అనంతను సందర్శించిన పీఏసీ చైర్మన్‌ బుగ్గన

అనంతపురం: చిన్ననీటి పారుదల శాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రజా పద్దుల సంఘం అనంతపురం జిల్లాను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో కాగ్‌ రిపోర్టు గమనికలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రాయలసీమ ప్రాంతంలో నీటి వనరుల తగ్గుతూ పోతున్నాయని, వర్షపాతం తగ్గుముఖం పట్టడం, కృష్ణ, తుంగభద్ర, పెన్నా నదులపై కర్ణాటక ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టడంతో నీటి కొరత ఏర్పడిందన్నారు. రాయలసీమ ప్రాంతానికి రోజు రోజుకు సాగుతో పాటు తాగునీటి ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయని చెప్పారు. చిన్ననీటి పారుదల శాఖ ద్వారా గ్రామాల్లోని చెరువులు, కుంటలను ఏ విధంగా మరమ్మతులు చేసుకోగలుగుతాం అనే అంశంపై చర్చించామన్నారు. చెరువులు, కుంటలను అభివృద్ధి పర్చుకొని గ్రామాల్లోని ప్రజల నీటి కష్టాలు ఏ విధంగా తీర్చాలో చర్చించామన్నారు. అనంతపురం జిల్లా పెనుగొండలోని చెరువులను మరమ్మతులు చేయాలని, చెరువులు ఆక్రమణలకు గురైతే వాటిని గుర్తించాలని సూచించడం జరిగిందన్నారు. 

నిధులు సక్రమంగా వినియోగించుకోవాలి
రివ్యూ మీటింగ్‌లో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు కేటాయించిన నిధులు ఖర్చు చేయడం లేదని ఫిర్యాదులు వచ్చాయని పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. నిధులు సక్రమంగా వినియోగించుకుంటే బాగుంటుందని బుగ్గన అభిప్రాయపడ్డారు. 
Back to Top