తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడు రేగం చాణుక్య వివాహ వేడుకకు, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుమారుడు గోవింద్ సాకేత్ వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. 👉గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం, విశాఖ నుంచి హెలికాప్టర్‌లో అరకు వ్యాలీ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తంగులగూడ గ్రామంలోని రాధాకృష్ణ ఆలయం వద్దకు వెళ్తారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడు రేగం చాణుక్య వివాహ రిసెప్షన్‌లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. 👉మధ్యాహ్నం అరకు నుంచి హెలికాప్టర్‌లో తిరిగి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రోడ్డు మార్గాన మర్రిపాలెం రాణా ప్రతాప్‌నగర్‌కు చేరుకుని అక్కడ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చిన్న కుమారుడు గోవింద్ సాకేత్ వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై ఆశీస్సులు అందజేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయలుదేరుతారు.