తిరుపతి: ఏఆర్ కానిస్టేబుల్ జశ్వంత్‌పై దౌర్జన్యం చేసి దుర్భాషలాడి, చెంప దెబ్బ కొట్టిన మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి సోదరుడిని కఠినంగా శిక్షించాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కానిస్టేబుల్‌పై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో నిన్నటి రోజు మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి సోదరుడు, అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుల్ పైన చేయి చేసుకోవడం, నోటికి వచ్చిన బూతులు తిట్టి దుర్భాషలాడటం, అధికార మద దురహంకారానికి నిదర్శనమని భూమన మండిపడ్డారు. ఈ విధంగా పోలీసు అధికారులపై చేయి చేసుకోవడం ద్వారా వారి ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసే విధంగా, యావత్ పోలీసు అధికారుల మనోభావాలను గాయపరిచినట్లుగా ఉందన్నారు. పోలీసుల పట్ల కూటమి నాయకుల ప్రవర్తన సహించరానిదని ఆక్షేపించారు. ఈ ఘటనను వై.యస్.ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, కానిస్టేబుల్ జశ్వంత్ కు మద్దతుగా నిలుస్తామన్నారు. ఇంత నీచంగా ప్రవర్తించిన దోషుడికి శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి అనితను ఆయన డిమాండ్ చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సహాయం చేశాడన్న కారణంతో ఆయన సెక్యూరిటీపై అన్యాయంగా సస్పెన్షన్ వేటు వేసిన ఈ ప్రభుత్వం... అందరూ చూస్తుండగా తన విధులు నిర్వహిస్తున్న ఒక కానిస్టేబుల్ పై దౌర్జన్యం చేసి దుర్భాషలాడి, చెంప దెబ్బ కొట్టిన ఈ మంత్రి సోదరుడిపై మాత్రం ఎటువంటి చర్య తీసుకోవడం లేదని తప్పుపట్టారు. చట్టం ప్రతిపక్షానికి ఒకలాగా ... అధికార పక్షానికి ఒకలాగా పనిచేస్తుందని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు. నిందితుడికి సరైన గుణపాఠం చెప్పాలి అంటే వెంటనే హోం శాఖ మంత్రి అనిత ఈ ఘటనపైన వెనువెంటనే చర్యలు చేపట్టాలి అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.