'అక్రమ కేసులతో జననేతకు వేధింపులు'

రామచంద్రపురం (తూర్పుగోదావరి జిల్లా) : కాంగ్రెస్‌ పార్టీని ధైర్యంగా వ్యతిరేకించినందుకే పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని వైయస్‌ఆర్‌సిపి కేంద్ర పాలకమండలి సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంతగా వేధించినా, ఎన్ని కుట్రలు పన్నినా శ్రీ జగన్మోహన్‌రెడ్డి జనం గుండెల్లోనే ఉన్నారని అన్నారు. శ్రీ జగన్‌ రాక కోసం రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని సుభాష్‌ చంద్రబోస్ అన్నారు. ‌'జగన్ కోసం‌.. జనం సంతకం' కార్యక్రమాన్ని రామచంద్రపురంలో సోమవారంనాడు ఆయన ప్రారంభించారు.

‌శ్రీ జగన్‌కు బెయిల్ రాకుండా కాంగ్రెస్‌, టిడిపిలు అడ్డుకుంటున్నాయని రాష్ట్ర నీటి వినియోగదారుల సంఘ రిసోర్సు పర్సన్ కొవ్వూరి త్రినాథరెడ్డి, డాక్ట‌ర్ యనమదల మురళీకృష్ణ ఆరోపించారు. రాజబాబునగనర్‌ మహిళలు శ్రీ జగన్‌కు అండగా ఉంటామంటూ ముందుకువచ్చి సంతకాలు చేశారు. 

కోటి సంతకాల్లో పాల్గొనండి: కొల్లి నిర్మలా కుమారి:
రాజమండ్రి : వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో వైయస్ అభిమానులంతా పాలుపంచుకోవాలని పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలా కుమారి పిలుపునిచ్చారు. రాజమండ్రిలో సోమవారం పార్టీ సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ గారపాటి ఆనం‌ద్ కోటిపల్లి బస్టాండు వద్ద, ఎస్సీ సె‌ల్ విభాగం నగర కన్వీన‌ర్ కడితి జోగారావు క్వారీ మార్కెట్ సెంట‌ర్‌లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ప్రజల సంక్షేమం కోసం పరితపించే శ్రీ జగన్మోహన్‌రెడ్డిని అక్రమంగా జైల్లో ఉంచారని నిర్మలా కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ జగన్ విడుదల కోరుతూ రాష్ట్రతికి ప్రజావాణిని కోటి సంతకాలు రూపంలో సేకరిస్తున్నామన్నారు. కోటిపల్లి బస్టాండ్ సెంట‌ర్‌ వద్ద సంతకాల సేకరణలో పాల్గొన్న పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు, మాజీ ఎంపి ఎజెవి బుచ్చిమహేశ్వరరావు మాట్లాడుతూ, పార్టీ అధినేతకు లభిస్తున్న జనాభిమానాన్ని చూసి అధికార, ప్రతిపక్ష నేతలు ఓర్వలేక పోతున్నారన్నారు. బొమ్మన రాజ్‌కుమార్, ఆదిరెడ్డి అప్పారావు ‌మాట్లాడారు.

మేము సైతం...:
అయినవిల్లి: ఆటపాటలను పక్కనపెట్టి... మేము సైతం అంటూ ముందుకు వచ్చి అయినవిల్లి మండలం చింతనలంకలో చిన్నారులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డికి మద్దతుగా సంతకాలు సేకరించారు. మండలంలో వైయస్‌ఆర్‌సిపి నాయకులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వారు పాలుపంచుకున్నారు.

అనూహ్య స్పందన:
గొల్లప్రోలు : 'జగన్‌ కోసం.. జనం సంతకం' కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖ‌రరెడ్డి విగ్రహానికి పెండెం దొరబాబు పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్ని వర్గాల ప్రజలు, వాహనదారులు స్వచ్ఛందంగా హాజరై సంతకాలు చేసి తమ అభిమానాన్ని చాటారు.
Back to Top