<strong>హైదరాబాద్, 12 డిసెంబర్ 2012:</strong> ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ బిల్లు సవరణలపై తెలుగుదేశం పార్టీ, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆడిన దొంగాటలో పాల్గొనడం ఇష్టం లేకే తాము శాసన మండలిలో బిల్లు సవరణలపై ఓటింగ్‌లో పాల్గొనలేదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు దేశాయి తిప్పారెడ్డి, సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. మండలి మీడియా పాయింట్ వద్ద మంగళవారంనాడు తిప్పారెడ్డి ఈ విషయం తెలిపారు. ఎస్సీ, ఎస్టీల మేలును సంపూర్ణంగా కోరుకుంటున్నామని అందుకే తాము బిల్లుకు మద్దతు తెలిపామన్నారు. సవరణలను వ్యతిరేకిస్తూ ఓటింగ్‌ను బహిష్కరించామన్నారు.<br/>సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేయలేమని తెలిసీ కావాలనే టిడిపి సవరణలను ప్రతిపాదించి దొంగాట ఆడిందని తిప్పారెడ్డి విమర్శించారు. ఇది టిడిపి రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప ఎస్సీలకు మేలు చేయాలని మాత్రం కాదన్నారు. ఎస్సీ, ఎస్టీలలో అసమానతలు తొలగించాలన్నది బిల్లు లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొన్నదని అయితే దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఎస్సీ, ఎస్టీలను అగ్రకులాలతో సమానంగా అభివృద్ధి చేయాలని కాంక్షించారన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం కూడా అదేనని అన్నారు. టిడిపి పరిపాలనలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధుల్లో సగం కూడా ఖర్చు చేయలేదని, అదే వైయస్ హయాంలో 90 శాతం ఖర్చు చేసిన విషయాన్ని తిప్పారెడ్డి గుర్తుచేశారు.