దేవుని సన్నిధిలో బాబు రాజకీయం

విశాఖపట్నం : తెలుగు ప్రజలందరకీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వం పండుగలు, పబ్బాలను కూడా రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై దుష్టశక్తుల కన్ను పడిందని దుర్గాదేవి సన్నిధిలో చంద్రబాబు వ్యాఖ్యానించడం  శోచనీయం అన్నారు. పోలవరానికి శంకుస్థాపన చేసిందెవరని? కుడి, ఎడమ కాలువలను కట్టిందెవరో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దుర్గాదేవి సన్నిధిలో అబద్ధాలు చెప్పడానికి చంద్రబాబుకు నోరెలా వచ్చిందని ధ్వజమెత్తారు.

కేంద్రంలో భాగస్వామ్యులుగా ఉన్న టీడీపీ పోలవరం నిర్మాణంలో ఎందుకు జాప్యం చేస్తున్నారో చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు కామధేనువుగా చూస్తున్నారని, రూ.16వేల కోట్ల ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం రూ.57వేల కోట్లకు పెంచడం వెనుక ఆంతర్యమేమిటో ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు. దుష్ట ఆలోచనల నుంచి చంద్రబాబును ఆ దుర్గామాతే బయటకు తీసుకురావాలన్నారు. రాష్ట్రంపై దుష్టశక్తుల కళ్లు పడకుండా ఉండాలని కోరుతున్నామని, దేవుళ్లను కూడా రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లిందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలని బాబును ప్రశ్నించారు.  గ్రాఫిక్స్‌ చూపించి రాజధానిలో ప్రమాదకర నిర్మాణాలు చేపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Back to Top