లు ఇవ్వడం ఎంతటి దారుణం? సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫున వాదించే సిద్ధార్థ లూథ్రా వంటి లాయర్లే సునీత తరఫున కూడా వాదనలు వినిపిస్తున్నారు. బాబు తరఫు లాయరే సునీతకు లాయర్ కావడం, దస్తగిరి టీడీపీ ఆఫీసుకు వెళ్లడం, సునీత నేరుగా బాబు ఇంటికి వెళ్లి చర్చలు జరపడం చూస్తే ఈ రాజకీయ కుట్రల స్క్రిప్ట్ ఎక్కడ తయారవుతోందో స్పష్టమవుతోంది. ట్రయల్ పూర్తయితే నిజాలు బయటకు వస్తాయనే భయం.. ఈ నేపధ్యంలో హత్య జరిగి ఏడేళ్లు గడుస్తున్నా కేసును ఉద్దేశపూర్వకంగా కొలిక్కి రానివ్వడం లేదు. కోర్టులో పూర్తిస్థాయి ట్రయల్ నడిస్తే అసలైన దోషులు ఎవరో బయటపడ్డంతో పాటు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు క్లీన్ చిట్‌తో బయటకు వస్తారని చంద్రబాబుకు బాగా తెలుసు, అందుకే ట్రయల్ జరగకుండా అడ్డుపడుతూ, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ.. కేసును 2029 ఎన్నికల వరకు లాగాలని ఈ ముగ్గురి త్రయం చూస్తోంది. మరోవైపు సునీత బంధువులకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోందన్న శివశంకర్, ఇంకా ఎన్ని రోజులు ఈ ముసుగులో గుద్దులాట? నడిపిస్తారని.. నేరుగా వెళ్లి టీడీపీ పసుపు కండువా కప్పుకుని తిరగండని సూచించారు. కేవలం త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడానికే, దర్యాప్తు సంస్థలను ఎలా ప్రభావితం చేయాలనే అంశంపైనే ఈరోజు చంద్రబాబుతో సునీత రహస్య మంతనాలు జరిపారని స్పష్టం చేశారు.