`` దురాశ దుఃఖమునకు చేటు `` అన్న పాత పాఠాన్నే సిఎం మాస్టారు బాబు కొత్తగా చెప్పారు. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో చదువుకునే రోజుల్లోనే సమాజానికి పాఠం చెప్పాలని బాబు తెగ ఇదిగా ఉండేది. కాంగ్రెస్‌లో ఉంటూ ఎస్టీఆర్‌కు ఓటమి పాఠం చెప్తానని గుట్టు చప్పుడు కాకుండా ఆయన పంచనే చేరారు. మామ చాటు అల్లుడిగా ఉంటూ ప్రభుత్వాన్ని, పార్టీని ఎలా కైవసం చేసుకోవాలో ఎపిసోడ్‌లు ఎపిసోడ్‌లుగా వైస్రాయ్ హోటల్ దాకా బాబు చెప్పిన పాఠాలు ఆధునిక చరిత్రలో చెరిపినా చెరగనివి. కన్నతండ్రి మీద హరిబావను ఉసిగొలిపి తరువాత హరీలేదు గిరీ లేదు అన్న గుండెల మీద కుంపట్ల పాఠం ఏమంత చిన్నది కాదు. టి.డి.పి నాతో పుట్టింది, నా తోనే పోతుందన్న ఎన్టీఆర్ నోటి మాట నిజం కాకూడదంటే ఆయన గుర్తులు, ఆ ప్రభావం మిగిలి ఉండడానికి ఎంత వెన్నుపోటు పాఠం పెద్దదయినా బాలయ్య బాబుతో వియ్యం వల్ల ఆ నష్టాన్ని పూడ్చుకున్న బాబు... పోటు-నీటు పాఠం జీవితాతం చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. తెలంగాణా ఉద్యమం ఊపందుకోగానే విభజించండి, త్వరగా విభజించండి అంటూ కేంద్రానికి ఉత్తరమిచ్చి వెంటనే తెలుగునేలపై ఎక్కడికెళ్లినా బాబు చెప్పిన రెండుకళ్ల పాఠం ఆడియో, వీడియో, ప్రింటు ప్రతుల తడి ఇంకా ఆరనే లేదు. కాంగ్రెస్ వంశపారంపర్య రాజకీయాలను తెలుగులో ఉన్న అన్ని రకాల తిట్లు, సమాసాలతో తిట్టిన తెలుగుదేశం అధినేత స్టాన్‌ఫర్డ్‌లో వ్యాపారం చదువుకున్న కొడుకు లోకేష్‌కు పార్టీ వ్యాపార బాధ్యతలు ఇవ్వడం ద్వారా చెప్పకనే చెప్పిన పార్టీ వ్యాపార పాఠం రాబోయే తరాలకు చాలా విలువైంది. ఎన్నికలప్పుడు హామీలివ్వాలి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావచ్చు. రైతులకు రుణమాఫీ బాబొస్తే జాబు, నిరుద్యోగ భృతి, కాలువలు, నదులు, సముద్రాలు, నెత్తిమీది ఆకాశాలు ఏవైనా కావచ్చు. అధికార పీఠంపై కూర్చోగానే వాటిని మరచి పోవడం కానీ, మరచిపోయినట్లు నటించడం అన్న బాబు నిత్యం పఠించిపాటించే మతిపరుపు పాఠం. ఆధునిక న్యూరోసైన్స్ కు కూడా అంతుబట్టదు. ఇక ఆకాశంలో సూర్య చంద్రులున్నంత వరకు, సముద్రంలో నీళ్లు ఉన్నంత వరకు నిలిచి ఉండే `` మనవాళ్లు బ్రీఫ్‌డ్ మీ `` అన్న బాబు ఓటుకు నోటు పాఠం ఉండనే ఉంది. ఆ దెబ్బకు హైదరాబాద్ వదిలి అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీలను కొనడానికి రేట్లు నిర్ణయించిన ప్రజాస్వామ్య అపహాస్యపాఠం అందరికీ తెలిసిందే. అందుకే బాబుకు `` వాట్ ఐ యామ్ సేయింగ్ `` అన్నది ఊతపదం. బాబు పాఠం చెప్పి బయటకు వెళ్లగానే `` మనం సిఎం సార్ బ్రీఫ్‌డ్ మీ `` అని అమాయక విద్యార్థి గట్టిగా అంటే అక్కడే ఉన్న టీచర్ ఆ అబ్బాయి వీపు విమానం మోత మోగించాడట.