ఎమ్మెల్యే అరెస్టుకు వైయస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్

ఒంగోలు:

కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, మాజీ మంత్రి మారెప్పలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సహకార ఎన్నికల పర్యవేక్షణలో పీసీపల్లిలో ఉన్న తమ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నరాల రమణారెడ్డిపై ఎమ్మెల్యే దాడి చేయించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి భౌతికదాడులను ప్రేరేపించడం సిగ్గుచేటన్నారు. అధికారం ఉంది కదా అని దాడులకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గతంలో జరిగిన ఉపఎన్నికల సందర్భంగా ఒంగోలులో ఓవర్‌యాక్షన్ చేసిన ఉగ్రనరసింహారెడ్డిని మహిళలు తరిమికొట్టిన సంగతి మరిచిపోయినట్లుందని పేర్కొన్నారు. ఇదే తరహాలో ఆయన వ్యవహారశైలి ఉంటే మహిళలే ఆయనను తరిమికొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు. దమ్ముంటే సహకార ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవాలని హితవు పలికారు.

Back to Top