సమైక్యాంధ్రను కొనసాగించండి

న్యూఢిల్లీ‌, 9 అక్టోబర్ 2013:

సమైక్రాంధ్ర కోసం వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ తన కార్యాచరణను‌ మరింత ఉధృతం చేసింది. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు పార్టీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ‌ నేతృత్వంలో నాయకులు, సిపిఎం పార్టీ నేత ఏచూరి సీతారాంతో కలిసి బుధవారం మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు.‌ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఆయనకు శ్రీమతి విజయమ్మ బృందం వినతిపత్రం సమర్పించింది.

సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాల్సి పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రణబ్ ముఖర్జీకి విజయమ్మ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత సీమాంధ్రలో నెలకొన్న ‌ఆందోళనకర పరిస్థితులను, విద్యుత్ ఉద్యోగుల సమ్మె, ఇతర ఉద్యోగ సంఘాల సమ్మెను ప్రణ‌బ్ దృష్టికి ‌శ్రీమతి విజయమ్మ తీసుకువచ్చారు.

రాష్ట్రపతి ప్రణబ్‌తో భేటి తర్వాత శ్రీమతి విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరినట్లు తెలిపారు. సమైక్యాంధ్రపై తాము అందజేసిన వినతిపత్రాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పూర్తిగా చదివారని, రాజ్యాంగ ప్రకారం తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారని శ్రీమతి విజయమ్మ మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర విభజన అంశంపై తెలంగాణ బిల్లును అసెంబ్లీకి పంపిస్తామని, తగిన సమయం కూడా ఇస్తామని తమకు ప్రణబ్‌ చెప్పారని ఆమె తెలిపారు.

16 నెలలు జైలులో ఉండి, మొన్ననే బయటికి వచ్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నెలరోజుల్లో రెండవసారి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండడం గురించి రాష్ట్రపతి అడిగి తెల్సుకున్నారని శ్రీమతి విజయమ్మ చెప్పారు. శ్రీ‌ జగన్ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ప్రణబ్ సూచించారని‌ తెలిపారు. జగన్‌బాబుకు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడం వల్లనే ఢిల్లీకి రాలేకపోయారని తాను‌ రాష్ట్రపతికి తెలిపానని శ్రీమతి విజయమ్మ అన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఏర్పడిన దుస్థితికి ప్రధానంగా కాంగ్రెస్, టిడిపిలే కారణమని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎం‌‌.పి.లు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు అని అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాలు చేసి ఉంటే సిడబ్ల్యుసి నిర్ణయం వచ్చేది కాదన్నారు.‌

తెలంగాణ విభజనకు 2001లో దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారని, ఇప్పుడు తాము ఆ ప్రక్రియను ముగించామని కాంగ్రెస్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్ ‌అనడాన్ని ఆమె తప్పుపట్టారు. ఆ సమయంలో రాష్ట్రం అంతటికీ సిఎల్పీ నాయకుడిగా ఉన్న వైయస్ఆర్‌ను తెలంగాణ నాయకులు కలిసి తమ డిమాండ్‌ను వ్యక్తంచేస్తే.. అదేదో మహానేతే చేసినట్లుగా చెప్పడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజించాలంటే అసెంబ్లీ తీర్మానం చేయాలని, రెండవ ఎస్సార్సీ వేయాలనే ఆయన తీర్మానం చేసి కేంద్రానికి పంపించారన్నారు. అప్పట్లో టిఆర్ఎస్‌ కూడా రెండవ ఎస్సార్సీకే సిద్ధపడి సంతకం చేసిన వైనాన్ని ఆమె ప్రస్తావించారు. రాష్ట్రాన్ని విభజించాలంటే 9 జటిలమైన సమస్యలను పరిష్కరించాలని కేంద్రానికి మహానేత స్పష్టంగా చెప్పారన్నారు.

తీర్మానాల ద్వారానే 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింద‌ని.. అసెంబ్లీ తీర్మానం చేయడం ద్వారానే వివిధ రాష్ట్రాల ఏర్పాటు జరిగిందని శ్రీమతి విజయమ్మ అన్నారు. అలాంటిది అసెంబ్లీ తీర్మానం లేకుండానే రాష్ట్రాన్ని ఎందుకు విభజించాల్సి వచ్చిందో కాంగ్రెస్‌ పార్టీ, చంద్రబాబు నాయుడు కూడా సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా టిడిపి లేఖలు ఇచ్చిన విషయాన్ని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎందుకు దీక్ష చేస్తున్నారో తెలపాల్సిన అవసరం ఉంది శ్రీమతి విజయమ్మ డిమాండ్ చేశారు. తెలంగాణ ఇవ్వాలని దీక్ష చేస్తున్నారా లేక ఏమని చేస్తున్నారన్నారు. విభజన త్వరగా పూర్తిచేయాలని ఢిల్లీకి వచ్చి చంద్రబాబు దీక్ష చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే.. అందరికి ఆమోదయోగ్యకరమైన రీతిలో నిర్ణయం తీసుకోవాలని గతంలో తాము సూచించామని.. అయితే ఇరుప్రాంతాలకు న్యాయం చేయకుండా.. ఏక పక్షంగా నిర్ణయం తీసుకున్నారని.. 60 శాతం మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విభజించడానికి వీలు లేదంటూ శ్రీకృష్ణ కమిటి ఇచ్చిన నివేదికను కేంద్రం ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారం నిర్ణయం తీసుకోమంటే.. రాష్ట్రాన్ని విభజించమని కాదన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూడమని అర్థం అన్నారు. రాష్ట్రంలోని 60 శాతం మంది ప్రజలు రోడ్ల మీద ఉండి ఆందోళన చేస్తుంటే.. వారికి కేంద్రం ఏమి సమాధానం చెప్పిందని నిలదీశారు.

తాము చెప్పేది ఆసాంతం విని, సానుకూలంగా స్పందించిన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి శ్రీమతి విజయమ్మ ధన్యవాదాలు చెప్పారు.

Back to Top