బట్టబయలైన టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్ర

ప్రభుత్వ నిర్వాకంతోనే పెట్రోల్, డీజిల్‌ కృతిమ కొరత

సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టీకరణ

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి

అమరావతి పనులకు ప్రత్యేకంగా డీజిల్‌ కోసం లేఖ

రీటెయిల్‌ అవుట్‌లెట్స్‌ నుంచి సరఫరాకు విజ్ఞప్తి

ఏ మాత్రం సాధ్యం కాదన్న కేంద్ర పెట్రోలియం శాఖ

ఆ లేఖ ఉపసంహరించుకోవాలని సూచన

నిజానికి అప్పటికే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌ సంక్షోభం

అయినా ప్రభుత్వ లేఖ విడ్డూరం. సమస్య మరింత తీవ్రం

ఆధారాలతో సహా బయటపెట్టిన  సజ్జల

పెట్రోల్, డీజిల్‌ కొరతతో స్తంభించిన రాష్ట్రం

బంకుల్లో క్యూలు. ఆగిన పరిశ్రమలు, యంత్రాలు

సమస్యపై స్పందించకుండా చంద్రబాబు మొద్దునిద్ర

ప్రభుత్వ మాటలకు భిన్నంగా క్షేత్రస్థాయి పరిస్ధితులు 

ప్రెస్‌మీట్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి

తాడేపల్లి:    రాజధాని అమరావతిలో నిర్మాణాల కోసం రీటెయిల్‌ అవుట్‌లెట్స్‌ నుంచి హైస్పీడ్‌ డీజిల్‌ ప్రత్యేకంగా సరఫరా చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ (ఓఎంసీ)లకు లేఖ రాసిందని, ఆ విధంగా తమకు ఒక్క అమరావతి మినహా, రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు, అక్కడి ప్రజలు అంత ప్రాధాన్యం కాదన్న విషయాన్ని తేల్చి చెప్పిందని వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. అయితే అది ఏ మాత్రం సాధ్యం కాదని, అందువల్ల ఆ లేఖ ఉపసంహరించుకోవాలని కేంద్ర పెట్రోలియం శాఖ బదులిచ్చిందని ఆయన తెలిపారు. అయితే నిజానికి అప్పటికే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌ సంక్షోభం మొదలైందని, అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ లేఖ విడ్డూరం కాగా, ఆ తర్వాత సమస్య మరింత తీవ్రమైందని గుర్తు చేశారు.
    ఏ సంక్షోభం వచ్చినా లేదా ఏదైనా సంక్షోభాన్ని సృష్టించి, దాన్నుంచి దోచుకోవడానికి అలవాటు పడిన టీడీపీ నాయకుల వైఖరి ఇప్పుడు పెట్రోల్, డీజిల్‌ సంక్షోభానికి కారణమని చెప్పారు. అందుకే ఇది కృతిమ కొరత అని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
ప్రెస్‌మీట్‌లో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

పెట్రోల్, డీజిల్‌ లేక స్తంభించిన రాష్ట్రం:
    రాష్ట్రంలో దాదాపు వారం రోజులుగా ప్రభుత్వం ఉందా? పాలన సాగుతోందా? అన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్‌ లేకుండా జనజీవనం స్తంభించిపోయే పరిస్ధితి. పరిశ్రమలు, సేవలు సహా రోజువారీ కార్యకలాపాలన్నీ ఆగిపోతాయి. అలాంటి పరిస్ధితి రాష్ట్రంలో వారం రోజులుగా కనిపిస్తోంది. ఏ రోడ్డు చూసినా టూ వీలర్ల నుంచి భారీ వాహనాల వరకూ బంకుల ముందు క్యూలు కట్టి కనిపిస్తున్నాయి. లీటరు పెట్రోల్‌ కోసం జనం పరుగులు తీయాల్సిన దుస్దితి ఎదురవుతోంది. ఇంత జటిలమైన సమస్యపై ప్రభుత్వం స్సందించకుండా, సీఎం సమీక్షించారంటూ లీక్‌లతో కాలం గడిపేస్తోంది.

ఏ రాష్ట్రంలో లేని కొరత మనకే ఎందుకు?:
    వాస్తవంగా పెట్రోల్, డీజిల్‌ సరఫరా తగ్గితే అన్ని చోట్లా దాని ప్రభావం కనిపించాలి. కానీ, మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక, తెలంగాణలో కూడా ఎక్కడా ఈ సమస్య లేదు. ఇంకా చెప్పాలంటే ఎన్టీయే కూటమిలో లేని కర్నాటక, తెలంగాణతో పాటు, కేరళలో కూడా లేని పరిస్ధితులు.. అదే ఎన్డీయే అధికారంలో ఉన్న ఏపీలోనే ఎందుకు వస్తున్నాయి? అంత అనుభవజ్ఞడని చెప్పుకునే చంద్రబాబు సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఎందుకీ పరిస్ధితులు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. 
    ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చమురు సమస్యకు కారణం చమురు కంపెనీ ఐఓసీఎల్‌తో పాటు, పౌర సరఫరాల శాఖ అని చెబుతున్నారు. మరి పౌర సరఫరాల శాఖ ప్రభుత్వంలో లేదా? అదే ఐఓసీఎల్‌ కర్నాటకలో లేదా ? అక్కడ రాని సమస్య ఇక్కడే ఎందుకొచ్చింది?. 

అమరావతి కోసం ప్రభుత్వం కుట్ర:
    ఢిల్లీలో మా ఎంపీ అవినాష్‌రెడ్డి ఇవాళ పెట్రోలియం శాఖ కార్యదర్శిని కలిశారు. సమస్య ఏంటని అడిగితే.. తమ దగ్గర నుంచి పెట్రోల్, డీజిల్‌ సరఫరా సాధారణంగానే ఉందని ఆయన చెప్పారు. కాగా, రాష్ట్రంలో పౌర సరఫరాల కమిషనర్‌ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు లేఖ రాస్తూ.. అమరావతిలో నిర్మాణాలకు డీజిల్‌ కొరత రాకుండా స్ధానిక బంకుల నుంచి నిరాటంకంగా సరఫరా చేయాలని కోరారని ఆయన తెలిపారు. ఏప్రిల్‌ 24న పౌర సరఫరాల కమిషనర్‌ ఆ మేరకు ఓఎంసీలకు లేఖ రాయగా, దానిపై స్పందిస్తూ.. కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. అలా ప్రత్యేకంగా చమురు కేటాయింపు చేసే వ్యవస్ద లేదని, కాబట్టి ఓఎంసీలకు రాసిన లేఖ ఉపసంహరించుకోవాలని సూచించారు.
    అయితే నిజానికి అప్పటికే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌ సంక్షోభం మొదలైంది. అయినా అమరావతి కోసం ప్రత్యేకంగా డీజిల్‌ సరఫరా చేయాలని ప్రభుత్వం లేఖ రాయడం ఆశ్చర్యకరం. కేవలం అమరావతి నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తూ, మిగతా ప్రాంతాలపై అలక్ష్యం చూపడం, ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతోంది. మొత్తం మీద ప్రభుత్వ తీరు వల్ల ఆ తర్వాత సమస్య మరింత తీవ్రమైంది. అంటే కేవలం ప్రభుత్వ నిర్వాకం వల్లనే పెట్రోల్, డీజిల్‌ కృతిమ కొరత ఏర్పడింది.

ఆ కేటాయింపు ఏమిటి?:
    మీ దోపిడీ కోసం సృష్టించుకున్న మీ కలల రా«జధాని అమరావతి కోసమే మొత్తం ప్రభుత్వం పని చేస్తోందా? బల్క్‌ యూజర్లకు చమురు పంపిణీ కోసం కాంట్రాక్టర్లకు వేరే విధానం ఉన్నా, దాన్ని వదిలేసి ప్రభుత్వమే చమురు కంపెనీలపై ఒత్డిడి తీసుకు రావడమేంటి ?
సామాన్య పౌరులకు ఇవ్వాల్సిన పెట్రోల్, డీజిల్‌ను అమరావతికి కేటాయించుకోవడం ఏమిటి?. ప్రభుత్వంలో ఉన్నది పౌర సరఫరాల శాఖనా? లేక అమరావతి సరఫరాల శాఖనా? అనేది అర్ధం కావడం లేదు. దీని మీద పౌర సరఫరాల శాఖ మంత్రి మాట్లాడరు.
    తప్పిదాలన్నీ ప్రభుత్వం చేసి, ధరలు పెరుగుతాయన్న ఆందోళనతో పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుండడం వల్లనే పెట్రోల్, డీజిల్‌ సంక్షోభం ఏర్పడిందని చెప్పడం విడ్డూరం. అసలు మీరు సృష్టించిన భయాలే ఇవి. మీ చేతకానితనం వల్ల వినియోగదారుల్లో వచ్చిన భయం ఇది.  

