'బాబుపై జనం ఎప్పుడో అవిశ్వాసం పెట్టారు'

పత్తికొండ, 10 నవంబర్‌ 2012:  చంద్రబాబు నాయకత్వంలోని టిడిపి ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రజలు ఏనాడో అవిశ్వాసం పెట్టారని షర్మిల వ్యాఖ్యానించారు. మరో ప్రజాప్రస్థానం 24వ రోజు శనివారం మధ్యాహ్నం కర్నూలు జిల్లాలోని తుగ్గలిలో షర్మిల పాదయాత్ర ప్రాంతానికి భారీగా తరలివచ్చిన వృద్ధులు, మహాళలు, రైతులను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు సలహాదారుడిగా పనిచేస్తున్నారని షర్మిల విమర్శించారు. ఈ అసమర్థ, ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు అవిశ్వాసం పెట్టరని, దానికి ప్రతిఫలంగానే చంద్రబాబుపై ఈ ప్రభుత్వం కేసులు పెట్టడంలేదని ఆరోపించారు. రైతుల బాధలు విన్న షర్మిల చలించిపోయారు. అప్పుల దెబ్బకు అన్నదాత ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు చాలా విలువైనవని, కొద్దికాలం ఓపిక పట్టాలని, త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, అందరి కష్టాలు తీరిపోతాయని రైతులకు భరోసా ఇచ్చారు.

దివంగత మహానేత వైయస్ ఉన్న‌ప్పుడు గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచలేదని, విద్యుత్‌ సంక్షోభం రానివ్వలేదని షర్మిల పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో రైతులకు ఆత్మహత్యలే శరణ్యమయ్యాయని, విద్యార్థులకు ఫీజులు అందడంలేదని, వారికి కిరణ్‌ ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అక్కా చెల్లెళ్ళ బ్రతుకుల మీద ఈ సర్కార్‌ దెబ్బ కొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఆధారాలు లేకుండానే విచారణ పేరుతో జగనన్నను జైలులో పెట్టారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్నను జైలు నుంచి బయటికి రానివ్వకుండా కాంగ్రెస్‌, టిడిపిలు కుట్ర పన్నాయని ఆరోపించారు.

ఈ సందర్భంగా షర్మిల తుగ్గలిలోని ఒక ఎస్సీ బాలిక హాస్టల్‌లోకి వెళ్ళి విద్యార్థినుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమకు హాస్టల్‌లో కనీస సౌకర్యాలు లేవని విద్యార్థినులు షర్మిల ముందు వాపోయారు. కనీసం మరుగుదొడ్లు కూడా లేవని వారు చెప్పారు. దీనితో విద్యార్థినుల సమస్యలు ఎందుకు తీర్చలేదని వార్డెన్‌ను షర్మిల ప్రశ్నించారు. వార్డెన్‌ సమాధానం చెబుతూ, మరుగుదొడ్లు నిర్మించారని, అయితే, వాటిని వినియోగించుకోవడానికి ఇంకా ప్రారంభించలేదని చెప్పారు. అంటే సిఎం వచ్చే వరకూ విద్యార్థినులు ఇలాగే సమస్యలతో కొట్టుమిట్టాడాలా? అని వార్డెన్‌ను నిలదీశారు.

Back to Top