కూటమి ఏలుబడిలో దళితులపై దమనకాండ 

దళితులపై దాడుల ఘటనలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి

వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్ 

అనంతపురం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు పెరిగిపోయాయని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, రాజ్యాంగ విరుద్ధమైన పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. అనంతపురంలోని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి నాయకుల అండదండలతో దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, హోం మంత్రి వంగలపూడి అనిత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒక దళిత మహిళగా ఉండి కూడా దళితులపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. అలాగే గతంలో దళితుల సమస్యలపై గొంతెత్తిన టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.

దళితులపై ఇటీవల జరిగిన హత్యలు, దాడుల ఘటనలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో నిష్పాక్షిక విచారణ జరిపించాలని, హోం మంత్రి అనిత రాజీనామా చేయాలని, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. దాడులకు పాల్పడిన నిందితులు, వారికి సహకరించిన వారిపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ సెల్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని చామలూరు రాజగోపాల్ హెచ్చరించారు. 

Back to Top