సంక్షోభంతో దోపిడికి టీడీపీ నాయకుల కుట్ర:
    ఇదంతా ఉద్దేశపూర్వకంగానే సొంత సంపద పెంచుకునేందుకు కూటమి నాయకులు, దళారుల వ్యవస్ధ చేస్తున్న ప్రయత్నంలా ఉంది. అటు పెట్రో డీలర్లు, ఇటు కూటమి నాయకులు కుమ్మక్కై.. దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) కోసం చేస్తున్న కుట్ర ఇదంతా. అందుకే ప్రభుత్వం నుంచి రివ్యూ లేదు. సీఎం సీరియస్‌. నో స్టాక్‌ అన్న బోర్డు ఉండకూడదన్న ఆదేశాలు.. అంటూ లీక్‌లు తప్ప. 
    జగన్‌గారు తన హయాంలో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రజలకు చేర్చాల్సినవి చేర్చేందుకు పక్కా వ్యవస్ధను తయారు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ వ్యవస్థను పూర్తిగా కూల్చేసింది. అందుకే ఈ సంక్షోభం. ఈ ప్రక్రియ రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, యూరియాతో మొదలై, వంట గ్యాస్‌ (ఎల్పీజీ).. ఆ తర్వాత ఇప్పుడు పెట్రోల్, డీజిల్‌ వరకు చేరింది.
    పెట్రోల్, డీజిల్‌ సంక్షోభంతో అన్ని వర్గాల వారు నానా ఇబ్బంది పడుతున్నారు. ఆయిల్‌ సరఫరా మెరుగు పర్చని ప్రభుత్వం, చివరకు రేషన్‌ విధానానికి దిగడం సిగ్గుచేటు. టూవీలర్‌కు 2 లీటర్లు, కార్లకు 20 లీటర్లు ఇస్తున్నారు. అది దూర ప్రయాణానికి ఏ మాత్రం సరిపోతుంది? మొత్తం మీద ప్రభుత్వ వైఖరి, కుట్ర వల్లనే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌ సంక్షోభం మొదలైందని, అందుకే ఇది పూర్తిగా కృతిమ కొరత అని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు.

అనంతరం మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..

అదానీ డేటా సెంటర్‌లో చంద్రబాబు క్రెడిట్‌ చోరీ:
    విశాఖలో గూగుల్‌ (అదానీ) డేటా సెంటర్‌ తామే తీసుకొచ్చినట్లు చంద్రబాబు నానా హడావిడి చేస్తున్నారు. నిజానికి గత ప్రభుత్వంలో జగన్‌గారి హయాంలోనే అదానీ డేటా సెంటర్‌కు శ్రీకారం చుట్టారన్న విషయం అందరికీ తెలుసు. అప్పట్లోనే 3500 వేల మెగావాట్ల సామర్ధమున్న ఈ డేటా సెంటర్‌ కోసం సబ్‌ సీ కేబుల్స్‌ సింగపూర్‌ నుంచి తీసుకొచ్చేందుకు లేఖలు రాయడం జరిగింది. దీనికి కొనసాగింపుగా తాము మరింత విస్తరిస్తున్నట్లు చంద్రబాబు చెప్పి ఉంటే బాగుండేది. కానీ చంద్రబాబు తనవి కానివన్నీ చెప్పుకుంటూ, అదానీ పేరు కనబడితే జగన్‌గారు గుర్తుకొస్తారని దాచేస్తున్నారు.
    డీజిల్‌ తీసుకు రాలేని చంద్రబాబు గూగుల్‌ ఏం తెస్తాడని జనం నవ్వుకుంటున్నారు. అసలు విధ్వంసం అంటే ఇదీ. చంద్రబాబునాయుడు అసలు విధ్వంసకారుడు. పెట్రోల్, డీజిల్‌ విషయంలో ప్రజల్ని దొంగదెబ్బ కొడుతోంది చంద్రబాబే. 
    హైకోర్టు ఆదేశాలను యథేచ్ఛగా బేఖాతరు చేస్తూ, అక్రమంగా జరుగుతున్న రవాణాను ప్రశ్నించిన నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌పై టీడీపీ గుండాలు దాడి చేయడం అత్యంత హేయం. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

Back to Top