టీడీపీ.. జనసేనల‌కు ఫైనాన్షియర్ ఒక్క‌రే 

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

అధికారం కోసం బాబు ఎంతకైనా బరితెగిస్తారు

గతంలో బీజేపీ, పవన్‌కల్యాణ్‌.. ఇప్పుడు కాంగ్రెస్‌తో జత 

 చిత్తూరు:  చంద్రబాబుకు ఫైనాన్షియర్‌గా ఉన్న లింగమనేని ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌కు ఫైనాన్షియర్‌గా ఉన్నారని, టీడీపీ, జనసేనకు మధ్య ఉన్న బంధానికి ఇంతకుమించి సాక్ష్యాలు అవసరం లేదని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. ‘అధికారం కోసం ఏ గడ్డి అయినా తింటావు. ఆఖరికి గాడిద కాళ్లు కూడా పట్టుకుంటావు. గత ఎన్నికల్లో బీజేపీ, పవన్‌తో జత కట్టావు. ఇప్పుడు కాంగ్రెస్‌తో అంటకాగుతున్నావు. జత కట్టడం మళ్లీ వాళ్లపైనే బురద చల్లడం నీ నైజం’ అని సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. 

ఆరు వందల అబద్ధపు హామీలు, పచ్చ మీడియా అండదండలతో గద్దెనెక్కిన చంద్రబాబును రాష్ట్ర ప్రజానీకం నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. టీడీపీ, పవన్‌ అసలు విడిపోతే కదా పొత్తు గురించి మాట్లాడేందుకని ఆమె ఎద్దేవా చేశారు. 40 ఏళ్లు అనుభవం ఉన్న చంద్రబాబుకు సొంతంగా పార్టీ పెట్టిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి గత ఎన్నికల్లో ఓట్ల తేడా కేవలం 5 లక్షలు మాత్రమేనని ఆమె గుర్తు చేశారు. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీని ఎన్నికల్లో రాష్ట్రం నుంచి తరిమికొట్టడం ఖాయమన్నారు. పార్టీలన్నీ విడివిడిగా వచ్చినా, ఒక్కటై వచ్చినా రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని వ్యాఖ్యానించారు.
 

Back to Top