ఎస్‌ఐఆర్‌లో అవకతవకలను అరికట్టాలి

ఈసీకి వైయస్సార్‌సీపీ వినతిపత్రాలు

 
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ–2026 (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో చోటుచేసుకుంటున్న అవకతవకలపై తక్షణమే జోక్యం చేసుకోవాలని వైయస్సార్‌సీపీ కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కోరింది. పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ, ఓటర్ల మ్యాపింగ్‌లో అక్రమాలు, డూప్లికేట్‌ ఓట్ల నమోదుపై పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రెండు వేర్వేరు వినతిపత్రాలు సమర్పించారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే 1,200 మందికిపైగా ఓటర్లు ఉన్న పోలింగ్‌ కేంద్రాలను విభజించడం, వాటి పరిధులను మార్చడం వల్ల మొత్తం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ గందరగోళానికి గురవుతుందని వైయస్సార్‌సీపీ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న పోలింగ్‌ కేంద్రాల ఆధారంగానే ఇంటింటి పరిశీలన, ఓటర్ల మ్యాపింగ్‌, క్లెయిమ్స్‌, అభ్యంతరాల స్వీకరణ జరుగుతున్నందున మధ్యలో బూత్‌ల పరిధులు మార్చడం సరికాదని తెలిపింది.

కొత్తగా హేతుబద్ధీకరించిన పోలింగ్‌ కేంద్రాల ఆధారంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తే ఓటర్లు, బూత్‌ లెవల్‌ అధికారులు, రాజకీయ పార్టీల బూత్‌ ఏజెంట్లలో తీవ్ర అయోమయం ఏర్పడుతుందని వివరించింది. అందువల్ల ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రస్తుతం అమల్లో ఉన్న పోలింగ్‌ కేంద్రాల ఆధారంగానే ప్రచురించాలని, తుది ఓటర్ల జాబితా వెలువడిన తర్వాతే కొత్త పోలింగ్‌ కేంద్రాల వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలని కోరింది.

మరోవైపు, అధికార టీడీపీ నేతల ఒత్తిడితో కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా నివసించని వ్యక్తులను కూడా ఓటర్లుగా మ్యాపింగ్‌ చేస్తున్నారనే ఫిర్యాదులు అందుతున్నాయని వైయస్సార్‌సీపీ తెలిపింది. సరైన నివాస ధ్రువపత్రాలు లేకుండానే కొందరిని ఓటర్లుగా గుర్తిస్తుండగా, వాస్తవంగా అక్కడే నివసిస్తున్న అర్హులైన ఓటర్లను ‘నాన్‌ మ్యాప్డ్‌’గా చూపుతున్నారని ఆరోపించింది. రాజకీయ అభిప్రాయాల ఆధారంగా నిజమైన ఓటర్లను జాబితా నుంచి తొలగించే పరిస్థితి రాకుండా రాష్ట్రవ్యాప్తంగా విచారణ జరపాలని కోరింది.

ఎస్‌ఐఆర్‌ లక్ష్యం డూప్లికేట్‌, బహుళ, చిరునామా మారిన, అనర్హ ఓటర్ల నమోదును గుర్తించి తొలగించడమే తప్ప, నిజమైన ఓటర్ల ఓటుహక్కును దూరం చేయడం కాదని స్పష్టం చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, వలస కార్మికులు, విద్యార్థులు, రోజువారీ కూలీలు, మారుమూల ప్రాంతాల ప్రజలు నిర్ణీత గడువులో ధ్రువీకరణ పూర్తి చేయలేకపోయిన కారణంతో వారి పేర్లను తొలగించరాదని కోరింది.

కుప్పంలో 36,388, ఎమ్మిగనూరులో 36,027, ఆదోనిలో 34,630, మడకశిరలో 34,304, కోడుమూరులో 33,373 అనుమానిత డూప్లికేట్‌ ఓటర్ల నమోదులు ఉన్నట్లు పార్టీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. ఇవి పరిశీలించాల్సిన అనుమానిత కేసులని స్పష్టం చేసింది.

ఒకే నియోజకవర్గంలోని వేర్వేరు బూత్‌లలో, రాష్ట్రంలోని వేర్వేరు నియోజకవర్గాల్లో, ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలోనూ ఒకే వ్యక్తి పేరుతో ఓట్లు నమోదైన నమూనా కేసులను వైయస్సార్‌సీపీ ఈ లేఖలకు జత చేసింది. కుప్పం–గద్వాల, కుప్పం–ఆలంపూర్‌తోపాటు ఎమ్మిగనూరు, ఆదోని, మడకశిర, కోడుమూరు ప్రాంతాలకు సంబంధించిన డూప్లికేట్‌ నమోదుల వివరాలను ఈసీకి అందించింది.

ఈఆర్‌ఓనెట్‌, ఎపిక్‌ నంబర్ల పరిశీలన, వివరాల సరిపోలిక, చట్టబద్ధంగా అనుమతించిన ఆధార్‌ ఆధారంగా డూప్లికేట్‌ ఓట్లను గుర్తించాలని పార్టీ కోరింది. డూప్లికేట్‌ ఓట్లు తొలగించేటప్పుడు ప్రజాప్రాతినిధ్య చట్టం, ఓటర్ల నమోదు నిబంధనలు, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించింది.

పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణను తుది జాబితా వరకు వాయిదా వేయడంతోపాటు, అక్రమ ఓటర్ల మ్యాపింగ్‌పై విచారణ జరిపి, నిజమైన ఓటర్లను తప్పుగా ‘నాన్‌ మ్యాప్డ్‌’గా గుర్తించిన చోట వెంటనే సరిదిద్దాలని లేళ్ల అప్పిరెడ్డి కోరారు. రాజకీయ ఒత్తిడికి తావులేకుండా ఎస్‌ఐఆర్‌ను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించి ప్రతి అర్హుడి ఓటుహక్కును కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

Back to Top