సబ్సిడీలు, రాయితీలంటే బాబుకు అసహ్యం

హైదరాబాద్ :

ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి సబ్సిడీలు, సంక్షేమ పథకాలంటే తీవ్రమైన వ్యతిరేకత అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ శాసనసభా పక్ష ఉప నాయకురాలు మేకతోటి సుచరిత అన్నారు. ఊరూరా బెల్టు షాపులు పెట్టి నిరుపేద డబ్బులు, ఆరోగ్యాలను దెబ్బతీసింద చంద్రబాబే అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తాను అధికారంలోకి వస్తే మద్య నిషేధం ఫైలుపై సంతకం చేస్తాననడం విడ్డూరంగా ఉందని ఆమె ఎద్దేవా చేశారు.

సంపూర్ణ మద్య నిషేధానికి గతంలో తూట్లు పొడిచింది చంద్రబాబు కాదా? అని సుచరిత నిలదీశారు. మరో మూడు నెలల్లో ఎన్నికలు ముంచుకు వస్తున్న వేళ చంద్రబాబుకు మహిళలు గుర్తుకొచ్చారా? అని ఆమె ప్రశ్నించారు. మహిళలకు ఎన్నో చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు వాస్తవానికి తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నపుడు వారిని ఎన్నో ఇబ్బందులు, అవమానాలకు గురిచేశారని ఒక ప్రకటనలో సుచరిత దుయ్యబట్టారు.

దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి 2004లో ‌సీఎం అయిన తర్వాత మహిళా సాధికారతకు తీవ్రంగా పాటుపడ్డారని సుచరిత గుర్తుచేశారు. చంద్రబాబుకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆమె సవాల్ ‌చేశారు. మహిళలు పోరాడి సాధించుకున్న మద్య నిషేధాన్ని ఎత్తివేసింది మీరు కాదా చంద్రబాబూ? మీ హయాంలో మద్యం అమ్మకాలను పెంచుకోవడానికి బెల్టుషాపులను ప్రవేశపెట్టిన మాట అబద్ధమా? పీవీ నర్శింహారావు ప్రధాన మంత్రిగా ఉన్నపుడు ప్రారంభమైన డ్వాక్రా పథకాన్ని మీరే ప్రారంభించినట్లు ప్రచారం చేసుకున్న మాట కాదని చెప్పగలరా? తొమ్మిదేళ్ల పాలనలో మహిళలకు రుణాలపై కనీసం వడ్డీ అయినా మాఫీ చేయని మాట నిజం కాదా? రాయితీలన్నా, సబ్సిడీలన్నా గిట్టని మీరు ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన రూ. 2 కిలో బియ్యం ధరను రూ. 5.‌25కు పెంచి పేదల కడుపు కొట్టలేదా? ఈ అంశాల్లో ఏ ఒక్కదానినైనా కాదనగలరా అని మేకతోటి సుచరిత చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top