తెలుగుదేశం పార్టీలో కుల దుహంకారం

మంత్రి, ఎమ్మెల్యేతో క్షమాపణలు చెప్పించడం దారుణం

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్ర‌హం

తెలుగుదేశం పార్టీలో బీసీ, ఎస్సీ ఎస్టీలను అణిచేస్తున్నారు 

బీసీలు మంత్రి పార్ధసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీషకు వేధింపులు

ఒక్కొక్కరితో మూడేసిసార్లు క్షమాపణలు చెప్పించడం హేయం

ప్రభుత్వ పదవుల్లోనూ, తెలుగుదేశం పార్టీలోనూ అదే ధోరణి

చంద్రబాబు సామాజికవర్గ ఎమ్మెల్యేలకున్న స్వేచ్ఛ బీసీలకు ఉండదా? 

సూటిగా ప్రశ్నించిన మార్గాని భరత్‌

చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో జాత్యహంకార ధోరణి

రాజమహేంద్రవరం పీఎస్‌లో దళిత యువకుడికి అవమానం

లాకప్‌లో అర్థనగ్నంగా కూర్చోబెట్టి దారుణంగా వేధించారు

దానిపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశాం

జాతీయ మానవ హక్కుల సంఘానికీ వినతి పత్రం ఇచ్చాం

అయినా ఇప్పటి వరకు పోలీసులపై ఎలాంటి చర్యలు లేవు

ప్రెస్‌మీట్‌లో మార్గాని భరత్‌ ఆక్షేపణ

రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీలో కుల దురహంకారం, కూటమి పాలనలో జాత్యాహంకార ధోరణి కొనసాగుతోందని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ వెల్లడించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అయినా సరే.. టీడీపీలో బీసీ, ఎస్సీ ఎస్టీలను అణిచి వేస్తున్నారని, చులకనగా చూస్తూ కుల దురహంకారం ప్రదర్శిస్తున్నారని ఆయన తెలిపారు.  రాజమహేంద్రవరం పీఎస్‌లో దళిత యువకుడిని దారుణంగా అవమానించి, అర్థనగ్నంగా లాకప్‌లో కూర్చోబెట్టిన అంశంపై ఇప్పటి వరకు పోలీసులను ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. మరోవైపు నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ నేత జోగి రమేష్‌ పాల్గొంటే.. దానిపై మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీషతో క్షమాపణలు చెప్పించడం, తెలుగుదేశం పార్టీలో కుల దురహంకారాన్ని ప్రత్యక్షంగా చూపుతోందని, రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన మార్గాని భరత్‌ స్పష్టం చేశారు.

 జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినా..:
– కాలనీలో సమస్యపై ప్రభుత్వాన్ని సోషల్‌ మీడియాలో ప్రశ్నించడాన్ని తప్పుబట్టిన ప్రభుత్వం, రాజమహేంద్రవరంలో విద్యావంతుడైన ఒక దళిత యువకుడిని దారుణంగా వేధించింది. పోలీస్‌ స్టేషన్‌ లాకప్‌లో అర్ధనగ్నంగా మహిళా కానిస్టేబుళ్ల ముందు నిలబెట్టారు. దారుణంగా దూషించి చంపేస్తామని కూడా బెదిరించారు.
– ఈ ఘటనపై వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ఎస్సీ కమిషన్‌తో పాటు, జాతీయ మానవ హక్కుల సం«ఘానికి (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కూడా ఫిర్యాదు చేసింది. వారు స్పందించి ఏపీ డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు పంపారు. 
– ఇంత జరిగినా, ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. అకారణంగా దళిత యువకుడిని వేధించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది కచ్చితంగా జాత్యాహంకారమే.

