అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి

హైదరాబాద్, 14 ఏప్రిల్‌ 2013: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఆశయాల సాధన కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తుందని పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ తెలిపారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి రూపొందించి, అమలు చేసిన సంక్షేమ పథకాలకు అంబేద్కర్‌ ఆశయాలే స్ఫూర్తి, మార్గదర్శకం అని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్లోని వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కేంద్ర కార్యాలయంలో‌ ఆదివారంనాడు అంబేద్కర్ జయంతి వేడుక‌లను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి శ్రీమతి విజయమ్మ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అంబేద్కర్‌ ఈ దేశానికి మార్గదర్శి అని శ్రీమతి విజయమ్మ కొనియాడారు. కోట్లాది మంది దళితులను చైతన్యం చేయడానికి 'జై భీమ్'‌ అనే నినాదం ఒక్కటే చాలు అన్నారు. అంబేద్కర్‌ చేసిన ప్రతి కార్యక్రమం కూడా ఈ జాతి జనులకు శిరోధార్యం అని అభివర్ణించారు. దళితులకు ప్రత్యేక ప్రత్యేక నియోజకవర్గాలుండాలని, అంటరాని వారికి రిజర్వేషన్లు అవసరమని ప్రతిపాదించి అంబేద్కర్‌ ఆ వర్గాల వారికి ఎనలేని మేలు చేశారన్నారు. దళితులకు గ్రామాల్లో మంచినీరు ఇవ్వకపోవడంపైన, హరిజనులకు హిందూ దేవాలయాల్లో ప్రవేశం కల్పించడంలోనూ అంబేద్కర్‌ చాలా పోరాటాలు చేశారని శ్రీమతి విజయమ్మ కొనియాడారు. భారత రాజ్యాంగం ముసాయిదా నిర్మాణ కమిటీ చైర్మన్‌గా ఉన్న అంబేద్కర్‌ 'సోషల్‌ డాక్యుమెంట్‌'ను విడుదల చేసిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.

అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకున్న మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి పేదలకు లబ్ధి చేకూర్చే విధంగా ఆహార భద్రత, ఆరోగ్య, విద్యా, ఉద్యోగ, ఆవాస భద్రత లాంటి అనేక పథకాలు, కార్యక్రమాలకు రూపకల్పన చేసి అమలు చేశారని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. పేదల ముఖంలో కన్నీరు చూడకూడదని మహాత్మా గాంధీ చెప్పిన మాటను కూడా మహానేత వైయస్‌ స్ఫూర్తిగా తీసుకున్నారన్నారు. రాజశేఖరరెడ్డిగారి వారసత్వ పార్టీగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పేదల కోసం నిలబడుతుంది, పేదల కోసమే జీవిస్తుంది, పేదల పక్షాన నిలబడుతుందని శ్రీమతి విజయమ్మ స్పష్టంచేశారు.

అంతకు ముందు శ్రీమతి విజయమ్మ ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ శాసనసభా‌ పక్షం ఉప నాయకురాలు మేకతోటి సుచరిత, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, పార్టీ ఎస్సీ విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకా‌ష్, ‌కేంద్ర పాలక మండలి సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మూలింటి మారెప్ప, పార్టీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త పీఎన్వీ ప్రసాద్‌తో పాటు ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌ‌డ్‌, పార్టీ సీఈసీ సభ్యురాలు విజయారెడ్డి తదితరులు పాల్గొని, అంబేద్కర్‌కు నివాళులు అర్పించారు.
Back to Top