కాకినాడ: మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతించాలని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. కాకినాడలోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు అన్ని రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయొచ్చని, నేను సేఫ్ డ్రైవర్‌గా ఉంటానని చెప్పిన చంద్రబాబు.. ఏడాది తర్వాత పథకాన్ని అమలు చేస్తూ దాన్ని 5 రకాల సర్వీసులకు మాత్రమే పరిమితం చేయడం తగదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు రూ. 5 లక్షలు చెల్లించి మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లకు అనుమతించడాన్ని వైయస్ఆర్‌సీపీ వ్యతిరేకిస్తోందని ఆమె స్పష్టం చేశారు. ఒకపక్క లిక్కర్ వల్ల రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న నేరాలు పెరిగిపోతున్నాయని తెలిసి కూడా మహిళా మంత్రులు అలాంటి నిర్ణయానికి ఎలా ఆమోదం తెలిపారని వరుదు కళ్యాణి ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణం పర్మిట్ రూమ్‌లకు పర్మిషన్ ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె ఇంకా ఏమన్నారంటే... ఇది కోతల ప్రభుత్వం మహిళలకు వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు ఆరితేరిపోయాడు. చీటింగ్‌కి చంద్రబాబు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిపోతాడు. ప్రజలను ఎన్నిరకాలుగా మోసం చేయొచ్చో చంద్రబాబుకి తెలిసినట్టు ఇంకెవరికీ తెలియదు. ఏడాది పాలనకే సుపరిపాలన కాదని శుద్దదండగ పాలన అని, ఇది కూటమి ప్రభుత్వం కాదు.. కోతల ప్రభుత్వమని, మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వమని ప్రజలే తేల్చేశారు. వైయస్ జగన్ తన ఐదేళ్ల పాలనతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడిగా పేరు తెచ్చుకుంటే, చంద్రబాబు మాత్రం అంతకంతకూ మోసం చేయడంలో వీరుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. వైయస్ జగన్ కన్నా ఎక్కువ పథకాలు ఇస్తానని ఆశ చూపించి ఓటేయించుకున్నాడు. తీరా అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను వంచించడమే పనిగా పెట్టుకున్నాడు. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో 2 కోట్ల మంది మహిళలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దారుణంగా వంచించారు. మేనిఫెస్టోలో ఆ షరతులు ఎందుకు పెట్టలేదు? ఐదు రకాల సర్వీసుల్లో మొత్తం 6700 బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తామని చెప్పి మరోసారి వంచనకు తెరదీశాడు. అంతర్‌జిల్లాల పరిధిలో తిరిగే 90 శాతం బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే అవకాశం లేనప్పుడు పథకం అమలు చేయడం దేనికి? ఎన్నికల ముందు చంద్రబాబు ప్రచారం చూస్తే ‘‘ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. నేనే డ్రైవర్ని. సేఫ్ డ్రైవర్ని. మా చంద్రన్న చెప్పాడు. నేను ఏ ఊరికి పోవాలన్నా కండక్టర్ గానీ, ఇంకెవరు గానీ ఏమీ అడగడానికి వీల్లేదు. పని చేయాలాంటే పలానా ఊరికి పోతా... పుట్టింటికి పోతా.., నాకు చంద్రన్న ఇచ్చిన హక్కు. అడిగితే చంద్రబాబు నాయుడు ఉన్నాడు’’ అని చెప్పమన్నాడు. ఏమీ భయపడనక్కర్లేదన్నాడు. ఎన్నికలకు ముందు పేపర్లు, టీవీల్లో యాడ్స్‌తో ఊదరగొట్టారు. తీరా చూస్తే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఎక్స్ ప్రెస్ వంటి ఐదు రకాల బస్సులకు మాత్రమే వర్తింపచేస్తారంట. పల్లె వెలుగు అయినా, అల్ట్రా పల్లె వెలుగు అయినా, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో అయినా అవి సగటున 40-50 కిలోమీటర్లకు దాటదు. సిటీ ఆర్డినరీ బస్సులు కూడా 30 కిలోమీటర్లు దాటి వెళ్లవు. ఎక్స్ ప్రెస్ సర్వీసులు కూడా గరిష్టంగా ఒక రూటులో 150 కిలోమీటర్లకు మించి వెళ్లవు. పైగా వీటి సంఖ్య చాలా తక్కువ. అంటే ఈ లెక్కన జిల్లాల సరిహద్దులు దాటి వెళ్లే బస్సులు చాలా తక్కువ. