విశాఖపట్నం: విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటును వైయస్ఆర్‌సీపీ స్వాగతిస్తుందని, కానీ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఎన్ని ఉద్యోగాలొస్తాయో ఎందుకు చెప్పడం లేదని వైయస్ఆర్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. విశాఖలోని పార్టీ సిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డేటా సెంటర్ ఏర్పాటుకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు, లోకేష్ సహా కూటమి నాయకులు ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగ కల్పన అంశాన్ని ప్రస్తావించకుండా యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో 300 మెగావాట్ల అదానీ డేటా సెంటర్ ఏర్పాటుతో చేసుకున్న ఒప్పందం ద్వారా 25 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రణాళిక రూపొందించామని, ఆ మేరకు ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్, స్కిల్ వర్సిటీ, రీక్రియేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసేలా అదానీ చేసుకున్న ఒప్పందాన్ని గుర్తు చేశారు. కానీ నేడు 1 గిగా వాట్ డేటా సెంటర్‌కి రూ.22 వేల కోట్ల రాయితీలిస్తున్న కూటమి ప్రభుత్వం, ఉద్యోగాల హామీ తీసుకోకపోవడం ఏమిటని మండిపడ్డారు. రెండు నెలల్లో పోలవరం ద్వారా విశాఖ డేటా సెంటర్‌కి నీరు తెస్తామని చెబుతున్న చంద్రబాబు, ఎలా తెస్తారో చెప్పాలని నిలదీశారు. మాయమాటలతో ప్రజలను మోసం చేసే ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. అంతర్జాతీయ వేదికపై రాజకీయ ప్రస్తావన తీసుకొచ్చి వైయస్ఆర్‌సీపీని విమర్శించడం లోకేష్ అల్ప బుద్ధికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... - ఎన్ని ఉద్యోగాలిస్తారో చెప్పరే... అదానీ, ఎయిర్‌టెల్, గూగుల్ సంస్థలు సంయుక్తంగా విశాఖలో ఏర్పాటు చేస్తున్న 1 గిగా వాట్ డేటా సెంటర్‌కి శంకుస్థాపన చేయడాన్ని వైయస్ఆర్‌సీపీ స్వాగతిస్తోంది. ఈ అదానీ డేటా సెంటర్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 600 ఎకరాల భూమితోపాటు దాదాపు రూ. 22 వేల కోట్లు రాయితీలు ఇస్తోంది. ఇవేకాకుండా డేటా సెంటర్ నిర్వహణకు భారీ ఎత్తున నీరు, విద్యుత్ సరఫరా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంత భారీ స్థాయిలో రాయితీలు ప్రకటిస్తున్నా, ఆ సంస్థ నుంచి నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనపై కూటమి ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. ఈరోజు జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఏ ఒక్కరూ ఉద్యోగాల కల్పన గురించి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. యువత ఆశల మీద కూటమి ప్రభుత్వం నీళ్లు చల్లింది. - 1.80 లక్షల మందికి ఉద్యోగాలొస్తాయని అన్నారు కదా.. గతంలో అక్టోబర్ నెలలో ఢిల్లీలో ఒప్పందం జరిగిన సందర్భంలో డేటా సెంటర్ ద్వారా 1.80 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు సహా మంత్రులు, కూటమి నాయకులు ప్రచారం చేశారు. అయితే ఒప్పందంలో మాత్రం 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయనే అంశాన్ని గుర్తించి వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని నిలదీశాం. దీనిపై క్లారిటీ ఇవ్వాలని పదే పదే ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. కనీసం ఈరోజు శంకుస్థాపన సందర్భంగానైనా సరే డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా కలిగే ఉద్యోగాల కల్పన గురించి ఏ ఒక్కరూ ప్రస్తావించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. డేటా సెంటర్ ద్వారా ఉద్యోగాల కల్పన జరగదని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డేటా సెంటర్ల ఏర్పాటును చూస్తే అర్థమైపోతుంది. కానీ మూడు ప్రముఖ సంస్థలు గూగుల్, ఎయిర్ టెల్, అదానీ సంస్థలు సంయుక్తంగా డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నా ఉద్యోగాల అంశం ప్రస్తావనకు రావడం ఆశ్చర్యంగా ఉంది. అంత భారీ స్థాయిలో రాయితీలు కల్పిస్తున్నాం కాబట్టి ఆయా సంస్థలను విశాఖలో డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఒప్పిస్తే చేస్తే స్థానిక యువతకు కూడా లబ్ధి జరుగుతుందని వైయస్ఆర్‌సీపీమొదట్నుంచీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తోంది. - 25 వేల ఉద్యోగాలు కల్పించేలా నాడు వైయస్ఆర్‌సీపీ ప్రణాళిక వైయస్ఆర్‌సీపీ హయాంలోనే విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు బీజం పడింది. ఆ మేరకు 130 ఎకరాల స్థలాన్ని కేటాయించడంతోపాటు ఉద్యోగాల కల్పనకు వారి నుంచి ప్రభుత్వం హామీ తీసుకోవడం జరిగింది. డేటా సెంటర్‌కు డేటా రావాలంటే సింగపూర్ నుంచి 3,900 కి.