చంద్రబాబు నాయుడు అవాక్కయ్యారు!

- పేరూరులో చంద్రబాబును నిలదీసిన మహిళలు
- జవాబు చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అయిన బాబు

పేరూరు (అనంతపురంజిల్లా), 8 అక్టోబర్‌ 2012: ఎప్పుడూ తాను చెప్పేదే జనం వినాలన్న ధోరణిలో ముందుకు పోయే చంద్రబాబు నాయుడు ప్రజలు వేసిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేక అవాక్కయిపోయిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. తన విధానానికి భిన్నంగా వ్యవహరించి ప్రజల నుంచి స్పందన రాబట్టుకోవాలనుకున్న ఆయన మహిళలు అడిగిన అంశాలకు జవాబులు దొరక్క ఉక్కిరిబిక్కిరయ్యారు. అనంతపురం జిల్లాలో చంద్రబాబు నిర్వహిస్తున్న పాదయాత్ర ఆరవ రోజున పేరూరులో చోటుచేసుకున్న ఈ సంఘటన అందరినీ ఆకర్షించింది.

అనంతపురం జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదివారంనాడు ఆరవ రోజు పాదయాత్రను పేరూరు నుంచి కంబదూరు మీదుగా కుర్లపల్లి వరకూ కొనసాగించారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత మండలం (రామగిరి) పరిధిలోని పేరూరులోనే చంద్రబాబుకు ఈ ఊహించని చేదు అనుభవం ఎదురైంది. ప్రజలు తమ సమస్యలు చెప్పాలని చంద్రబాబు అడిగారు. ఆ వెంటనే మైకు అందుకున్న స్థానికులు ప్రశ్నల వర్షం కురిపించారు. కరెంటు, మంచినీళ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు ఇలా అనేక సమస్యలపై‌ వారు చంద్రబాబును నిలదీశారు. టీడీపీ హయాంలోనూ, పరిటాల రవి ఉన్నప్పుడు కూడా తమ బతుకులు ఇలాగే ఇబ్బందుల మధ్యే కొనసాగించామంటూ వారు కుండబద్దలు కొట్టారు. దీంతో బాబు నీళ్లు నమిలారు.

కాగా, చంద్రబాబు ఉక్కిరిబిక్కిరయ్యేలా ప్రశ్నలు సంధిస్తున్న మహిళలను రాప్తాడు ఎమ్మెల్యే సునీత వారించే ప్రయత్నం చేశారు. చివరకు ప్రజల నుంచి మైకులు వెనక్కి తీసేసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులతో ఉపన్యాసాలు చెప్పించారు. 

మీ సమస్యలు చెప్పండంటూ చంద్రబాబు అడిగినప్పుడు స్థానికులు చెప్పిన విషయాలు వారి మాటల్లోనే...:
‘ఏం సమస్యలున్నాయో చెప్పండంటున్నావ్! 40 ఏళ్ల నుంచి పేరూరులో‌నే ఉంటున్నా. గేదెలు కాసి పాలు అమ్ముకుని బతుకుతాండా. పరిటాల రవి, కాంగ్రెసోళ్లు, సునీతమ్మ ఎవరొచ్చినా ఇల్లు ఇవ్వలేకుండారు. ఇంకేమి సమస్యలు చెప్పేది? పనిలేకనా..?’
- రామగిరి మండలం పేరూరుకు చెందిన వెంకటలక్ష్మమ్మ

‘ఎవ్వరూ మాకు ఏం సేసింది లేదు. కాంగ్రెసోళ్లు చెయ్యలేదు. టీడీపీ వాళ్లూ అంతే. అట్టాంటప్పుడు ఏం సెప్పినా దేనికి..?’
- పేరూరుకు చెందిన షమీమ్ ప్రశ్న

‘ఏందో ‘మీ కోసం.. మా కోసం.. నా కోసం’ అంటూ యాత్ర చేపట్టినావు. ఎందుకు చేస్తాండావో! దీంతో ప్రజలకు ఏం ఉపయోగమో తెలీడం లేదు. ఇంతకూ ఈ యాత్రతో ప్రజల సమస్యలు తీరతాయంటావా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేదు?’
- పేరూరు గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి నిలదీత

నేను పేదవాళ్ల కోసమే బతుకుతున్నా: బాబు:
‘నేను పేదవాళ్ల కోసమే బతుకుతున్నా. ఎలాంటి స్వార్థమూ లేదు’ అని చంద్రబాబు పాదయాత్రలో వివిధ గ్రామాల్లో ప్రసంగిస్తూ పేర్కొన్నారు. సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని ఒడ్డుకు చేర్చాలనేదే తన తపన అన్నారు. ‘రాష్ట్రాన్ని మంత్రులంతా దోచుకున్నారు. రూ. కోట్లను బ్యాంకుల్లో దాచుకున్నారు. వీరందరినీ జైల్లో పెట్టాలి. వీరి కోసం అదనంగా జైళ్లను నిర్మించాలేమో.. ఈ అవినీతి కాంగ్రెస్‌కు తెలిసే జరిగింది’ అని చంద్రబాబు మండిపడ్డారు. తాను అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు మేలు చేస్తానన్నారు.

‘బీసీ డిక్లరేషన్‌ ప్రకటించాం. బీసీలకు వంద సీట్లు, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తా. 
రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తా. ఎస్సీ వర్గీకరణ చేస్తా. స‌చార్‌, రంగనాథ్‌ మిశ్రా కమిటీలతో ముస్లింలకు అన్యాయం జరిగింది. నేను అధికారంలోకి వస్తే రూ. 2,500 కోట్లతో ముస్లింలకూ ప్రత్యేక ప్యాకేజీ ఇస్తా’ అని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ సి.ఎం.రమేశ్‌ నాయుడు, ఎమ్మెల్యేలు పయ్యావుల, పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Back to Top