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో 5 రకాల బస్సుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తింపజేస్తామని ఎందుకు చెప్పలేదు? కొత్తగా ఇప్పుడు ఎందుకు షరతులు పెడుతున్నారు? నిజాయితీగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలంటే రాష్ట్రంలో ఒక చోట నుంచి ఇంకో చోటుకు వెళ్లే డీలక్స్, అల్ట్రా డీలక్స్, వెన్నెల, అమరావతి, ఇంద్ర, గరుడ బస్సుల్లో కూడా ఎక్కనిస్తారా? మీరు ఎన్నికలకు ముందు టీవీ యాడ్స్ లో ప్రచారం చేసుకున్నట్టుగా తిరుపతి, అన్నవరం, విజయవాడ, సింహాచలం, శ్రీకాళహస్తి, శ్రీశైలం వంటి దేవాలయాలకు మహిళలని మొక్కులు తీర్చుకునేందుకు ఈ బస్సుల్లో ఉచితంగా వెళ్లనిస్తారా లేదా? ఉచిత బస్సుకి నెలకు అయ్యే ఖర్చు రూ. 300 కోట్లకు మించదు. అంటే ఏడాదికి దాదాపు రూ.3వేల కోట్లు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్.. ముగ్గురూ స్పెషల్ ఫ్లైట్స్, చాపర్‌లలో తిరగడానికి అయ్యే ఖర్చు కన్నా ఇది తక్కువే అవుతుంది. రాష్ట్రంలో తిరుగుతున్న అన్ని బస్సుల్లో మహిళలకు షరతులు లేకుండా ఉచిత ప్రయాణం హామీని అమలు చేయాలని వైయస్ఆర్‌సీపీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పర్మిట్ రూమ్‌లకు మహిళా మంత్రులు ఎలా ఒప్పుకున్నారు? కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతోంది. కేవలం ఏడాది కాలంలోనే 9 శాతం అమ్మకాలు పెరిగితే, రెండో ఏడాది మొదలైన మూడు నెలల్లోనే 24 శాతం లిక్కర్ అమ్మకాలు, 129 శాతం బీర్ల అమ్మకాలు పెరిగిపోయాయి. 2019లో వైయస్ జగన్ సీఎం అయ్యాక పర్మిట్ రూమ్‌లను, 43 వేల బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేశారు. 33 శాతం మద్యం షాపులను తొలగించేశారు. ప్రభుత్వమే మద్యం అమ్మడం వల్ల మద్యం అమ్మకాలు తగ్గాయి. కానీ కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి రూ.5 లక్షలు కడితే పర్మిట్ రూమ్‌లకు పర్మిషన్ ఇచ్చేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం దారుణం. సౌకర్యవంతంగా మద్యం తాగడానికి పర్మిషన్ ఇచ్చే పేరుతో మగాళ్ల ఆరోగ్యాన్ని పాడు చేసి కుటుంబాలను ఆర్థికంగా ఇబ్బందులపాలు చేస్తున్నారు. ఇప్పటికే మద్యం విక్రయాలు పెరిగి మహిళల మీద అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని నెత్తీనోరూ మొత్తుకుంటుంటే అవేవీ లెక్కచేయకుండా పర్మిట్ రూమ్‌లు పెంచాలనుకోవడం మహిళల జీవితాలతో ఆటలాడుకోవడమే. ఇది మేం తీసుకున్న గొప్ప నిర్ణయమని మీ ఇంట్లో ఉన్న ఆడవారితో మంత్రులు చెప్పుకోగలరా? మహిళా మంత్రులు ఇలాంటి నిర్ణయానికి ఎలా అంగీకరించారో అర్థం కావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గంటకు మహిళల మీద నాలుగు దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. మద్యం వల్ల క్రైమ్ రేట్ పెరిగిందని తెలిసి కూడా మరింత తాగించాలని చూస్తున్నారంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? మహిళల మానప్రాణాల రక్షణ మీద ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? వెంటనే పర్మిట్ రూమ్‌లకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని వైయస్ఆర్‌సీపీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.