తాడేపల్లి: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దుదామని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్‌పై రేపు కడపలో కీలక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులతో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్‌పై పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ, ఉద్యమ రూపకల్పనపై ఈ టెలి కాన్ఫరెన్స్‌లో విస్తృతంగా చర్చించారు. ఈ టెలి కాన్ఫరెన్స్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్‌పై పార్టీ చేపట్టిన సన్నాహక కార్యక్రమానికి ప్రజల్లో విశేష స్పందన లభించిందన్నారు. వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కీలక ప్రాజెక్ట్‌ను ప్రారంభించారని, అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయన్నారు. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల భవిష్యత్తుకు ఈ ప్రాజెక్ట్ లైఫ్‌లైన్‌లాంటిదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ కేవలం సాగునీటి అవసరాలకే కాకుండా తాగునీటి భద్రతకూ కీలకమని, భవిష్యత్ తరాలకు రక్షణ కల్పించే ప్రణాళికగా జగన్ గారు దాన్ని రూపకల్పన చేశారని తెలిపారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం కేంద్ర అనుమతులు తీసుకురావడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్రంలో భాగస్వామ్యంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒత్తిడి తీసుకురావడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. రాయలసీమ లిఫ్ట్ అంశంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ప్రతి ఇంట్లో ఈ అంశంపై చర్చ జరిగేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమావేశాలు, చర్చావేదికలు, ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ ఈ అంశాన్ని ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహించామని, రేపు కడపలో జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం జరుగుతుందని తెలిపారు. రేపటి కడప సమావేశంలో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాలకు చెందిన ముఖ్య నాయకులంతా తప్పనిసరిగా పాల్గొనాలని, భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చిద్దామని సజ్జల పిలుపునిచ్చారు. మేధావులు, ప్రజాసంఘాలు, రైతు సంఘాలను కూడా భాగస్వామ్యం చేస్తూ ఉద్యమాన్ని విస్తృత స్థాయిలో ముందుకు తీసుకెళ్ళాలని సూచించారు. రాయలసీమ అభివృద్ధి, ప్రయోజనాలపై వైయస్ఆర్‌సీపీ మాత్రమే ముందునుంచీ పోరాడుతుందని, ప్రజా ప్రయోజనాల కోసం పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్ గారు ఈ అంశాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని, ప్రతి నాయకుడు దీనిని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ రేపు కడపలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని, సంబంధిత జిల్లాల నాయకులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని పిలుపునిచ్చారు. రాయలసీమ ప్రాంతానికి సాగునీరు మాత్రమే కాక తాగునీరు కూడా లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెడలు వంచేలా పెద్ద ఎత్తున ఉద్యమించి రాయలసీమ హక్కులు, ప్రయోజనాలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్‌ను ప్రజా ఉద్యమంగా మార్చేందుకు కడప సమావేశం కీలక మైలురాయిగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ రేపటి కడప సమవేశానికి తప్పనిసరిగా హాజరవ్వాలని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ టెలికాన్ఫరెన్స్‌ను పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్ లేళ్ళ అప్పిరెడ్డి సమన్వయం చేశారు.