అనంతపురం: తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని తాడిపత్రి వైయస్ఆర్‌సీపీ నేతలు అనంతపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధన్‌రెడ్డితో పాటు వైయస్ఆర్‌సీపీ నేతలు అనంతపురం ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. తాడిపత్రికి చెందిన 24 మంది వైయస్ఆర్‌సీపీ నేతల అంతు చూస్తామంటూ జేసీ అస్మిత్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల వైయస్ఆర్‌సీపీ నేతలపై దాడులు జరగడంతో పాటు వారి ఇళ్ల వద్దకు వెళ్లి జేసీ ప్రభాకర్‌రెడ్డి హంగామా చేస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రిలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తల భద్రతపై ఆందోళన నెలకొందని, పోలీసులు తక్షణమే స్పందించి రక్షణ కల్పించాలని నేతలు ఎస్పీని కోరారు.