పాదయాత్రతో టీడీపీ నేతల గుండెళ్లో రైళ్లు

  • వైయస్‌ జగన్‌ను చూసి భయపడిపోతున్న టీడీపీ సర్కార్‌
  • కోర్టు తీర్పుకు లోబడే జననేత పాదయాత్ర
  • కోర్టులో ఊరట లభించదని చిన్నరాజప్పకు ఎలా తెలుసు
  • డిప్యూటీ సీఎంపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలి
  • ఓటుకు కోట్ల కేసులో కేసీఆర్‌తో కుమ్మకైంది అందరికీ తెలుసు
  • రేవంత్‌రెడ్డి ఆరోపణలపై చంద్రబాబు సమాధానం చెప్పాలి
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌
విజయవాడ: కోర్టు తీర్పు వెలువడక ముందే వైయస్‌ జగన్‌కు పాదయాత్రకు ఊరట లభించదని రాష్ట్ర హోంమంత్రి చిన్న రాజప్ప ఏ విధంగా చెప్పారో సమాధానం చెప్పాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. చిన్నరాజప్ప మాటలను సీబీఐ కోర్టు సుమోటోగా తీసుకొని డిప్యూటీ సీఎంపై ఎంక్వైరీ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు.  విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేత మల్లాది విష్ణుతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర అంటే చంద్రబాబు మొదలు చిన్నరాజప్ప, సోదిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలకు భయం పట్టుకుందన్నారు. పాదయాత్రకు తేదీ ఖరారు చేయగానే టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని డబ్బాలు కొట్టుకునే వారందరికీ వైయస్‌ జగన్‌ పాదయాత్ర అంటే భయమెందుకని ప్రశ్నించారు. నవంబర్‌ 6వ తేదీ నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభం కానుందని తెలిపారు. కోర్టు తీర్పుకు లోబడే పాదయాత్ర చేస్తున్నారని, పాదయాత్ర ద్వారా ప్రజలందరినీ కలుస్తారన్నారు. ప్రజలకు ధైర్యం ఇచ్చే విధంగా యాత్ర సాగుతుందన్నారు. 

స్టేల ఘనుడు చంద్రబాబు
సోనియాగాంధీ, చంద్రబాబు నాయుడు కుమ్మకై పెట్టిన కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్న వీరుడు వైయస్‌ జగన్‌ అని వెల్లంపల్లి అన్నారు. రెండు డజన్ల కేసుల్లో ఇరుక్కొని ఒక్క కేసును కూడా ధైర్యంగా విచారణ ఎదుర్కోకుండా స్టేలు తెచ్చుకున్న ఘనుడు చంద్రబాబు అని మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చంద్రబాబు ఏ విధంగా కుమ్మకైయ్యారో ప్రజలందరికీ తెలుసన్నారు. వచ్చిరాని ఇంగ్లీష్‌ మాట్లాడేది చంద్రబాబేనని కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ కూడా సర్టిఫైడ్‌ చేశారన్నారు. అయినా ఎందుకు విచారణ చేపట్టడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

ఖండించకపోవడంలో ఆంతర్యమేంటీ?
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆంధ్రా టీడీపీ నేతలపై చేసిన ఆరోపణలను ఇంత వరకు ఖండించకపోవడంలో ఆంతర్యమేంటని వెల్లంపల్లి నిలదీశారు. రేవంత్‌రెడ్డి మోపిన అభియోగాలపై వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎప్పుడు మీడియాకు అందుబాటులో ఉండే యనమల రూ.2 వేల కోట్ల ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ గురించి రేవంత్‌రెడ్డి మాట్లాడితే ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. మీ పార్టీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. 
Back to Top