చంద్రబాబు వికృత రాజకీయాలు

ప్రజాసమస్యలు గాలికొదిలి ప్రతిపక్షంపై కక్షసాధింపు
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నీచ రాజకీయాలు
ఇచ్చిన హామీలు నేరవేర్చలేక ఎమ్మెల్యేలతో బేరసారాలు
పచ్చకండువాలు కప్పుతూ పైశాచికానందం
వాపును చూసి బలుపు అనుకోవడం మూర్ఖత్వమే
చంద్రబాబుకు ప్రజలు వాత పెట్టడం ఖాయంః ప్రజా,రాజకీయ పక్షాలు
 
ప్రజాసంక్షేమంపై దృష్టిసారించాల్సిన ముఖ్యమంత్రి..ప్రతిపక్షంపై కక్షసాధింపుకు పాల్పడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేక...దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. స్వయంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ  రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారు. ఏపీ సీఎంగా అధికారం చేప‌ట్టిన రోజు నుంచే చంద్ర‌బాబు ఫిరాయింపుల‌కు తెరలేపారు.  ఆనాటి నుండి నేటివరకు ప్రజాసమస్యలను గాలికొదిలి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడమే పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి చర్యలు బాబు నీతిమాలిన రాజకీయాలకు నిలువెత్తు నిదర్శమని పలువురు నేతలు విమర్శిస్తున్నారు.  

అధికారంలోకి వస్తూనే బాబు  వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్ద‌రు ఎంపీల‌కూ ప‌చ్చ కండువా క‌ప్పి టీడీపీలోకి ఆహ్వానించి వికృత రాజ‌కీయాలు మొద‌లుపెట్టారు. ఆ త‌ర్వాత కొంత‌మంది ఎంపిక చేసిన పార్టీ ఎమ్మెల్యేల‌కు ఫిరాయింపుల బాధ్య‌త‌ను అప్ప‌గించారు. ప్ర‌తిప‌క్ష పార్టీ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేల‌ను తీసుకొచ్చిన వారికి మంత్రి ప‌ద‌వులు, కాంట్రాక్టులు ఇవ్వ‌డంతో పాటు డ‌బ్బు సంపాద‌నకు మార్గాలు క‌ల్పిస్తాన‌ని బాబు ప్ర‌లోభ పెడుతున్నారు. మ‌రోవైపు ఆయ‌నే నేరుగా రంగంలోకి దిగి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల‌తో బేరసారాలు సాగిస్తున్నారు. భారీగా డ‌బ్బుతో పాటు మంత్రి ప‌ద‌వుల ఆశ చూపుతూ సంతలో పశువుల మాదిరి బేరం చేస్తున్నారు.  కాంట్రాక్టులిస్తాం, రాజ‌ధానిలో భూములిస్తాం , కేసులు ఎత్తివేస్తామ‌ంటూ  ప్ర‌లోభ‌పెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల గుర్తు ప్యాన్‌పై గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను బాబు టీడీపీలో చేర్చుకున్నారు. 

త‌మ‌కు రూ. 20 కోట్ల వ‌ర‌కు ఇస్తామ‌ని టీడీపీ నుంచి ప్ర‌లోభాలు వ‌చ్చాయ‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పీడిక రాజ‌న్న‌దొర‌, గిడ్డి ఈశ్వ‌రి, వి. రాజేశ్వ‌రిలు బహిరంగంగానే వెల్లడించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చ‌ట్టానికి తూట్లు పొడుస్తూ, ప్ర‌జాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బాబు అకృత్యాల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేయాల్సిన మీడియా సైతం చూసీచూడ‌న‌ట్లు వ్య‌వ‌హారిస్తోంది. ఇక టీడీపీ అనుకూల ఎల్లో మీడియా చంద్ర‌బాబు ఏదో ఘ‌న‌కార్య‌ం సాధించిన‌ట్లు గొప్ప‌గా క‌థ‌నాలు వార్చి వ‌డ్డించడం అత్యంత హేయనీయం. ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ.   ప్ర‌జాస్వామ్య‌ సౌధానికి నాలుగో స్తంభంగా ఉండాల్సిన మీడియా ప్ర‌జాస్వామ్య హ‌సనంలో భాగ‌స్వాములు కావ‌డం శోచ‌నీయం. 

