ఉమ్రా బాధితులను ఆదుకోవాలి


 

తూర్పుగోదావరి: ఉమ్రా బాధితులను ఆదుకోవాలని నగరం, మామిడికుదురు గ్రామాలకు చెందిన పలువురు ముస్లింలు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా  వ‌చ్చిన వైయ‌స్‌ జగన్‌ను వారు కలుసుకుని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన సుమారు 300 మంది ముస్లింలు ఉమ్రా, ఇరాన్, ఇరాక్‌ యాత్రలకు వెళ్లేందుకు కొద్ది నెలల క్రితం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్వారా కేఎస్‌ఎస్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌కు లక్షలాది రూపాయలు నగదు చెల్లించామన్నారు. ఈ విధంగా 75 మంది రూ.45 వేలు చొప్పున, 50 మంది రూ.25 వేలు చొప్పున, 180 మంది రూ.18 వేలు చొప్పున చెల్లించామన్నారు. బాధితుల్లో పలు కుటుంబాల్లో 10 మందికి పైగా సభ్యులు ఉన్నారన్నారు. నగదుతో పాటు తమ పాస్‌పోర్టులు కూడా వారి వద్దే ఉన్నాయని, వీటికి సంబంధించిన రశీదులు తమ వద్ద ఉన్నాయన్నారు. తమను మోసగించిన ట్రావెల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. ఈ ట్రావెల్స్‌ చట్టాన్ని, న్యాయాన్ని తప్పుదోవ పట్టిస్తోందన్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వజీద్‌జాన్‌సాహేబ్, సర్ఫరాజ్‌ హుస్సేన్, ఎస్‌కే నౌషాద్‌ మొహిద్దీన్, షేక్‌ జిలానీ తదితరులు కోరారు.
Back to Top