నయవంచన బడ్జెట్

ప్రజలను మోసం చేసిన బడ్జెట్
ఏపీ ప్రభుత్వ బడ్జెట్..
కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉంది
అన్ని వర్గాలను మోసం చేశారు

హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో అంకెల గారడీ చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. బడ్జెట్ లో అన్ని వర్గాలను మోసం చేశారని, అంకెలకు వాస్తవాలకు పొంతన లేదని అన్నారు. అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడిన తర్వాత మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు.

రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కనీసం రూ.10 వేల కోట్లు అవసరమవుతాయని, బడ్జెట్ లో చాలా తక్కువ కేటాయించారని చెప్పారు. నిధులు కేటాయించకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వలేదని, మహిళలకు మొండిచేయి చూపారని వాపోయారు. డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాల వ్యతిరేక బడ్జెట్ అని పేర్కొన్నారు.


అసెంబ్లీః  ఏపీ ప్రభుత్వ బడ్జెట్ కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. ఏపీ బ‌డ్జెట్‌లో అంకెలు పెరిగాయే త‌ప్ప రాష్ట్ర ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగు నింపేలా ఎక్క‌డా లేద‌న్నారు. సంక్షేమ ప‌థ‌కాల‌కు బాట‌లు వేసే విధంగా ఎక్క‌డా కూడా క‌న‌బ‌డ‌లేద‌న్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కొన్ని సంక్షేమ ప‌థ‌కాలు చెప్పారు. ఆ ప‌థ‌కాల్లో ఎక్క‌డ అంకెలు మార్చిన ప‌రిస్థితి లేదని ఆరోపించారు. 

ఏపీ ప్రభుత్వ బడ్జెట్  నయవంచన బడ్జెట్, కాకిలెక్కల బడ్జెట్  అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను అంకెల గారడీగా అభివర్ణించారు వ్య‌వసాయానికి సుమారు ఆరు వేల కోట్లు కావాల్సి ఉండగా..కేవలం రూ. 3,512 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. 

రెండు లక్షల ఇళ్లు నిర్మిస్తామన్న ప్రభుత్వం...బ‌డ్జెట్‌లో కేటాయించిన రూ. 300 కోట్ల‌తో  అన్ని ఇళ్లు ఎలా నిర్మిస్తారో చెప్పాలని కొరుముట్ల ప్రభుత్వాన్ని నిల‌దీశారు. హంద్రీ-నీవా, గాలేరు-న‌గ‌రి, పోల‌వ‌రం ఇలా ఎన్నో ప్రాజెక్టుల‌కు కేవలం రూ. 7000 కోట్లు కేటాయించార‌ని, అందులో ఒక్క పోల‌వ‌రానికే రూ. 350 కోట్లు ఖ‌ర్చ‌వుతాయ‌న్నారు. మిగిలిన గాలేరు-న‌గ‌రి, హంద్రీ-నీవా, మిగ‌తా ఇరిగేష‌న్ ప్రాజెక్టుల పరిస్థితి ఏంట‌ని ఆయ‌న ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు.

ఎస్సీ, ఎస్టీ స‌బ్‌ప్లాన్‌కు రూ. 8వేల కోట్లను కేటాయించిన రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ...దాన్ని అంకెలతోనే సరిపెడుతుందని ధ్వజమెత్తారు. ఇంత‌కుముందు కేటాయించిన బ‌డ్జెట్‌ నిధులనే ప్రభుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు ఎస్సీ, ఎస్టీల‌కు అందించిన పాపాన పోలేద‌ని దుయ్యబట్టారు.  ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు త‌న బ‌డ్జెట్‌ను ప్ర‌జ‌ల‌కు అర్థం కాకూడ‌ద‌నే ఉద్దేశ్యంతోనే ఇంగ్లీష్‌లో చ‌దివార‌ని కుండబద్దలు కొట్టారు.  ప్ర‌భుత్వ బ‌డ్జెట్ అర్థ‌మైతే ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు త‌ప్ప‌వ‌నే భ‌యంతో అలా చ‌దివార‌ని ఆయన ఎద్దేవా చేశారు. ఇది ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన బ‌డ్జెట్ అని ఆయ‌న మండిప‌డ్డారు.

చరిత్రలో నిలిచిపోయేవిధంగా అమరావతి కట్టాలని పెద్దపెద్ద బిల్డింగ్ లు చూపిస్తున్న చంద్రబాబు...బడ్జెట్ లో దానికి కేటాయించిన నిధుల తీరు దారుణంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా అన్నారు. హంద్రీనీవా పూర్తిచేస్తే రాయలసీమ ప్రజలు సంతోషంగా ఉంటారని ఆశపడ్డాం. కానీ, దానికి అనుకున్న స్థాయిలో బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు. రుణమాఫీకి మొక్కుబడిగా రూ.3,500 కోట్లు కేటాయించారు. రైతులు బంగారం వేలవేస్తున్నా..బంగారు రుణాల మాఫీ ఊసేలేకపోవడం దారుణం. డ్వాక్రా మహిళలను ఆదుకుంటామన్న ప్రభుత్వం బడ్జెట్ లో వారికి మొండిచేయి చూపిందన్నారు.   

చంద్రబాబు అబ‌ద్దాలు చెప్పి ఏ విధంగా అధికారంలోకి వ‌చ్చారో.....అదే విధంగా రైతులు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, పేద‌ల‌ు అందరినీ మోసగించేవిధంగా బ‌డ్జెట్ ని ప్రవేశపెట్టారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే నారాయ‌ణ స్వామి మండిపడ్డారు. చంద్ర‌బాబు నోరు విప్పితే అబద్దాలేన‌ని, అబ‌ద్దాలతో ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తున్నార‌ని విమ‌ర్శించారు.   

ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల ప్రవేశ‌పెట్టిన బడ్జెట్‌లో కొత్త‌ద‌నం ఏమి లేద‌ని సూళ్ళూరుపేట ఎమ్మెల్యే సంజీవ‌య్య అన్నారు. గ‌త సంవ‌త్స‌ర బ‌డ్జెట్‌కు కేవ‌లం 25శాతం క‌లిపి కొత్త బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టార‌ని, ఈ బ‌డ్జెట్ వ‌ల్ల పేద‌ల‌కు ఎటువంటి మేలు లేద‌ని ఆయ‌న ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు గ‌డుస్తున్నా ఇప్ప‌టి వరకు ఒక్క నిరుపేద‌కు కూడా  సెంటు భూమి ఇచ్చిన పాపాన పోలేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. క‌నీసం ఈ బ‌డ్జెట్‌లోనైనా పేద‌వారికి భూములను పంపిణీ చేస్తార‌నుకుంటే..నిరాశే మిగిలింద‌న్నారు. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ఒక్క రూపాయి కేటాయించ‌లేద‌న్నారు. ఈ బ‌డ్జెట్ ప్ర‌జ‌ల‌ను మోసం చేసే బ‌డ్జెట్ అని సంజీవయ్య విమర్శించారు.


Back to Top