తాడేపల్లి: రాష్ట్రంలో ఈ రబీ సీజన్‌లో శనగ, మొక్కజొన్న, అరటి, పొగాకు, ఆక్వా రైతులతో పాటు మామిడి రైతులు కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ యం.వి.ఎస్. నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తోతాపురి మామిడి రైతులు వరుసగా రెండో ఏడాది తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని పేర్కొన్నారు. 2025-26 మూడవ ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 8.33 లక్షల హెక్టార్లలో పండ్ల తోటలు సాగవుతుండగా, అందులో 3.99 లక్షల హెక్టార్లలో మామిడి సాగు జరుగుతోందని తెలిపారు. పండ్ల ఉత్పత్తిలో మొత్తం 239 లక్షల టన్నుల ఉత్పత్తి అంచనా ఉండగా, అరటి 88 లక్షల టన్నులతో మొదటి స్థానంలో, 53 లక్షల టన్నులతో మామిడి రెండో స్థానంలో ఉందన్నారు. ఈ ఏడాది తీవ్ర మంచు కారణంగా మంగు తెగులు వ్యాపించి, బంగినపల్లి సహా టేబుల్ రకాల మామిడి కాయలకు ధరలు తీవ్రంగా పడిపోయాయని తెలిపారు. దీంతో మామిడి రైతులు భారీగా నష్టపోయారని పేర్కొన్నారు. తోతాపురి రైతుల పరిస్థితి మరింత దయనీయం చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో తోతాపురి మామిడి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని నాగిరెడ్డి తెలిపారు. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, మార్కెట్ అనిశ్చితి కారణంగా దిగుబడులు తగ్గడంతో పాటు గిట్టుబాటు ధరలు కూడా లభించడం లేదన్నారు. పల్ప్ పరిశ్రమల కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడం రైతుల ఆందోళనను మరింత పెంచిందని చెప్పారు. గత ఏడాది తోతాపురి మామిడికి కిలోకు రూ.12 ధర నిర్ణయించి, అందులో ప్రభుత్వం రూ.4, పల్ప్ ఫ్యాక్టరీలు రూ.8 చెల్లిస్తాయని ప్రకటించినా, రైతులకు పూర్తిస్థాయిలో ప్రయోజనం అందలేదని పేర్కొన్నారు. ఫ్యాక్టరీలు చెల్లించాల్సిన రూ.8కు బదులు రూ.5 నుంచి రూ.6 మాత్రమే చెల్లించాయని రైతులు చెబుతున్నారని అన్నారు. దీనిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటో స్పష్టత లేదన్నారు. ధరలు మరింత పతనం ఈ ఏడాది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 7.8 లక్షల టన్నుల తోతాపురి మామిడి ఉత్పత్తి వస్తుందని అంచనా వేసినప్పటికీ, ప్రతికూల వాతావరణం కారణంగా ఉత్పత్తి తగ్గిందన్నారు. ప్రస్తుతం ర్యాంపుల్లో కిలో రూ.6, ఫ్యాక్టరీల్లో రూ.7 మాత్రమే ధర లభిస్తోందని రైతులు చెబుతున్నారని తెలిపారు. కూలీల వేతనాలు, ఎరువులు, పురుగుమందులు, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో రైతులు కనీసం గత ఏడాదికంటే కిలోకు రూ.2 అదనంగా, మొత్తం రూ.14 చొప్పున ప్రభుత్వం–కంపెనీలు కలిపి చెల్లిస్తే కొంత మేర నష్టాల నుంచి బయటపడతామని చెబుతున్నారని వివరించారు. 2023-24 సీజన్‌లో ఇదే తోతాపురి మామిడిని కిలో రూ.20 నుంచి రూ.22 వరకు విక్రయించామని రైతులు గుర్తు చేస్తున్నారని అన్నారు. రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి తోతాపురి మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు. దిగుబడి నష్టపోయిన రైతులకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని, రైతుల సమస్యల పరిష్కారం కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని రంగాల రైతులదీ ఇదే పరిస్థితి మంచి దిగుబడులు వచ్చిన రబీ పంటల రైతులు కూడా నష్టాల్లో కూరుకుపోయారని నాగిరెడ్డి తెలిపారు. 2023-24లో క్వింటాకు రూ.8 వేల వరకు ధర లభించిన శనగ రైతులు ఈ ఏడాది రూ.5 వేలకే అమ్ముకోవాల్సి వచ్చిందన్నారు. మొక్కజొన్న రైతులు కనీస మద్దతు ధర కంటే క్వింటాకు రూ.700 నుంచి రూ.800 తక్కువకు విక్రయిస్తున్నారని చెప్పారు. 88 లక్షల టన్నుల అరటి ఉత్పత్తి చేసిన రైతులు, 266 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి చేసిన రైతులు, లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి ద్వారా వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం తెచ్చిపెడుతున్న ఆక్వా రైతులు కూడా తీవ్ర సంక్షోభంలో ఉన్నారని పేర్కొన్నారు. 53 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి అంచనా ఉన్నప్పటికీ మామిడి రైతుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందన్నారు. గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆదాయం క్షీణిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించిన నాగిరెడ్డి, రైతులు మనుగడ సాగించేలా ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుని అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.