టీడీపీ–కుల దురహంకారం:
– ఏలూరు జిల్లా నూజివీడులో సర్దార్‌ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ జరిగితే, పార్టీలకు అతీతంగా వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. అది పూర్తిగా ఒక ప్రైవేటు కార్యక్రమం. ఒక పార్టీ కానీ, ప్రభుత్వం కానీ నిర్వహించింది కాదు.
– ఆ కార్యక్రమానికి తను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో, మంత్రి పార్థసారథి, గౌతు లచ్చన్న సామాజిక వర్గానికే చెందిన జోగి రమేష్‌ కూడా హాజరయ్యారు. ఇంకా టీడీపీకే చెందిన ఎమ్మెల్యే గౌతు లచ్చన్న మనవరాలు గౌతు శిరీష కూడా హాజరయ్యారు.
– అయితే కార్యక్రమంలో వైయస్సార్‌సీసీ నేత పాల్గొనడాన్ని టీడీపీ పెద్దలు సహించలేకపోయారు. దీనిపై మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీషను తప్పు పడుతూ, వివరణ కోరడమే కాకుండా, వారితో క్షమాపణలు చెప్పించారు.
– అంతే కాకుండా వారిపై పార్టీ సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ చేయించారు. దీనిపై ఎమ్మెల్యే గౌతు శిరీష తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
– ఇది కచ్చితంగా కుల దురహంకారమే. టీడీపీలో తొలి నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గుర్తింపు, ప్రాధాన్యం లేదు. 
– ప్రైవేటు కార్యక్రమాల్లో పార్టీలకతీతంగా పాల్గొనడం సహజం. అయినా దాన్ని టీడీపీ పెద్దలు తప్పు పట్టడం అత్యంత హేయం. నిజానికి ఈ విషయంలో వారికో న్యాయం.. పార్టీ నాయకులకో న్యాయం అన్నట్లుగా ఆ పార్టీ పెద్దలు వ్యవహరిస్తున్నారు.
– ఇటీవల హైదరాబాద్‌లో కమ్మ గ్లోబల్‌ సమ్మిట్‌ జరిగింది. అందులో పార్టీలకు అతీతంగా ఆ సామాజికవర్గానికి చెందిన నాయకులు పాల్గొన్నారు. మరి అప్పుడు దాన్ని చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు తప్పు పట్టలేదు? 
– అంతెందుకు మేము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ ఎంపీ లావు శ్రీకష్ణదేవరాయలు, టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్‌నాయుడితో కలిసి తిరిగేవారు. అయినా ఏనాడూ మేం అభ్యంతరం చెప్పలేదు. తప్పు పట్టలేదు.

పదవుల్లోనూ బీసీలకు అన్యాయం:
– కూటమి పాలనలో బీసీలను అణగదొక్కే విధానం పదవుల పంపకాల్లోనూ కనిపిస్తోంది. రాజమహేంద్రవరంలో సీనియర్‌ నాయకులు ఎర్రా వేణు, వాసిరెడ్డి రాంబాబుకు ఏపీ స్టేట్‌ డైరెక్టర్‌ పోస్టులతో సరిపెట్టారు. 
– రాజానగరం మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్‌కి కేబినెట్‌ హోదా కల్పించారు. బీసీలను మాత్రం డైరెక్టర్లుగా నియమించారు.

ఇదేనా సనాతన ధర్మం?:
– దేశంలో ఎక్కడా లేని విధంగా విచిత్రంగా మా రాజమహేంద్రవరంలో హోమియో మందుల షాపు, లిక్కర్‌ షాపు, మెడికల్‌ షాపు పక్కపక్కనే ఉంటాయి. గుడిపక్కనే వైన్‌ షాపును కూడా ఇక్కడే చూడొచ్చు. ఇదేనా ఎన్డీఏ ప్రభుత్వం కాపాడే సనాతన ధర్మం. 
– డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాన్‌ సొంత నియోజకవర్గం పిఠాపురంలో స్లాటర్‌ హౌస్‌ లో రోజుకు 200–300 ఆవుల్ని అక్రమంగా నరికేస్తుంటే ఆయన ఏం చేస్తున్నట్టు? ఇదే హిందూ ధర్మ పరిరక్షణ?. ఆ శ్లాటర్‌ హౌస్‌ నిర్వాహకుడు కూడా మా ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడే. 