ఎన్నిక‌ల‌కు వెళ్లే ధైర్యం లేదు...
రాష్ట్రాభివృద్ధి కోసం చంద్ర‌బాబు చేస్తున్న కృషిని చూసి పోతున్నామని, నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోస‌మే పార్టీ మారుతున్న‌ామంటూ ఫిరాయింపుదారులు చిల‌క ప‌లుకులు ప‌లుకుతున్నారు. పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేల‌కు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిపై నిజంగా అంత ప్రేముంటే... ప‌ద‌వికి రాజీనామా చేసి ప్ర‌జ‌ల‌ను ఒప్పించి, మెప్పించి, ఓట్లు సాధించి మ‌ళ్లీ గెలిచి త‌మ నిజాయితీని, నిబ‌ద్ధ‌త‌ను నిరూపించుకోవాలి. కానీ వారిలో ఏ ఒక్క‌రూ రాజీనామా ఊసే ఎత్త‌డం లేదు. బాబు వారితో రాజీనామా చేయించ‌కుండా నిస్సిగ్గుగా ప‌చ్చ కండువా క‌ప్పి ఆహ్వానిస్తున్నారు. అన‌ర్హ‌త వేటు వేయాల్సిన స్పీక‌ర్ కూడా ఆ దిశ‌గా చర్య‌లు తీసుకోవ‌డం లేదు. రెండేళ్ల పాల‌నలో అష్ట‌క‌ష్టాలు భ‌రిస్తున్న ప్ర‌జ‌లు... టీడీపీకి ఓటేయరని తెలియడం వల్లే  చంద్ర‌బాబు వారితో రాజీనామా చేయించే సాహసం చేయ‌డం లేద‌ు. నిజంగా రాష్ట్రాభివృద్ధి చేశామ‌న్న న‌మ్మ‌కమే ఉంటే  పార్టీలోకి వ‌చ్చిన ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి, ఎన్నిక‌ల్లో గెలిపించి ప్రజాస్వామ్య‌వాదిన‌ని నిరూపించుకోవాల‌ని ప్ర‌జాసంఘాలు, రాజ‌కీయ ప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 

రాజ్యాంగ సంస్థ‌ల దుర్వినియోగం...
ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించేందుకు చంద్ర‌బాబు రాజ్యాంగ సంస్థ‌ల‌ను కూడా దుర్విన‌యోగం చేస్తున్నారు. ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షం ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా అధికార‌ప‌క్షం నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించింది. అవిశ్వాసంపై నోటీసు అందుకున్న వెంట‌నే బీఏసీ నిర్వ‌హించి అప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చ‌ను చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌తిప‌క్షం త‌న ఎమ్మెల్యేల‌కు విప్ జారీ చేసేందుకు కూడా అవ‌కాశం ఇవ్వ‌లేదు. తీర్మానం ప్ర‌తిపాదించిన త‌ర్వాత త‌గినంత స‌మ‌యం ఇవ్వాల్సి ఉంటుంద‌ని ప్ర‌తిప‌క్షం వాదించినా, డివిజ‌న్ కోసం ప‌ట్టుబ‌ట్టినా ఖాత‌రు చేయ‌లేదు. స్పీక‌ర్‌పై అవిశ్వాస తీర్మానం స‌మ‌యంలోనూ ఇదే తీరుగా వ్య‌వ‌హ‌రించి ప్ర‌తిప‌క్షం విప్ జారీ చేసే అవ‌కాశం ఇవ్వ‌లేదు. 

