విశాఖపట్నం: ప్రజలు, రైతుల పట్ల కూటమి ప్రభుత్వం కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది తలెత్తినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా చేతులెత్తేయం చంద్రబాబు ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాన్ ప్రభావంతో రైతులు నష్టపోతే, నష్టం అంచనాకు క్షేత్రస్ధాయిలో కనీసం పర్యటించలేదని ఆక్షేపించారు. పంటలు కోల్పోయిన రైతులకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి పరిహారం కూడా ప్రకటించలేదన్న ఆయన, తెస్తున్న అప్పంతా ఏమవుతోందని నిలదీశారు. కాశీబుగ్గ ఆలయ ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమన్న బొత్స సత్యనారాయణ, శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తేల్చి చెప్పారు. ప్రెస్‌మీట్‌లో బొత్స సత్యనారాయణ ఇంకా ఏమన్నారంటే..: ● రైతులకు అండగా వైయస్.జగన్ ప్రభుత్వం: అన్నం పెట్టే రైతన్న చేయి పెట్టేవాడిగా ఉండాలే తప్ప.. చేయి పట్టేవాడిగా ఉండదరాన్న స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనలే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం. మా హయాంలో అదే తరహాలో రైతులకు అన్ని రకాలుగా అండగా ఉన్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి అడుగులో రైతుల చేయి పట్టించుకుని నడిపాం. విత్తనం మొదలు పంటల అమ్మకం వరకు ఆర్బీకేలు రైతులకు తోడుగా నిలబడ్డాయి. ప్రతి ఎకరాకు పక్కాగా ఈ–క్రాప్ చేశాం. తద్వారా పంట పండించిన రైతులు అధిక వర్షాలు, కరువు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి నష్టపోతే వారికి, ఆ సీజన్ ముగిసేలోగానే పరిహారం అందించే ఏర్పాటు చేశాం. ● ఇది విఫల ప్రభుత్వం: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చెల్లించే విధానానికి స్వస్తి చెప్పి.. మరలా పూర్వపు పద్దతిలో పంట ఇన్సూరెన్స్‌ను రైతులే కట్టాలనే నిబంధన తీసుకొచ్చారు. ఒకవేళ రైతులు కట్టకపోతే వారిని ప్రోత్సహించి.. కట్టేలా చేయాల్సిన ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఇవాళ తుపాన్ ప్రభావంతో అధిక వర్షాలు వల్ల రైతులు పంట నష్టపోయారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తుపాన్ ప్రభావం ఉంది. వరి, అరటి, ప్రత్తి, చెరకు, పూలతోటలు అన్ని రకాల రైతులు నష్ట పోయారు. వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రులు మాటలు మాత్రమే చెబుతున్నారు. ఎక్కడా చేతలు కనిపించడం లేదు. పంట పొలాల్లో నుంచి నీరు పోయినా ఇప్పటి వరకూ పంట నష్టంపై ప్రకటన చెయ్యలేదు. నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇంత సాయం చేస్తామని భరోసా కల్పించే ప్రకటన ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ లేదు. రైతు శ్రేయస్సు గురించి ఆలోచించే మనస్సు ఈ ప్రభుత్వానికి లేదు. దీనిపై మాట్లాడితే మా మీద బురద జల్లుతున్నారు. ● ప్రశ్నిస్తూనే ఉంటాం: ప్రభుత్వం మాపై బురద చల్లినా మేం ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటాం. మా పరిపాలనలో గత ఐదేళ్లలో మేం రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఇప్పుడూ అలాగే జరగాలని, రైతు