2011 జాబితాతో స్థానిక ఎన్నికలకు డిమాండ్

హైదరాబాద్, 02 మే  2013:

  రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధుంటే 2011 జనాభా లెక్కల ప్రకారం స్థానిక ఎన్నికలను నిర్వహించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. స్థానిక ఎన్నికలకు రాజ్యాంగ హోదా కల్పించినప్పటికీ ప్రభుత్వం ఎనలేని జాప్యం చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు హయాంలో ప్రత్యేక అధికారులతో స్థానిక సంస్థలను నడిపించినట్లే ప్రస్తుతం నడుస్తోందని మండిపడ్డారు. రాజీవ్ గాంధీ రూపొందించిన స్థానిక సంస్థల చట్టం మీదే కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదని ఆయన ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేకపోవడంతో తాగునీటి, పారిశుద్ధ్య, తదితర సమస్యలకు ఎవరిని ఆశ్రయించాలో తెలియక ప్రజలు అల్లాడుతున్నారని చెప్పారు. ఎన్నికల ప్రకటన ఇదిగో ఇస్తాం.. అదిగో ఇస్తామంటూ ప్రభుత్వం కాలం వెళ్ళదీస్తోందని ధ్వజమెత్తారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు ఈ ఎన్నికలలో ఎక్కువ సీట్లు దక్కే అవకాశముందన్నారు. పార్టీలో అసమ్మతి కార్యకలాపాల గురించి మాట్లాడుతూ సంబంధిత అంశాలపై నివేదికలు రప్పించుకుని తగినవిధంగా చర్యలు చేపడతామని కొణతాల చెప్పారు.

Back to Top