చంద్రబాబు మరో రూథర్ ఫర్డ్

()సీఐడీ నోటీసులు బాబు దాష్టీకానికి పరాకాష్ట
()కాపులకు ఇచ్చిన ప్రమాణాన్ని ఖూనీ చేశాడు
()బాబు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు
()సీఐడీ విచారణ అనంతరం మీడియాతో భూమన వ్యాఖ్యలు

గుంటూరుః సీఐడీ విచారణ వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తనకు సీఐడీ నోటీసులు ఇవ్వడం చంద్రబాబు చేస్తున్న దాష్టీకానికి పరాకాష్ట అని నిప్పులు చెరిగారు. కాపు కులం పట్ల బాబు రూథర్ ఫర్డ్ లాగా వ్యవహరిస్తున్నాడని విరుచుకుపడ్డారు. కాపులను బీసీల్లో చేర్చుతానని చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని, వారి జీవితాలను  కాంతివంతం చేస్తానని ప్రమాణం చేశారని గుర్తు చేశారు.  కాపుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వారికిచ్చిన  ప్రమాణాన్ని ఖూనీ చేశారని ధ్వజమెత్తారు.

గుంటూరులో సీఐడీ విచారణ అనంతరం భూమన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చేసిన మోసం వల్ల నష్టపోయిన కాపు జాతికి మేలు చేయాలన్న ఉద్దేశ్యంతో ముద్రగడ పద్మనాభం పోరాటానికి దిగారని భూమన చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలన్న డిమాండ్ తో  ఆయన చేసిన పోరాటానికి తాము మద్దతిచ్చామన్నారు. ఇకముందు కూడా కాపుల ఉద్యమానికి తమ మద్దతుంటుందని స్పష్టం చేశారు. ఇందుకు వైయస్సార్సీపీ కట్టుబడి ఉందన్నారు. చంద్రబాబు అప్రజాస్వామికంగా తనపై ఎన్ని పద్దతులు ప్రయోగించినా భయపడే ప్రసక్తే లేదని అన్నారు. 

బాబు రూథర్ ఫర్డ్ మార్గాన్ని ఎంచుకొని కాపులను అణగదొక్కుతున్నాడని భూమన మండిపడ్డారు. చంద్రబాబు- కాపుల సంబంధం... పాము- కప్పల సంబంధమని అన్నారు. కాపులను బాబు మింగేస్తున్నాడని విమర్శించారు.  కాపులకు మద్దతిచ్చిన కారణంగానే తమ అధ్యక్షులు వైయస్ జగన్ ను బద్నాం చేసేందుకు బాబు కుయుక్తులు పన్నుతున్నారని ఆగ్రహించారు. తుని ఘటనతో తనకెలాంటి సంబంధం లేకున్నా,  పోలీసులు నిష్పక్షిపాతంగా చేస్తారన్న నమ్మకంతోనే విచారణకు వచ్చానని చెప్పారు. రేపు మళ్లీ విచారణకు రమ్మన్నారని, బాబు ఒత్తిళ్లకు తలొగ్గే  ప్రసక్తే లేదని భూమన తేల్చిచెప్రారు. 

భూమన కరుణాకరరెడ్డిని విచారించే సందర్భంగా.. పోలీసులు గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్డు మీద.. సీఐడీ కార్యాలయానికి అవతలివైపు ఉన్న వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. తాము ఆఫీసులోకి రాలేదని.. అలాంటప్పుడు ఎందుకు తమను వెళ్లిపొమ్మంటున్నారని అడిగినా వినిపించుకోలేదు. దీనిపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మండిపడ్డారు. ''మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామో, పాకిస్థాన్‌లో ఉన్నామో అర్థం కావట్లేదు. మేం రోడ్డుమీద ఉన్నాం. వెళ్లిపోవాలంటే కరుణాకర రెడ్డిని ఏం చేయబోతున్నారో అర్థం కావట్లేదు. ఆయన ఏ తప్పు చేయలేదన్న విషయం అందరికీ తెలుసు.  ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. 

చంద్రబాబు తాను చేసిన తప్పుల నుంచి తప్పించుకోడానికి మరో తప్పు చేస్తున్నారని చెవిరెడ్డి ఆరోపించారు. ఆరోజు జరిగిన విధ్వంసం ప్రభుత్వమే చేసి ఉంటుందని తమకు అనుమానం కలుగుతోందన్నారు. వైయస్ జగన్ సీబీఐ దర్యాప్తు కోరినా, ప్రభుత్వం ఒప్పుకోలేదని తెలిపారు. ప్రభుత్వం వెనుక నుంచి నడిపించిందన్న విషయం బయటపడుతుందనే సీబీఐ విచారణకు అంగీకరించలేదన్నది అర్థమవుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ పరోక్షంగానో, ప్రత్యక్షంగానో హింసాత్మక చర్యలు చేపట్టిందన్న అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు. కరుణాకరరెడ్డికి ఏం జరిగినా సహించేది లేదన్నారు. పోలీసు అనే పదానికి ఉన్న విలువను ఈ ప్రభుత్వం దిగజారుస్తోంది'' అని చెవిరెడ్డి ధ్వజమెత్తారు. 
Back to Top