రాజీనామాల ఆమోదానికి అడ్డం పడుతున్నది చంద్రబాబే

ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన వైయస్ ఆర్
కాంగ్రెస్ ఎంపిలు వాటిని ఆమోదించుకుని తిరిగి ఎన్నికలకు సిద్ధపడాలంటూ చంద్రబాబు
నాయుడు చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా
మండిపడ్డారు. ఆ రాజీనామాలు ఆమోదించకుండా అడ్డుపడుతున్నది చంద్రబాబే అని తీవ్రంగా
ఆక్షేపించారు. తాను మోసం చేస్తూ  ఎదుటి
వారిపై బురద చల్లే దారుణమైన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. పార్టీలు ఫిరాయించిన
వైయస్ఆర్ సిపి ఎంపిలపై అనర్హత వేటు పడకుండా బిజెపి నాయకత్వంతో లాలూచి పడ్డారనీ,
రాష్ట్రంలో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వారిలో 4 గురిని మంత్రులుగా చేసి
స్పీకర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని డ్రామా చేస్తున్న చంద్రబాబు నాయుడు , మాటకు
కట్టుబడి రాజీనామాలు చేసిన వైయస్ ఆర్ ఎంపిల పై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు.
కుట్రులు, మోసాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని వెన్నుపోట్లకు పేటెంట్ దారుడుని
అన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని
పెనుగొండలో ఆదివారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ
సందర్భంగా చంద్రబాబు పాలన లోని డొల్లతనాన్ని ఎండగడుతూ, ప్రజలను ఏవిధంగా
వంచిస్తున్నారన్న దానిపై ప్రజలకు విడమర్చి చెప్పారు. నవనిర్మాణ దీక్ష ల పేరుతో
చంద్రబాబు 2022,2029,2050 నాటికల్లా వివిధ అంశాల్లో రాష్ట్రాన్ని మొదటి ర్యాంకుకు
తీసుకుని వస్తామంటూ చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారాన్ని తనదైన శైలిలో
తిప్పికొట్టారు. 2050 నాటికి చంద్రబాబు నాయుడి వయసు దాదాపు వందేళ్లు దాటుతుందని,
ఆంత వరకు కూడా రాష్ట్రాన్ని దోచుకోవాలన్న, పాలించాలన్న అత్యాశ ఆయనకున్నా, ఆయనను
మరో ఎనిమిదినెలలు భరించడమే కష్టమని ప్రజలు అనుకుంటున్నారన్నారు.రాష్ట్రంలో అణువణువునూ దోచుకోవాలన్నది చంద్రబాబు
లక్ష్యంగా ఉందన్నారు.  పశ్చిమ గోదావరి
జిల్లా ప్రజలు మొత్తం అన్ని సీట్లను తెలుగుదేశం పార్టీకి ఇస్తే, దానికి ప్రతిఫలంగా
మంచినీటి సమస్యను గ్రామస్తులకు ఇచ్చారన్నారు. పెనుగొండ ప్రాంతంలో మంచినీటి
పైపుల్లో సరఫరా అవుతున్న తాగునీటిని చంద్రబాబు కుమారుడు లోకేష్ ఒకసారి తాగి
చూపించాలని సవాల్ విసిరారు. గ్రామాల్లో మంచినీటి సరఫరా అనేది , పంచాయతీరాజ్ శాఖ
విధులు నిర్వహిస్తున్న లోకేష్ దే అని అన్నారు. అంతే కాకుండా కనీసం తన సొంత
నియోజకవర్గంలోని సమస్యలు కూడా పరిష్కరించుకోలేని స్థితిలో రాష్ట్ర
మంత్రులున్నారంటే చంద్రబాబు పాలన ఏవిధంగా అర్థమవుతోందన్నారు. పెనుగొండ ప్రాంతంలోని
30 పడకల ఆసుపత్రిలో కనీసం గైనకాలజిస్టు కూడా నియమించుకోలేని మంత్రి ఉన్నా లేకున్నా
ఒకటే అని, ఇటువంటి వారు రాజీనామాలు చేసి ఇళ్లకు పోవడమే మంచిందని జగన్ అన్నారు. ఆయన
ఇంకా ఏమన్నారంటే...

ఇంకా దేనిలో నెంబర్ వన్ కావాలి బాబూ!

 చంద్రబాబు 2022 కల్లా ఎపిని 3 రాష్ట్రాల్లో
ఒకదానిగా చేస్తారట. 2029 గురించి మాట్లాడుతూ ఎపిని దేశంలోనే నెం.1 2050
ప్రపంచంలోనే నెం1 చేస్తారట. ఇదెలా ఉందంటే 2014 లో అయిదేళ్ల కాలానికి ఒక సర్పంచిని
ఎన్నుకుంటే నాలుగు ఏళ్లపాటు కనిపించకుండా పోయి, మరో ఆరు నెలల్లో ఎన్నికలు
జరుగుతాయనగా మీ ముందుకు వచ్చి  2022 కల్లా మంచినీరి
ఇస్తాననీ, 2029 నాటికి సిమెంటు రోడ్లు వేస్తాననీ, 2050 కల్లా నెంబర్ వన్ గా
చేస్తానంటే నమ్ముతారా అని సూటిగా ప్రశ్నించారు. ఆ సర్పంచును అందరూ ఏమంటారని
ప్రజలను అడుగుతూ వారిచేత 420 అంటారా అనరా అని జవాబు చెప్పించారు. అదే విధంగా ఈ
రోజు రాష్ట్రంలో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల
పాటు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి ఆయన పాలన మరో ఎడెనిమది నెలల్లో పూర్తి
అవుతుందన్న దశలో 2022,2029, 2050 ల గురించి మాట్లాడటం మోసం, వంచన కాక మరేమిటని
జగన్ ప్రశ్నించారు. అసలు ప్రత్యేక హోదాను అమ్ముకోకపోయి ఉంటేస మోసం చేయకుండా ఉంటే,
మన రాష్ట్రం ఇప్పటికే నెంబర్ వన్ స్థానానికి పోటీ పడేది కాదా అని నిలదీశారు.

2022 సంవత్సరానికల్లా టాప్ 3 స్థానం దేవుడెరుగు
ఇప్పటికే అనేక అంశాల్లో చంద్రబాబు దేశంలో అగ్రస్థానంలో ఉన్నారని ఆయన వివరించారు.

2016 లోనే అవినీతిలో నెంబర్ వన్ సిఐఎఆర్ నివేదిక
స్పష్టం చేసింది.

ప్రస్తుతం అత్యాచారాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా
ఉంది. 12 ఏళ్ల బాలికలపై వరుసగా అత్యాచారాలు జరుగుతుంటే నివారించలేనందకు చంద్రబాబు
సిగ్గుపడాలన్నారు.

రాజ్యాంగ ఉల్లంఘటనలో ఏపీ నెంబర్‌ వన్‌. పార్టీ ఫిరాయింపుల్లో ఏపీ నెంబర్‌
వన్‌. అప్పుల్లో దేశంలోనే ఏపీ నెంబర్‌ వన్‌. మద్యం తాగించడంలో ఏపీ నెంబర్‌ వన్‌.
గుడి భూములు కొల్లగొట్టడంలో చంద్రబాబు నెంబర్‌ వన్‌. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెంచడంలో, అవినీతి పాలనలోనూ ఏపీని చంద్రబాబు నెంబర్‌ వన్‌గా
తీర్చిదిద్దారని, రాష్ట్రంలో 420 పాలన సాగుతోందని వైయస్  జగన్‌ ఎద్దేవా చేశారు. 

ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంలోనూ
నెంబర్ వన్ .

ఇలా అనేక అంశాల్లో ఇప్పటికే
రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలిపిన చంద్రబాబు చివరి 8 నెలల్లో ఇంకా వేటిలో నెంబర్
వన్ చేస్తారోనని ప్రజలు భయపడుతున్నారని జగన్ తెలిపారు.

మాటలు నమ్మి ఒక్కసారి పాలన
అప్పగించినందుకే అనేక అంశాల్లో నెంబర్ వన్ చేశావు, మిగిలిన 8 నెలల కాలంలో ఎన్నిటిలో
నెంబర్ వన్ చేస్తారో అని ప్రజలు భయపడిపోతున్నారు.

 నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞలు
హాస్యాస్పదం...

చంద్రబాబు నాయుడు తాజాగా
నిర్వహిస్తున్న నవ నిర్మాణదీక్షలు వాటిలో చేయిస్తున్న ప్రతిజ్ఞలలోని డొల్ల తనాన్ని
జగన్ తూర్పారబట్టారు. విద్యార్ధులు, ఉద్యోగుల చేత చేయిస్తున్న ప్రతినలకు పూర్తి
విరుద్ధంగా చంద్రబాబు పాలన ఉందని , ఇలా నమ్మక ద్రోహం, కుట్రలకు కేరాఫ్ అడ్రస్ అయిన
చంద్రబాబు కొత్త వంచనకు పాల్పడుతున్నారన్నారు.

అవినీతి లేని రాష్ట్రం రావాలట...
ఎమ్మెల్యేలను అడ్డంగా కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయిన ఈ వ్యక్తికి
ఈ మాట చెప్పే నైతికత ఉందా.

అందరికీ ఉపాథి లభించే
రాష్ట్రం
...నాలుగేళ్ల కాలంలో ఆయన కొడుక్కి తప్ప వేరే ఎవరికీ ఉపాథి రాని పరిస్థితి
ఉంది.

ప్రతినిత్యం అబద్దాలు, మోసాలతో,
అన్యాయమైన రీతిలో అవినీతి పాలన తో చంద్రాబాబు ఆడుతున్న డ్రామాలు, రోజుకో కొత్త
సినిమాలా ఉంటున్నాయంటూ మండిపడ్డారు. 

 ఇలాంటి వ్యక్తిని నమ్మి మరోసారి
గెలిపిస్తే రాజకీయాల్లో విశ్వసనీయత అనేది పూర్తిగా దెబ్బతింటుందని స్పష్టం చేస్తూ
నవరత్నాల్లో డ్వాక్రా సంఘాలు, యువతకు చేయబోయే కార్యక్రమాలను వివరించారు.

Back to Top