అవినీతిలో కూరుకుపోయిన ప్ర‌భుత్వం

  • వ‌రుసగా వెల్లడిస్తున్న సర్వే సంస్థలు
  • సంక్షేమ ప‌థ‌కాల పేరుతో తెలుగు త‌మ్ముళ్ల దోపిడీ
  • రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
  • రాయచోటి రూరల్‌: చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింద‌ని, ఏ సంక్షేమ కార్య‌క్ర‌మం ప్రారంభించినా దానిలో దోపిడీకి పాల్ప‌డుతున్నార‌ని  రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. స్థానిక వైయ‌స్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పాలనలో అన్ని రకాలుగా విఫలమైన టీడీపీ ప్రభుత్వం అవినీతిమయంగా మారిందన్నారు. ఇదే విషయాన్ని పలు పేరొందిన సర్వే సంస్థలు చేసిన సర్వేల్లో వెల్లడైంద‌న్నారు. గత ఏడాది ఎన్‌సీఏఈఆర్ అనే సంస్థ చేసిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో దేశంలోనే మొదటి స్థానంలో నిలవగా, ఈ ఏడాది సర్వే చేసిన సీఎంఎస్ ఏపీకి రెండో స్థానం ఇచ్చిందన్నారు. టీడీపీ కార్యకర్తలు అధికారం ఉందన్న అహంకారంతో ఇసుక నుంచి బొగ్గు దాకా, బొగ్గు నుంచి భూముల ఆక్రమణలు ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తూ దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. అడ్డువ‌చ్చిన అధికారుల‌ను బదిలీలు, సస్పెండ్‌లు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అవినీతి పాలతో పాటు అటవిక పాలన కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. దీంతో అభివృద్ది రాష్ట్రంలో పూర్తిగా కుంటుపడిందన్నారు. ప‌థ‌కాలు ప్రచార అర్భాటాలుగా మిగిలిపోయాయని పేర్కొన్నారు. ప్రజల చెంతకు చేరాల్సిన సంక్షేమ పథకాలు కార్యకర్తల చేతుల్లోకి వెలుతున్నాయని , రాజ్యాంగాన్ని పాలకులు నిర్వీర్యం చేశారని ఆవేద‌న వ్యక్తం చేశారు. న్యాయ, పోలీస్, అధికార వ్యవస్థలు తమ చేతుల్లో ఉన్నాయని, తాము చెప్పిందే చేయాలని ఆదేశాలు జారీ చేసే పరిస్థితికి దిగజారిపోతున్నారని మండిప‌డ్డారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రులకు ప్రజలను పరిపాలించే అర్హతలే లేవన్నారు. అసెంబ్లీ సాక్షిగా పనులు లేక వేలాది మంది ఇతర రాష్ట్రాలకు వలసలు వెలుతున్నారని చెబితే, వారు మెరుగైన జీవనం కోసం వెలుతున్నారని మంత్రి సమాధానం చెప్పడం దారుణమన్నారు. పక్క రాష్ట్రాల్లో మన కూలీలు బిక్షాటన చేస్తుంటే అది పాలకులకు మెరుగైన జీవనంగా కనిపించడం ఎంతో దారుణమో ప్రజలే గమనించాలని పేర్కొన్నారు.

    రూ.500కోట్లు నీరు–చెట్లు పనుల పేరుతో దోపిడీ
    వైయ‌స్సార్ జిల్లాలో గడిచిన రెండేళ్ల నుంచి నీరు–చెట్టు పేరుతో సుమారు రూ.500కోట్లు అధికార పార్టీ నాయకులు దోపిడీకి పాల్పడ్డారని ఎమ్మెల్యే స్ప‌ష్టం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ది ఏమాత్రం పట్టని ప్రభుత్వానికి కేవలం నీరు–చెట్టు పనులకు మాత్రమే నిధులు కేటాయిస్తోందన్నారు. కేంద్రం నుంచి వచ్చే ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, జాతీయ రహదారుల నిధులతో అక్కడక్కడా పనులు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పాలకవర్గ నాయకులకు, కార్యకర్తలకు నీరు–చెట్టు పనులకు తప్ప మరే పనికీ నిధులు ఇవ్వలేదన్నారు.
Back to Top