‘ఈడీ స్వతంత్ర సంస్థేనా?’.. లేక 

‘చంద్రబాబు ప్రభుత్వ ‘సిట్‌’కు పొడిగింపుగా మారిందా?’

తిరుపతి ఎంపీ డాక్టర్‌ ఎం.గురుమూర్తి ట్వీట్‌ 

ఎల్లో మీడియాలో ముందే ‘ఎక్స్‌క్లూజివ్‌’లు.. ఆ వెంటనే అదే బాటలో ఈడీ చర్యలు.

మద్యం కేసు సహా పలు కేసుల్లో చంద్రబాబు ప్రభుత్వ సిట్‌ కథనాన్నే ఈడీ ముందుకు తీసుకెళ్తోందన్న అనుమానం.

విపక్ష వైయస్సార్‌సీపీని లక్ష్యంగా చేసుకుని రాజకీయ కక్ష సాధింపులకు దర్యాప్తు సంస్థలను వాడుతున్నారా?.

స్వతంత్రత, పారదర్శకత వల్లే దర్యాప్తు సంస్థలపై ప్రజల విశ్వాసం పెరుగుతుంది.

ఎక్స్‌ వేదికగా ఎంపీ గురుమూర్తి ట్వీట్‌

తిరుపతి: ‘ఈడీ స్వతంత్ర సంస్థేనా?’.. లేక  ‘చంద్రబాబు ప్రభుత్వ ‘సిట్‌’కు పొడిగింపుగా మారిందా?’ అని 
తిరుపతి ఎంపీ డాక్టర్‌ ఎం.గురుమూర్తి సూటిగా ప్ర‌శ్నించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌పై ఎక్స్‌ వేదికగా చేసిన ట్వీట్‌లో తిరుపతి ఎంపీ ఎం.గురుమూర్తి ఇంకా ఏమన్నారంటే..
    కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఇప్పటికీ స్వతంత్ర సంస్థగానే పని చేస్తోందా? లేక సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ ‘సిట్‌’కు పొడిగింపుగా మారిందా?. ఎందుకంటే ఈడీ వ్యవహార శైలి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నోటీసులు, దాడులకు సంబంధించిన వివరాలు ముందుగా ఎల్లో మీడియాలో ‘ఎక్స్‌క్లూజివ్‌’ వార్తల పేరుతో బయటకు వస్తున్నాయి. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే దాదాపు అదే ప్రకారం ఈడీ చర్యలు సాగుతున్నట్లు కనిపిస్తోంది.
    అక్రమ మద్యం కేసుతో పాటు ఇతర కేసుల్లో కూడా చంద్రబాబు ప్రభుత్వ ‘సిట్‌’ రూపొందించిన కథనాన్నే ఈడీ ముందుకు తీసుకెళ్తోందన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకుని, రాజకీయ ప్రయోజనాల కోసం, విపక్షంపై కక్ష సాధించేందుకు దర్యాప్తు వ్యవస్థలను ఉపయోగిస్తున్నారా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఒక దర్యాప్తు సంస్థ స్వతంత్ర వ్యవస్థలా కాకుండా రాజకీయ కక్ష సాధింపు కోసమే పని చేయడం ప్రారంభిస్తే ప్రజల్లో సహజంగానే అనేక అనుమానాలు ఉత్పన్నమవుతాయి. అసలు ఇక్కడ నిజంగా దర్యాప్తు జరుగుతోందా? లేక కేవలం ప్రభుత్వ కక్ష సాధింపు కొనసాగుతోందా?.
    దర్యాప్తు సంస్థలకు ప్రజల్లో విశ్వాసం ఏర్పడాలంటే అవి స్వతంత్రంగా, పారదర్శకంగా, చట్టబద్ధమైన విధానాలను అనుసరిస్తూ పని చేయాల్సిన అవసరం ఉంది. దర్యాప్తు ప్రక్రియ స్థానంలో రాజకీయంగా తయారైన స్క్రిప్టులు అమలవుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడితే, ముందుగా దెబ్బ తినేది ఆయా సంస్థలపై ప్రజలకు ఉన్న విశ్వాసమే అన్న విషయం గుర్తుంచుకొండి.

Back to Top