కేంద్రం నుంచి వచ్చిన నిధులేమయ్యాయి?


కాగ్ నివేదికలో  నాలుగో రిపోర్టును ఎందుకు దాచిపెట్టారు?
నీటిపారుదల, విద్యుత్ కొనుగోళ్లు వంటి అంశాలుండే రిపోర్టు ఏది?
పెద్ద మొత్తంలో అప్పులు ఎందుకు చేస్తున్నారో
చంద్రబాబు హయామంతా ఓవర్ డ్రాఫ్టుల మయం
కాగ్ నివేదికకు భయపడే ఎంపిలు రాజీనామాలకు దూరం
పిఎసి ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డ్



హైదరాబాద్‌: కేంద్రం నుంచి వచ్చిన నిధులు దుర్వినియోగం చేస్తూ.. ఇష్టారీతిగా చంద్రబాబు అప్పులు చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాగ్‌ రిపోర్టు వెల్లడించిన లెక్కలపై బుగ్గన హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాత్కాలికం అనే పేరుతో విచ్చల విడిగా నిధుల దుర్వినియోగం, నీరు–చెట్టు పథకం ద్వారా టీడీపీ కార్యకర్తలకు డబ్బులు దోచిపెట్టడం తప్ప చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. కాగ్‌ రిపోర్టుకు భయపడే టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. కాగ్‌ రిపోర్టు బయటపెట్టిన నిజాలు బుగ్గన మాటల్లోనే...

కాగ్‌ మూడు రకాల ఆడిట్‌లు చేస్తారు. ఒకటి ఫైనాన్స్‌ ఆడిట్, కంప్లయిన్స్‌ ఆడిట్, పర్ఫామెన్స్‌ ఆడిట్‌ చేస్తారు. కాగ్‌కు స్వతంత్రత, లక్ష్యం, సమగ్రత, విశ్వసనీయత, సమర్థత, పారదర్శకత, అనుకూలమైన విధానం అనే లక్ష్యాలతో ఆడిట్‌లు చేస్తారు. దేశంలోని ముఖ్యమైన సంస్థల్లో కాగ్‌ ఒకటి. రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాల ఖర్చులను జనరల్‌గా కాగ్‌ ఆడిట్‌ చేసినప్పుడు సెక్టార్‌ల వారిగా డివైడ్‌ చేశారు. సాధారణ సెక్టార్‌లో ఫైనాన్స్, హోమ్, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌. సోషల్‌ సెక్టార్‌లో వెల్ఫేర్, స్థానిక సంస్థలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు, ఆర్థిక విభాగానికి ఒక్కో విభాగం ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వం చేసే పరిపాలనను మూడు రకాల ఆడిట్‌లుగా చేస్తుంటారు. దీంట్లో ఆర్థిక విభాగం ముఖ్యమైనది. 

ఎకనామిక్‌ సెక్టార్‌లో వ్యవసాయం, నీటి పారుదల, రోడ్లు, భవనాలు, అరణ్యశాఖ, పరిశ్రమ, విద్యుత్‌ శాఖ ఉంటాయి. వీటిని రిపోర్టు నెంబర్‌ 4 అంటారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో నాల్గవ రిపోర్టు టేబుల్‌ చేయలేదు. ఎందుకు అనేది ప్రశ్న. కాగ్‌ ఒక రిపోర్టు తయారు చేసిన తరువాత అది ప్రభుత్వానికి సమర్పిస్తుంది. అది అసెంబ్లీలో పెడితేనే పబ్లిక్‌ డాక్యుమెంట్‌ అవుతుందన్నారు. ప్రజలు స్టడీ చేయడానికి  అవకాశం ఉంటుంది. నీటి పారుదల శాఖలో ఏమైనా అవకతవకలు ఉన్నాయా..? అందుకే అసెంబ్లీలో టేబుల్‌ చేయలేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం పనితీరు ప్రశ్నార్థకం, చిత్తశుద్ధి, నీతి, అవినీతి ప్రశ్నార్థకంగా ఉంది. బొగ్గు కొనుగోలు, వ్యవసాయరంగంలో వాగ్ధానాలు పూర్తి చేయలేదా.. ఇవన్నీ ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఎప్పుడు జరగని విధంగా టేబుల్‌ చేయకపోవడం ప్రశ్నార్థకం.
 