మీ. పొడవున సబ్‌సీ (సముద్ర గర్భం)లో కేబుళ్లు వేయాలి. అందుకోసం 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. డేటా సెంటర్‌తోపాటు ఐటీ పార్కు, రీక్రియేషన్ సెంటర్, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేలా అదానీతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ మేరకు 25 వేల మందికి ఉద్యోగాల కల్పనకు ఆ సంస్థను ఒప్పించాం. ఈ నేపథ్యంలోనే విశాఖలో 300 మెగా వాట్ల అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు 2023 మే 3న శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. దానికి అనుగుణంగా రూ. 14 వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఐటీ హిల్ 4 మీద ఐటీ పార్కు, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదించి ఒప్పందం చేసుకున్నాం. కానీ కూటమి ప్రభుత్వం డేటా సెంటర్ సామర్థ్యాన్ని 1 గిగా వాట్‌కి పెంచడంతో పాటు భారీ స్థాయిలో రాయితీలు కల్పిస్తూ కూడా స్థానిక యువతకు ఉద్యోగాల అంశాన్ని చాలా తేలిగ్గా తీసుకుంది. కనీసం డేటా సెంటర్ నిర్వహణకు అవసరమైన నీరు, విద్యుత్ ను ఎలా సమకూరుస్తారో చెప్పాలని వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేసినా ఆరు నెలలుగా ప్రభుత్వం నుంచి సమాధానం రాకపోవడం విడ్డూరంగా ఉంది. - పోలవరం నుంచి నీళ్లు ఎలా తెస్తారో చెప్పండి డేటా సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన సందర్భంగా రెండు నెలల్లోనే గోదావరి నీళ్లు విశాఖకు తీసుకొస్తామని చంద్రబాబు ప్రకటించాడు. ఎలా తెస్తాడో చెప్పడం లేదు. పోలవరం నీరు తెచ్చే అవకాశం లేదు. పైపులైన్ల వ్యవస్థ లేదు. మేం ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారనే భ్రమల్లోనే చంద్రబాబు ఉన్నాడు. పోలవరం పూర్తి చేస్తే విశాఖకు నీరొస్తుందని అనుకున్నా, చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41 మీటర్లకు కుదించేశాడు. కాబట్టి ఆ ఎత్తులో పోలవరం నుంచి విశాఖకు నీరు వచ్చే అవకాశమే లేదు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ పచ్చి అబద్ధాలు చెప్పి మాయమాటలతో ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్నాడు. డేటా సెంటర్‌కి కావాల్సిన విద్యుత్ అవసరాలను కూడా వైయస్ జగన్ గారు రెన్యు ఎనర్జీ, గ్రీన్‌కో, రిలయన్స్, అదానీ వంటి పెద్ద సంస్థలతో చేసుకున్న ఒప్పందాలే తీర్చబోతున్నాయి. ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నమే జరగడం లేదు. - లోకేష్ అల్పబుద్ధి.. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు డేటా సెంటర్ ఏర్పాటు చేయడం కీలక పరిణామం. అలాంటి వేదిక మీద కూడా మంత్రి నారా లోకేష్ రాజకీయాలు మాట్లాడటం ఆయన అల్పబుద్ధిని సూచిస్తోంది. అంతర్జాతీయ వేదికలపై గొడ్డలి, లడ్డూ అంటూ లోకేష్ చేసిన ప్రసంగం ఆయన అవివేకానికి నిదర్శనం. ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలియని లోకేష్ తెలివితక్కువతనాన్ని చూసి చింతిస్తున్నా. పంచ్‌లు, ప్రాసల మీద పెట్టే శ్రద్ధ ఆయన సొంత శాఖ మీద పెడితే బాగుంటుంది. 10 రోజులు కనిపించకుండా పోయిన లోకేష్, ఎక్కడికెళ్లాడో చెప్పకుండా తీరా ఈరోజు వచ్చి కుటుంబంతో వెళ్లానని ట్వీట్ చేయడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడు. మంత్రులంతా బాధ్యతలను పక్కనపెట్టి విదేశీ టూర్ల పేరుతో షికార్లు చేయడం సిగ్గుచేటు. నాలుగు రోజులుగా ఇంధనం దొరక్క వినియోగదారులు ఇబ్బంది పడుతుంటే చక్కదిద్దలేని అసమర్థ ప్రభుత్వాన్ని నడుపుతున్నందుకు సిగ్గుపడాలి. వైయస్ఆర్‌సీపీ హయాంలో కరోనా వంటి ప్రళయాన్ని హ్యాండిల్ చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం రెండు లీటర్లు పెట్రోల్ ఇవ్వలేక చేతులెత్తేస్తోంది. పవన్ కళ్యాణ్ లేని సమయం చూసి కార్యక్రమం పెట్టుకుని, ఆయన బాధపడకుండా చేయడానికి ఆయన సినిమా డైలాగులతో డ్రామా చేశాడు. చంద్రబాబు వెన్నుపోటు సంగతి దేశ ప్రజలందరికీ తెలుసు. గొడ్డలి అని విమర్శిస్తున్న లోకేష్.. తన తండ్రి ఎలాంటి వాడో మర్చిపోతే ఎలా? సొంతంగా పార్టీ పెట్టి ఒంటరిగా పోటీ చేసి పార్టీని అధికారంలోకి తెచ్చిన వైయస్ జగన్ గారితో.. మూడు పార్టీలు కలిసి పోటీ చేసిన వారికి లేదు. వైయస్ఆర్‌సీపీ హయాంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి చూపిస్తే, చంద్రబాబు రెండేళ్లయినా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేకపోయాడు. బోత్ ఆర్ నాట్ సేమ్ అని లోకేష్ గుర్తుంచుకోవాలంటూ గుడివాడ అమర్నాథ్ హితవు పలికారు.