‘వెన్నుపోటుకు రెండేళ్లు’.. రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ నిరసనలు

 తాడేపల్లి : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన  ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం గురువారం రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో నిర్వహించనుంది. పార్టీ నాయకత్వం రూపొందించిన కార్యాచరణలో భాగంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు గుర్తు చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ చిత్రాలతో, సంతకాలతో ప్రతి ఇంటికి పంపిణీ చేసిన హామీ పత్రాలు, బాండ్ల ప్రతులు, ఎన్నికల మేనిఫెస్టో కాపీలను ప్రదర్శిస్తూ మండల కేంద్రాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. 

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, అభిమానులు పాల్గొని కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలాగే ప్రతి నియోజకవర్గానికి చెందిన పార్టీ ఇన్‌చార్జ్‌లు కూడా ఆయా మండలాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

వైయ‌స్ఆర్‌సీపీ నేతల ప్రకారం, ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ప్రజా సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈ నెల 12వ తేదీ వరకు  ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో నిరసన కార్యక్రమాలు కొనసాగనున్నట్లు పార్టీ ప్రకటించింది. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. 

 దొంగ హామీల పాలనపై తిరుపతిలో వైయ‌స్ఆర్‌సీపీ నిరసన
  మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌ పిలుపు మేరకు, తిరుపతి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో "వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దొంగ హామీలు, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ పాలనకు రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు పార్టీ నాయకులు తెలిపారు.

తిరుపతి సౌత్ పరిధిలోని 13 డివిజన్ల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎం.ఆర్.పల్లి సర్కిల్‌లోని దండి మార్చ్ విగ్రహం వద్ద భారీగా చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దహనం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు సహా అన్ని వర్గాలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.

ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి, అనంతరం ఇచ్చిన హామీలను పక్కనపెట్టిన ఈ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోని ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

Back to Top