టీడీపీ ఎంపీలు కాగ్‌ రిపోర్టుకు భయపడే రాజీనామాలు చేయించలేకపోయారా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం (ఫిజికల్‌ రెస్పాన్సబులిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌) చట్టం ప్రకారం రాష్ట్రాలు విచ్చల విడిగా అప్పులు చేయవద్దు. 2014–15లో ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం.. రాష్ట్ర స్థూల ఉత్పత్తి కంటే 3 శాతం మించి అప్పు చేయడానికి వీలుపడదు. కానీ చంద్రబాబు 2014–15లో ద్రవ్యలోటు  రూ. 31,700 కోట్లు ఉంటే 6.1 ఒక్క శాతం అప్పు చేశారు. ఎందుకు అని ప్రశ్న అడిగితే ప్రశ్న సమాధానం లేదు. 2015–16లో ద్రవ్యలోటు రూ. 22 వేల కోట్లు ఉంటే 3.66 శాతం అప్పు చేశారు. 2016–17 రూ.31 వేల కోట్లు ఉంటే 4.42 మళ్లీ మూడు శాతం దాటింది. ఇంత ఎక్కువ అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది.  
చంద్రబాబు అధికారం చేపట్టిన మొదటి సంవత్సరం నుంచి అప్పులు చేస్తూనే ఉన్నారు. ఇంత పెద్ద మొత్తంలో అప్పులు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. 2014–15 రాష్ట్ర అవతరణ రూ.1,48,700 అప్పు, అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో 2013–14లో రూ. 1.90 లక్షల కోట్లు ఉండేది. కానీ మొదటి సంవత్సరమే పెద్ద మొత్తంలో అప్పు చేశారు. 2015–16లో రూ. 1.74 లక్షల కోట్లకు అప్పు పెంచారు. 2016–17లో రూ.2 లక్షల కోట్ల అప్పు చేశారు. రాష్ట్ర విభజనకు ముందు అప్పు స్థూల ఉత్పత్తిలో భాగంగా చూస్తే 22 శాతం ఉండేది. చంద్రబాబు దాన్ని 29 శాతానికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో డబ్బులు లేవనేది (ఓడి) 2016–17కు సంబంధించి రూ. 29,154 వేల కోట్లు ఓడీ మీద పోయారు. 260 రోజులు ఓడి మీద ప్రభుత్వాన్ని నడిపారు. రిపోర్టు చూస్తే 2004 నుంచి 2009 వరకు ప్రభుత్వాలు ఎప్పుడూ ఓడీమీద నడపలేదు. కానీ చంద్రబాబు వస్తానే 2014–15 మొదటి సంవత్సరమే రూ. 6,200 కోట్లు ఓడీలో ఉన్నారు. 2015–16లో రూ.31.300 కోట్లు, 2016–17 ప్రకారం రూ. 29,150 కోట్లు ఓడీలో ఉన్నారు. 
రెవెన్యూ లోటు..
చంద్రబాబు మూడు సంవత్సరాల పాలనలో ఇంచుమించు రూ. 70 వేల కోట్ల రెవెన్యూ లోటు సాధించారు.  2014–15లో రూ.24,300 కోట్లు, 2015–16లో రూ. 7 వేల కోట్లు, 2016–17లో రూ. 17 వేల కోట్ల రెవెన్యూ లోటు ఉంది. ఇన్ని డబ్బులు ఏం చేశారనేది ప్రశ్న. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎప్పుడూ లేని విధంగా వస్తున్నాయినా.. ఇంత లోటు ఎందుకు వచ్చిందో చంద్రబాబు సమాధానం చెప్పాలి. 2012–13లో రూ. 7,700 కోట్లు, 2013–14లో రూ. 9 వేల కోట్లు కేంద్రం ఇస్తే.. 2014–15లో రూ. 22 వేల కోట్లకు పెంచింది.  2015–16కు రూ.22 వేల కోట్లు, 2016–17లో రూ.23,500 కోట్లుకు పెంచింది. ఇదికాక ప్రత్యేక గ్రాంట్లు కూడా వచ్చాయి. ఈ డబ్బులు అన్నీ ఎక్కడ పోయాయో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి. 
కాగ్‌ రిపోర్టు ప్రకారం ఒక సంవత్సరంలోపు అప్పు కట్టాల్సింది రూ.6 వేల కోట్లు, మూడు సంవత్సరాల్లోపు రూ. 20 వేలు, 3 నుంచి 5 సంవత్సరాల్లో రూ. 22 వేల కోట్లు, ఏడు సంవత్సరాల్లో రూ. 28 వేల కోట్ల, ఏడు సంవత్సరాలపైన రూ. 73 వేల కోట్లు కట్టాలని చెప్పారు. సంవత్సరాలకు వేల కోట్లు కట్టాలంటే మీరు శాశ్వతంగా ఉంటారా.. వచ్చే ప్రభుత్వాలు ఎలా కడతాయి. 

పోలవరం నేను కడతానని చెప్పిన చంద్రబాబు రూ. 16 వేల కోట్లు కాస్తా రూ. 58 వేల కోట్లు అవుతున్నాయని చెబుతున్నారు. కేంద్రం కడతానంటే రాష్ట్రం ఎందుకు తీసుకుంది.  ముడుపులు, పర్సంటేజ్‌ల కోసమా..? రాజధానికి భూములు, డబ్బులు ఇస్తాం కట్టండి అంటే ఆ డబ్బులు వాడకుండా చేశారు. ఆ డబ్బులు ఏం చేశారని కేంద్రం ప్రశ్నిస్తుంది. దీనికి సమాధానం చెప్పకుండా డబ్బులు ఇవ్వలేదని డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కటి తాత్కాలికంగా కట్టడం తప్ప.. శాశ్వత భవనం ఒక్కటి లేదు. వెలగపూడిలో కట్టిన నాలుగు భవనాలు వర్షం పడితే బయటికంటే ఎక్కవ నీరు లోపలే ఉంటుంది. పబ్లిసిటీ, ప్రయాణానికి, ఎకనామిక్‌ డౌలప్‌మెంట్‌ బోర్డు ఖర్చు, వైజాగ్‌లో నోవాటెల్‌కు కట్టిన బిల్లులతో మంచి శాశ్వత భవనాలు నిర్మించవచ్చు. 
Back to Top