నష్టపోకూడనన్నది మా విధానం. రైతులు కూటమి ప్రభుత్వానికి అవసరం లేదు. మీరు కరపత్రాలు వేసి మరీ ఇచ్చిన హామీలనే ప్రశ్నిస్తున్నాం? రైతులకు మంచి చెయ్యండి. అది మానేసి విమర్శలు చేస్తే ఎలా?. ఇక ఎల్లో మీడియాను చూస్తుంటే నవ్వాలో ఏడాలో కూడా అర్ధం కావడం లేదు. చంద్రబాబు శక్తి ఉంటే తుపాన్ ను ఏపీ నుంచి దూరంగా విసిరికొట్టేవాడని మాట్లాడుతూ... చివరకు పాలనను అపహాస్యం చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలంలో అధిక వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఏ జిల్లాకు ఎంత నిధులిచ్చారు? రైతులకు ఏ మేరకు మేలు చేశారో ప్రభుత్వం ప్రకటించాలి. ఇన్సూరెన్స్ చేస్తే ఆ వివరాలు, ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లిస్తే ఆ వివరాలు వెల్లడించాలి? ● వ్యవసాయం, విద్య, వైద్యం మా ప్రాధాన్యతలు: వ్యవసాయం, విద్య, వైద్యం మా ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలు. అది మా పార్టీ విధానం. ఉచితంగా రైతుల ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టాలనేది మా విధానం. కూటమి విధానం రైతులే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఏ వర్గానికి ఏమి వద్దు అనేది కూటమి విధానం. విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత. అధికారం ఉంది కదా అని వైద్య విద్యను అమ్మేస్తామనడం సరికాదు. పేదవాడు వైద్యవిద్యను ఎలా అభ్యసిస్తాడు? ● కాశీబుగ్గ దుర్ఘటన ప్రభుత్వ వైఫల్యమే: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట అత్యంత దురదృష్టకరం. 15 నుంచి 20 వేల మంది భక్తులు వచ్చారు. కనీస పోలీసు భద్రత కల్పించలేదు. లా అండ్ ఆర్డర్ నిర్వహించే పరిస్థితి లేదు. ఇదేమని అడిగితే, ముఖ్యమంత్రి, మంత్రులు బాధ్యతారాహిత్యంగా అది ప్రైవేట్ ఆలయం అంటున్నారు. ఇవేం మాటలు!. ఏకాదశి పర్వదినాన జనాలు పెద్ద ఎత్తున వస్తారన్న చోట రక్షణ కల్పించాల్సింది ప్రభుత్వం కాదా? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుపతి, సింహాచలంలో ఇదే రకమైన ఘటనలు జరిగాయి. రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం ఏమిటంటే, చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఇలాంటి ఘటనలే జరుగుతాయి. వైయస్ఆర్‌సీపీ ఐదేళ్ల పాలనలో వైయస్.జగన్ హయాంలో ఎప్పుడైనా ఇలాంటి ఘటన ఒక్కటైనా జరిగిందా? కారణం.. ఏ పండగలు, ప్రత్యేక సందర్భాలు వచ్చినా తగిన ముందస్తు ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టే ఇలాంటి ఘటనలు లేవు. ప్రజలు చనిపోయిన తర్వాత వచ్చి మాట్లాడుతున్నారు. ఇందుకేనా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది? ప్రజలు ఒకసారి ఓట్లేసి గెలిపించిన తర్వాత అందరికీ ముఖ్యమంత్రే. ఆ స్ధాయిలో ఉన్న వ్యక్తి అది ప్రైవేటు దేవాలయం అని మాట్లాడ్డం ఎంతవరకు సమంజసం? తిరుపతి, సింహాచలంలో ఇలాంటి ఘటనలు జరిగితే వాటి నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు? ఎలాంటి చర్యలు తీసుకున్నారు? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం ఏదైనా నిర్దిష్ట విధానం (ఎస్‌ఓపీ) రూపొందించుకుందా? దాన్ని విడుదల చేసిందా?. