బొత్స గురువును ముంచిన శిష్యుడు

విజయనగరం 13 జూలై 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ శ్రీమతి వైయస్ షర్మిల జిల్లాలో అడుగుపెట్టింది మొదలు అడుగుపెట్టినప్పటి నుంచి ఆమె పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై మాటల  తూటాలు విసురుతున్నారు. సాధారణంగా శిష్యులు గురువుని మించుతుంటారనీ, కానీ బొత్స గురువును ముంచిన శిష్యడనీ ఆమె మండిపడ్డారు.  మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో ఆరో రోజలోకి అడుగిడింది.  శనివారం మధ్యాహ్నం శ్రీమతి షర్మిల నెల్లిమర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో   ప్రసంగించారు. పెన్మెత్స సాంబశివరాజు లేకుంటే ఈరోజు బొత్స సత్యనారాయణ రాజకీయాల్లో ఉండేవారు కాదన్నారు. అలాంటి బొత్స ఇప్పుడు సాంబశివరాజు ఎవరని అడుగుతుండడాన్నిశ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు.  బొత్స గురువును మించిన శిష్యుడు కాదని... గురువును ముంచిన శిష్యుడు అని వ్యాఖ్యానించారు. రాజశేఖరరెడ్డిగారు లేకపోతే ఈరోజు బొత్స లేరన్నారు. కానీ రాజశేఖరరెడ్డిగారు క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారనీ అందుకే ఆయన తనయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డిని అరెస్టుచేసిజైలులో ఉంచిందనీ బొత్స చెబుతున్నారన్నారు. ఇలాంటి నాయకులున్న కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిన ప్రతిపక్ష టీడీపీ నేత చంద్రబాబు.. ఆ ప్రభుత్వాన్నే విప్ జారీ చేసి మరీ అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కించారని శ్రీమతి షర్మిల ధ్వజమెత్తారు.

చంద్రబాబు అవిశ్వాసానికి మద్దతిచ్చి ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయి ఉండేదన్నారు. అది జరిగుంటే చార్జీల మోత, కరెంటు బాదుడు ప్రజలపై పడేవి కావన్నారు. చంద్రబాబుకు ప్రజల బాధలు ఎప్పుడూ పట్టలేదని ఆమె తెలిపారు. ఎన్టీరామారావుగారు వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీతోనే చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఎద్దేవా చేశారు. ఆ పార్టీతో ఆయన చీకటి ఒప్పందాలు చేసుకున్నారన్నారు. జగనన్న విషయంలో కూడా కుమ్మక్కయ్యి, కుట్రలు పన్ని సీబీఐని వాడుకుని కేసులు పెట్టి జైలు పాలుచేశారని చెప్పారు. ఏ తప్పూ చేయలేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డిగారు ధైర్యంగా ఉన్నారని తెలిపారు. బోనులో ఉన్న సింహం సింహమేనన్నారు. దేవుడున్నాడన్నది ఎంత నిజమో మంచివాళ్ళ పక్కన నిలబడతాడనేది కూడా అంతే నిజమన్నారు.

ఉదయించే సూర్యుణ్ణి ఎలాగైతే ఆపలేమో జగనన్నను కూడా ఎవరూ ఆపలేరని స్పష్టంచేశారు. జగనన్న మనలందర్నీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. రాబోయే రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రయిన తర్వాత ప్రతి ఎకరాకు నీరివ్వాలన్న రాజన్న కల నెరవేరుతుందన్నారు. మన విద్యార్థులు పెద్ద చదువులు చదువుకుని గొప్ప ఉద్యోగాలు చేయాలన్నా మహానేత ఆశయాన్ని కూడా జగనన్న నెరవేరుస్తాడని చెప్పారు. మన రాష్ట్రంలో అందరికీ పక్కా ఇల్లుండాలనే కలకు కూడా ఆచరణ రూపం తెస్తాడని తెలిపారు. రైతన్న పంటను నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసేలా మూడు వేల కోట్ల రూపాయలతో ఒక స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేస్తారని ఆమె తెలియజేశారు.

జగనన్న ముఖ్యమంత్రయిన తర్వాత రైతులు, మహిళలకు వడ్డీ లేని రుణాలు లభిస్తాయనీ, వృద్ధులు, వితంతువులకు పింఛన్లు 700 రూపాయలవుతుందనీ, వికలాంగులకు పింఛను వెయ్యి రూపాయలవుతుందన్నారు. అమ్మ ఒడి పథకం కింద పిల్లలను చదివించుకోవడానికి సొమ్ము నేరుగా అమ్మ ఖాతాలో జమవుతుందని తెలిపారు. రాబోయేవి మంచి రోజులనీ, అప్పటివరకూ ప్రజలు జగనన్న ఆశీర్వదించాలనీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. స్థానిక, సాధారణ ఎన్నికలు ఏవైనా ఓటు అనే ఆయుధంతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను ఓడించిన రోజున రాజన్న రాజ్యం సాధ్యమవుతుందన్నారు. తమ పార్టీకి వేసే ప్రతి ఓటూ జగనన్న నిర్దోషని చాటి చెబుతుందన్నారు.  

విజయనగరం జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం బొత్స కుటుంబం కోసమే పని చేస్తుందని ప్రజలు చెబుతున్నారని ఆమె విమర్శించారు. జిల్లా ప్రజలు ఆ కుటుంబం నుంచి నలుగురిని గెలిపిస్తే వారు మాత్రం ప్రజా సమస్యలనే   విస్మరించారని చెప్పారు. వారు తమ పాలిట రాబందులయ్యారనీ, బొత్స అరాచకాల నుంచి రక్షించాలని స్థానిక మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. బొత్స కుటుంబం ఆదాయం పెంచుకోవటంలో ఉన్న శ్రద్ధలో పదో వంతు ప్రజా సమస్యలపై పెడితే విజయనగరం చాలా అభివృద్ధి చెందేదని చెప్పారు. శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన సాయంత్రం మొయిద జంక్షన్‌లో ఏర్పాటయ్యే బహిరంగ సభలోనూ మాట్లాడతారు.

Back to Top