14 రోజుల వ్య‌వ‌ధి ఉండాల‌న్న శాస‌న‌స‌భ నియ‌మావ‌ళిలోని 71వ నిబంధ‌న‌ను  సైతం స‌స్పెండ్ చేసి రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. ద్ర‌వ్య వినిమయ బిల్లుపై ఓటింగ్‌లోనూ చంద్ర‌బాబు దొంగాట ఆడారు. వైఎస్సార్ సీపీ విప్ జారీ చేయ‌డంతో...  ఫిరాయింపుదారులు అన‌ర్హ‌త‌కు గుర‌వుతార‌న్న భ‌యంతో బాబు ఓటింగ్‌కు వెన‌క‌డుగు వేశారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా మూజువాణి ఓటుతో అధికార‌ప‌క్షం బ‌య‌ట‌ప‌డింది. డివిజ‌న్‌కు ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌ట్టుప‌డుతున్నా స్పీక‌ర్ పట్టించుకోలేదు. అధికారపార్టీకి కొమ్ముకాస్తూ ఏకపక్షంగా వ్యవహరించారు. 
 
ఓట‌ర్ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయ‌డ‌మే...
ఏ పార్టీ త‌ర‌ఫునైనా పోటీచేసిన అభ్య‌ర్థుల‌ను వ్య‌క్తిగ‌తంగా చూసి ప్ర‌జ‌లు ఓట్లు వేయ‌రు. ఆయా పార్టీల‌ను, ఆ పార్టీ ముఖ్య నాయ‌కుల‌ను, హామీల‌ను, విధానాల‌ను గ‌మ‌నించి ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా ఓట్లు వేస్తారన్నది వాస్తవం.  ఒక పార్టీ త‌ర‌ఫున పోటీచేసి ఎన్నికైన వారు పార్టీలు మార‌డ‌మంటే అది వారి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు, ఓట‌ర్ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసిన‌ట్టే. ఇది ఏ మాత్రం మంచి ప‌ద్ధ‌తి కాదు. స‌మ‌ర్థ‌నీయం అంత‌క‌న్నా కాదు.  పార్టీ మారిన ఎమ్మెల్యేలు చ‌ట్ట‌స‌భ‌ల్లోకి వెళ్ల‌డానికి ద‌క్కిన స‌భ్య‌త్వాన్ని త‌ప్ప‌నిసరిగా వ‌దులుకోవాలి. త‌న శాస‌న‌స‌భ్య‌త్వానికి రాజీనామా చేసి వెళ్లాలి. అలా గాకుండా నేరుగా పార్టీ మార‌డాన్ని ప్ర‌జాస్వామ్య‌వాదులు ఎవ‌రూ హ‌ర్షించ‌రు. 

పార్టీ మారిన ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన‌ప్పుడు ప్ర‌జ‌ల నుంచి చీత్కారం త‌ప్ప‌దు. నాయ‌కులు పార్టీలు మారినంత మాత్రాన ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వారికి ఓట్లువేసి గెలిపించిన ఓట‌ర్లు అంద‌రూ మారిన‌ట్లు కాదని పలువురు నేతలు పేర్కొన్నారు. వాపును చూసి బలుపు అనుకోవడం మూర్ఖత్వమని, చంద్రబాబుకు ప్రజలు వాత పెట్టడం ఖాయమని అంటున్నారు.  ప్ర‌తిప‌క్ష పార్టీలో గెలిచిన వారిని బాబు తన పార్టీలోకి తీసుకోవడాన్ని ప్రజలు ఏమాత్రం సహించరని స్పష్టం చేశారు.   గ‌తంలో త‌న‌వైపు వ‌చ్చిన ఎమ్మెల్యేల చేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాజీనామా చేయించి ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లారని, అలా ప్రజల తీర్పుతో వారిని గెలిపించుకొని చ‌ట్ట‌బ‌భ‌కు వ‌చ్చారని గుర్తుచేశారు. 
Back to Top