బ‌డుగుల‌ను అణ‌గ‌దొక్కుతున్న చంద్ర‌బాబు

కర్నూలు : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇవ్వకుండా అన్యాయం చేశారని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి విమర్శించారు. ముఖ్యంగా గిరిజనులు, మైనార్టీలకు చెందిన వారిలో ఒక్కరికీ మంత్రి పదవి ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పదవులు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆరోపించారు. సీఎం చంద్రబాబునాయుడుకు దమ్మూ, ధైర్యం ఉంటే 21 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని తమ పార్టీ అధినేత వైయ‌స్ జగన్ మోహ‌న్‌రెడ్డి చేసిన సవాల్‌ను స్వీక‌రించాలన్నారు. లోకేశ్‌ను ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిపించుకునే ధైర్యం లేక దొడ్డిదారిన ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా క్షేత్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతుకావడం ఖాయమన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌరు చ‌రితారెడ్డితో పాటు న‌గ‌ర కమిటీ అధ్యక్షుడు నరసింహులు యాదవ్‌ ముఖ్యఅతిథులుగా పాల్గొని  జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ...బాబు జగ్జీవన్‌రామ్‌ స్ఫూర్తితో తమ పార్టీ అధికారంలోకి వస్తే బడుగు,బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తామ‌న్నారు. చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు మతాలు, కులాల వారిగా ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కరికీ న్యాయం చేయలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని, బీసీ సబ్‌ ప్లాన్‌ పేరుతో నిధులు మంజూరు చేసి ఒక్క రూపాయి ఖర్చుచేయకపోవడం తెలుగుదేశం ప్రభుత్వం దుర్నీతికి అద్దం ప‌డుతోంద‌న్నారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శౌరీలు విజయకుమారి, నాయకులు మద్దయ్య, ఫిరోజ్, కర్నాటి పుల్లారెడ్డి, జహీర్‌ అహ్మద్‌ఖాన్, ఈశ్వర్, మహబూబ్‌బాషా, జగదీశ్, అశోక్‌బాబు, జీవరత్నం, సోలోమన్, కిశోర్, ఎం.రంగయ్య, మాధవస్వామి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top