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అవినీతి బాగోతాలు:
– కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఆరు నెలల్లో నగరంలో ఈవీఎం ఎమ్మెల్యే దందాల లిస్ట్‌ చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. కోటి లింగాల ఘాట్‌ నుంచి 4వ బ్రిడ్జి వరకు 15 ర్యాంపులు పెట్టి రోజుకు 700 నుంచి 800 లారీలతో డ్రెడ్జింగ్‌ చేసి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. 
– ఎమ్మెల్యే మామూళ్ల పేరుతో చిన్న లారీకి వెయ్యి, పెద్ద లారీకి రూ. 2 వేలు.. బాట ఛార్జీల పేరుతో మరో చిన్న లారీకి వెయ్యి, పెద్ద లారీకి రూ. 2 వేలు. ఇవి కాకుండా లోడింగ్‌ ఛార్జీలు, జేసీబీ ఛార్జీలు.. ఇలా అన్ని కలిపి ఒక్కో లారీ మీద ఎమ్మెల్యేకి అందుకుంటున్న మామూళ్లు రూ.8 వేలకు పైనే.. కనీసం 600 లారీలు అనుకున్నా.. ఈవీఎం ఎమ్మెల్యే ఆదాయం రోజుకు రూ. 24 లక్షలకు పైమాటే.
– లాలా కొండ దగ్గరున్న రూ.10 కోట్ల విలువైన ఇసుక కొండను బుక్కేశాడు.
– ఇవి చాలవన్నట్టు ఎక్కడికక్కడ పేకాట క్లబ్బులు నడుతుపుతున్న రింగ్‌ మాస్టర్‌ ఇక్కడ ఎమ్మెల్యే. 
– బ్లేడ్‌ బ్యాచ్‌ను వెంటబెట్టుకుని ఆకు రౌడీలా తిరిగేవాడు ఈవీఎం మహత్యంతో ఎమ్మెల్యే అయ్యాడు. దాని పర్యవసానాలు ఇప్పుడు రాజమండ్రి ప్రజలు అనుభవిస్తున్నారు. 
– భాస్కర్‌నగర్‌లో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఎన్ని వేల గజాలు కబ్జాలు చేశారో అందరికీ తెలుసు. ఒకటో వార్డులో లాలా చెరువు దగ్గర దొంగ డాక్యుమెంట్లు క్రియేట్‌ చేసి రూ.12 కోట్ల విలువైన ఆస్తిని స్వాహా చేస్తున్నారు. 
– ఇంకా వైన్‌ షాప్‌ల నుంచి యథేచ్ఛ వసూళ్లు. నగరంలో 28 షాపులుంటే ఒక్కొ షాపు నుంచి రూ. 50 వేలు, 10 బార్‌లుంటే ఒక్కో బార్‌ నుంచి లక్ష వసూలు చేస్తున్నాడు. మొత్తం నెలకు లిక్కర్‌ ఆదాయం మరో రూ.24 లక్షలకు పైమాటే.. 
– రాజమండ్రిలో మెడికల్‌ కాలేజీ కేంద్రంగా అవినీతి భారీ మొత్తంలో జరుగుతోంది. 

దమ్ముంటే నా మీద ఆరోపణలు రుజువు చేయాలి:
– ఇవన్నీ చాలవన్నట్టు నా మీద గౌతమి సూపర్‌ బజార్‌ కుంభకోణం అంటూ బురద జల్లుతున్నాడు. అధికారం వారి చేతుల్లో ఉంది కదా.. దాని వెనుక ఉన్న బాధ్యులను, అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. 
– 250 గజాల స్థలం లీజులో రూ.5 కోట్ల కుంభకోణం ఏముందో ఈవీఎం ఎమ్మెల్యే చెప్పొచ్చు.. దీనిపై నేను విచారణకు సిద్ధంగా ఉన్నా.. స్థలాన్ని లీజుకిచ్చిన అధికారిని పిలిపించి విచారణ చేయించవచ్చు. 
– ఆరోపణలను నిగ్గు తేల్చే దమ్ము లేకుండా బుదర జల్లడం మానుకోవాలి. మీది ఆదిరెడ్డి కుటుంబం కాదు.. అవినీతి కుటుంబం. రాష్ట్రంలో అతి పెద్ద అవినీతిపరుడు ఎవరని విచారణ చేస్తే మా ఈవీఎం ఎమ్మెల్యే శ్రీనివాస్‌ మొదటిస్థానంలో ఉంటాడు. 

క్రికెట్‌ టోర్నమెంట్‌:
    ఈనెల 21 మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా మార్గాని ఎస్టేట్‌లో వైయ‌స్ఆర్‌సీపీ క్రికెట్‌ లీగ్‌ పేరుతో టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నాం. మొదటి బహుమతిగా రూ.50 వేలు, రెండో బహుమతిగా రూ.25 వేలు, మూడో బహుమతి కింద రూ.15 వేలు అందజేస్తాం. 
    టోర్నమెంట్‌కి సంబంధించిన పోస్టర్‌ ప్రెస్‌మీట్‌లో ఆవిష్కరించిన మార్గాని భరత్, ఈ టోర్నీలో దాదాపు 100 జట్లు పాల్గొనే వీలుందని వెల్లడించారు.

Back to Top