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రజల కోసం పని చేయాలి. అది కాకుండా రాష్ట్రంలో ఏం జరిగినా వైయస్ఆర్‌సీపీవారిని ఎలా ఇరికించాలా అని ప్రభుత్వం పని చేస్తోంది. మొంథా తుపాన్‌లో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవడంతో పాటు, కాశీబుగ్గ దుర్ఘటనకు కారణాలు ఏంటో, బాధ్యులెవరో సమాధానం చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ● మీడియా ప్రశ్నలకు బదులిస్తూ.. మా ప్రభుత్వ హయాంలో ప్రతి ఎకరా ఇ–క్రాప్ చేయడంతో పాటు బీమా ప్రీమియం ప్రభుత్వం తరపున చెల్లించడంతో పాటు, రైతులు కట్టాల్సింది కూడా వారి తరపున మేమే చెల్లించాం. దాన్ని ఒక పాలసీగా రూపొందించాం. అది ఈ ప్రభుత్వంలో నిల్చిపోయింది. పొగాకు, మిర్చి, అరటి, మామిడి వంటి పంటలకు రైతులకు మద్ధతు ధర రాకపోతే ప్రభుత్వమే జోక్యం చేసుకుని మద్దుతు ధర ఇచ్చేది. అందుకోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. ఆ దిశలో 5 ఏళ్లలో రూ.7800 కోట్లు ఖర్చు చేశాం. ఇ–క్రాప్ చేయకుండా నష్టపోయిన రైతులు వివరాలు ఈ ప్రభుత్వానికి ఎలా వస్తాయి. 80 లక్షల మంది రైతులు ఉంటే... కేవలం 19 లక్షల రైతులకే పంటల బీమా సదుపాయం ఉంది. మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి?. ఈ ప్రభుత్వం, పోలీసులు ఉన్నది వైయస్ఆర్‌సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకా? తప్పు చేసిన వారిని శిక్షించడానికా? ఎన్నికల మందు రూ.25 వేల కోట్ల విలువైన డ్రగ్స్ కంటైనర్ దొరికిందని అంటే నేనే .. ఈ అంశంలో దర్యాప్తు చేయాలని సీబీఐకి లేఖ రాశాను. భోగాపురం విమానాశ్రయానికి చంద్రబాబు 2014–19 మధ్య ఏ పనీ చేయలేకపోతే, మేం వచ్చాక అవసరమైన ల్యాండ్ పూలింగ్ చేసాం. శంకుస్థాపన చేసిన రోజే మొదటి విమానం రాక కోసం టార్గెట్ పెట్టుకున్నాం. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఊ అంటే భోగాపురం వెళ్తున్నాడు. నిజానికి ఎయిర్‌పోర్టు నిర్మాణానికి, ఎయిర్‌పోర్ట్ ఆధారిటీ ఆఫ్ ఇండియాకు ఏ సంబంధం లేదు. మీరు కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందాన వ్యవహరిస్తున్నారు. మీకు చేతనైతే ఎయిర్‌పోర్టుకు అప్రోచ్ రోడ్స్ తేవాలి. విశాఖలో పెట్టుబడుల సదస్సుపై మాట్లాడుతూ, గత మా ప్రభుత్వంలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ (జీఐఎస్) నిర్వహించాం. అప్పుడు అంబానీ, జిందాల్, ఆదానీ, మిట్టల్ వంటి వారు హాజరయ్యారు. మరి ఇప్పుడు ఎవరెవరు హాజరవుతారో చూడాలి. మొన్న అసెంబ్లీలో జరిగింది చూసిన తర్వాత ఎవరు అసెంబ్లీకి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తారు. పవిత్రమైన అసెంబ్లీకి తాగి వచ్చి మాట్లాడితే ఎవరైనా వెళ్తారా? ఏమైనా చర్యలు తీసుకున్నారా? బాలకృష్ణగారు మద్యం సేవించి వచ్చి మాట్లాడితే ప్రభుత్వం నుంచి వివరణ కూడా లేదు. అలాంటి పరిస్థితులు ఉన్న అసెంబ్లీకి వెళ్ళేకంటే ప్రజలకు వివరంగా చెప్పడం మేలు. అనర్హత వేటు వేసే హక్కు స్పీకర్‌కు ఉందన్నప్పుడు, ఇంకా ఆగడం ఎందుకు?. అనర్హతపై నిర్ణయం తీసుకోవచ్చు కదా? అని బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు.