వెన్నుపోటు రాజకీయాలకు రెండేళ్లు..

ఆలమూరులో వైయ‌స్ఆర్‌సీపీ నిరసన కార్యక్రమం

 ఆలమూరు : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైన సందర్భంగా "వెన్నుపోటుకు రెండేళ్లు" పేరుతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఆలమూరు మండలం ఆలమూరు గ్రామంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తపేట నియోజకవర్గ పరిశీలకుడు పాటి శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా విస్మరించిందని, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన సాగిస్తోందని నాయకులు విమర్శించారు. ప్రజల విశ్వాసాన్ని ప్రభుత్వం కోల్పోయిందని ఆరోపించారు.

ర్యాలీ అనంతరం కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టో ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసిన ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైయ‌స్ఆర్‌సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలు, సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న నిర్లక్ష్యంపై పార్టీ తరఫున ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు.

ప్రజల హక్కుల పరిరక్షణ, సామాన్య ప్రజల సంక్షేమం కోసం వైయ‌స్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

Back to Top