ఇది ఆంధ్రప్రదేశా లేక ఆఫ్ఘనిస్తానా

టీడీపీ నేతల దాడికి నిరసనగా..
తిరుపతిలో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన..వైఎస్సార్సీపీ మద్దతు
ప్రజాస్వామ్యమా లేక ఆటవిక రాజ్యమాః చెవిరెడ్డి ఫైర్

తిరుపతిః డీఎస్సీ అభ్యర్థులపై టీడీపీ నేతల దాడిని నిరసిస్తూ తిరుపతిలో ఆందోళనలు మిన్నంటాయి.  ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బూట్ పాలిష్ చేస్తూ డీఎస్సీ అభ్యర్థులు నిరసన చేపట్టారు. వీరి ఆందోళనకు వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించింది. ఈసందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మెరిట్ లిస్ట్ ప్రకటించమని అడిగినందుకు డీఎస్సీ అభ్యర్థులను తెలుగుదేశం గూండాలు చితకబాదడం దారుణమని మండిపడ్డారు. మనం ఆంధ్రప్రదేశ్ లో బతుకుతున్నామా లేక ఆప్ఘనిస్తాన్ లో బతుకున్నామో అర్థం కావడం లేదన్నారు. 

వాడవాడ, వీధివీధి, గోడగోడలో లో బాబు వస్తే జాబు వస్తుందని భారీ ఎత్తున ఊకదంపుడు ప్రకటనలు చేసిన తెలుగుదేశం....ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందని చెవిరెడ్డి మండిపడ్డారు. జాబెక్కడ బాబు అని అడుగుతుంటే వారిపై దాడులు చేయడం అమానుషమన్నారు.  ఇప్పటికే పోలీసులను రౌడీల్లా మార్చిన చంద్రబాబు...తెలుగుదేశం నాయకులను గూండాల్లా తయారు చేశారని విరుచుకుపడ్డారు.

 న్యాయపరమైన డిమాండ్లు కోరినందుకు డీఎస్సీ అభ్యర్థుల తలలు పగలగొట్టారన్నారు. ఇంతగా దిగజారి భయభ్రాంతులకు గురిచేసి వాళ్లపై దాడి చేయడం దారుణమన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఆటవిక రాజ్యమా అంటూ చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు అండగా వైఎస్ జగన్ నాయకత్వంలో అసెంబ్లీలో ప్రభుత్వ నీచసంస్కృతిని ఎండగడతామన్నారు.  

Back to Top