13న వైయ‌స్ఆర్‌సీపీ నిరసనలు 

 తాడేపల్లి:  జూన్ 13న వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు తెలపాలని వైయ‌స్ఆర్‌సీపీ నిర్ణయించింది. ఏడాదిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు చెల్లించకపోవటం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగులను మోసం చేసినందుకు వైయ‌స్ఆర్‌సీపీ నిరసన చేపట్టనుంది. అనంతరం కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాలు నిర్ణయించాయి.

ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్‌.. అంటూ ఊదర గొట్టి తీరా అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు చేతులెత్తేయడంపై నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు కల్పించని పక్షంలో ప్రతినెలా రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీపై పాలకులు మాట్లాడకపోవడంపై నిలదీస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందంటూ మండిపడుతున్నారు.

మరో వైపు, చంద్రబాబు ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. వాళ్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

Back to Top