తిరుపతి: కూటమి సర్కార్ చీకటి పాలనకు నిలువెత్తు నిదర్శనం ఇది అని వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రం పాదాల చెంత కొలువుదీరిన తిరుపతిలో ...నిత్యం వేలాది మంది భక్తులు సంచరిస్తుంటారు. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే సదాశయంతో వైయస్ఆర్‌సీపీ హయాంలో భూమన కరుణాకరరెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ నేతృత్వంలో నగరంలో నలుమూలలా విశాలమైన రోడ్లు ఏర్పాటు చేశారు. అలాగే నగర ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని, పేరుకు తగ్గట్టు తిరుపతి నిత్యం వెలుగొందేలా వీధిలైట్లు ఏర్పాటు చేశారు. అయితే కూటమి సర్కార్ కొలువుదీరిన తర్వాత కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామినే చీకట్లో మగ్గిపోయే దుస్థితిని తీసుకొచ్చారు. ఇది ముమ్మాటికీ పాలకుల అంధత్వానికి నిదర్శనమనే విమర్శ వెల్లువెత్తుతోంది. తిరుపతి -కరంకంబాడి మార్గంలో వైయస్ఆర్‌సీపీ హయాంలో టీటీడీ వెన్నుదన్నుతో ఏర్పాటు చేసిన వీధిదీపాలు... నేటి అలంకారప్రాయంగా మారడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ మార్గంలో వీవీఐపీలతో పాటు సామాన్య భక్తులు నిత్యం ప్రయాణిస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన మార్గంలో వీధిలైట్లు ఏడాదిగా వెలగకుండా, భక్తులు అవస్థలు పడుతున్నా, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, అలాగే టీటీడీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న స్థానిక బీజేపీ నాయకుడికి కనీసం చీమ కుట్టినట్టైనా లేకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. కొన్ని నెలల కిందట సీఎం చంద్రబాబు గారు తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమనీకి వచ్చినప్పుడు మాత్రం వీధి దీపాలు వెలిగించారు!అంటే… వెలుగు కేవలం వీరి కోసం మాత్రమేనా? వీధి దీపాలు వెలగకపోవడంతో నిత్యం భక్తులు, వివిధ రకాల పనులపై తిరుపతికి వచ్చేవాళ్లు, పోయేవాళ్లు ప్రమాదాలబారిన పడుతూ, ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో పాలకుల చీకటి పొరలు తొలగించి, నగరంలో వెలుగులు నింపేందుకు తిరుపతి వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ గారి నేతృత్వంలో తిరుపతి -కరకంబాడి మార్గంలో ఆదివారం సాయంత్రం నిరసన కార్యక్రమం చేపట్టారు. భక్తులు, ప్రజల సౌకర్యార్థం చేపట్టిన నిరసన వల్ల గంటపాటు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని, అయితే ఇదంతా తమ కోసమే అని గుర్తించి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.