ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు

విజయనగరం, 16 జూన్‌ 2013:

స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని పార్టీ నాయకులు, శ్రేణులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ పిలుపునిచ్చారు. పార్టీని పటిష్టం చేయడానికి పంచాయతీ ఎన్నికలు మంచి వేదికగా ఉపయోగపడతాయని ఆమె అన్నారు. పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సులో శ్రీమతి విజయమ్మ మాట్లాడారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబం పట్ల ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఆమె చేతులెత్తి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు. చిన్న చిన్న గొడవలు ఉన్నా పట్టించుకోకుండా పంచాయతీ ఎన్నికలు మొదలు శాసనసభ, లోక్‌సభ ఎన్నికల వరకూ అన్నింటిలో పార్టీ విజయం కోసం అందరూ కలసికట్టుగా కృషి చేయాలని శ్రీమతి విజయమ్మ దిశా నిర్దేశం చేశారు. ప్రతి పంచాయతీలోనూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. జగన్‌బాబుపైన, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పైన అవాస్తవాలు ప్రచారం చేసే వారికి ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో దీటైన జవాబు చెప్పాలని విజ్ఞప్తిచేశారు.

రాష్ట్రంలో ఇప్పుడు కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. ‌స్థానిక ఎన్నికలలో కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండూ కలిసే పోటీచేస్తారని చెప్పారు. అధికారంలో ఉన్నందున పోలీసులు కూడా వారికే సహకరిస్తారన్నారు. ఎన్నికల సమయంలో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా పనిచేయాలని శ్రీమతి విజయమ్మ సూచించారు. ఎన్నికలను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని చెప్పారు. మనం మంచి ఊపు మీద ఉన్నాం అనే 'అతి విశ్వాసం' మన దగ్గరకు రానీయవద్దని ఆమె హెచ్చరించారు. ప్రజల్లోకి వెళ్ళాలని, వారి మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటాలు చేయాలని శ్రీమతి విజయమ్మ సూచించారు. తద్వారా స్థానికంగా ఎదగాలని పిలపునిచ్చారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉందని అన్నారు. ఓటర్ల జాబితాలో ఓట్లు లేకుండా చేస్తారు జాగ్రత్త అని హెచ్చరించారు. నామినేషన్ల సమయం నుంచీ ఫలితాలు ప్రకటించే వరకూ ప్రతి కార్యకర్తా, నాయకుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా జాగ్రత్తగా ఉండాలని ‌శ్రీమతి విజయమ్మ హెచ్చరించారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసిన వారు కూడా మరింత పెద్ద పదవులు చేపట్టేలా రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు.

రైతుల సమస్యల గురించి ఈ సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఏనాడైనా పట్టించుకున్నారా? అని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు. 108 సర్వీసులు మూలనపడ్డాయని, 104 పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. వ్యవసాయం దండగ అని రైతులను నీచంగా చూసిన చంద్రబాబు ఇప్పుడు దొంగ వాగ్దానాలతో మోసగించేందుకు వస్తున్నారని ఆమె హెచ్చరించారు. ఎల్లో మీడియా అండదండలతో చంద్రబాబు నాయుడు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రజలకు వీళ్ళు ఏం చేశారని కాంగ్రెస్, టిడిపిలకు ఓటు వేయాలో నిలదీయండి అని ప్రజ‌లు, పార్టీ శ్రేణులకు శ్రీమతి విజయమ్మ సూచించారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఓటు వేయాలా? పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోనందుకు ఓటు వేయాలా? అని ప్రశ్నించమని సలహా ఇచ్చారు.

సిబిఐ అంటే పంజరంలో చిలుక అని ఆ సంస్థ డైరెక్టరే ఒప్పుకున్నారని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. సిబిఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అని దాని మాజీ డైరెక్టరే చెప్పారు. కాంగ్రెస్ తనకు నచ్చనివాళ్లను వేధిస్తోందన్నారు. 26 జిఓలపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా జగన్‌బాబును ఇబ్బంది పెట్టిందన్నారు. కావాలనే సిబిఐ బెయిల్ రాకుండా అడ్డుకుంటోందన్నారు. జగన్‌బాబును ప్రశ్నించకుండా చార్జిషీట్‌లో పేరు పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. జగన్‌బాబు కాంగ్రెస్లో ఉంటే ‌సిఎం అయ్యేవారని ఆజాదే స్వయంగా చెప్పారన్నారు.

ఈ ప్రాంతీయ సదస్సుకు పార్టీ నేతలు వై.వి. సుబ్బారెడ్డి, జూపూడి ప్రభాకరరావు, అంబటి రాంబాబు, దాడి వీరభద్రరావు, పెన్మెత్స సాంబశివరాజు, సుజయ కృష్ణారంగారావు, ధర్మాన కృష్ణదాస్, జ్యోతుల నెహ్రు తదితరులు హాజరయ్యారు.‌ సదస్సుకు సుజయకృష్ణ రంగారావు అధ్యక్షత వహించారు.

Back to Top