అనంతపురం : కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ విమర్శించారు. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామం బైపాస్ రోడ్డులోని స్టార్ ఫంక్షన్ హాల్‌లో “చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నియోజకవర్గ స్థాయి టౌన్ హాల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు వై. నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, నియోజకవర్గ అబ్జర్వర్ ఎల్.ఎం. మోహన్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ సాకే శైలజనాథ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రెండేళ్లలో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందన్నారు. రైతులకు అండగా ఉంటామని చెప్పి అప్పుల ఊబిలోకి నెట్టారని, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను నిరాశపరిచారని విమర్శించారు. మహిళలకు ఆర్థిక భరోసా, పేదలకు సంక్షేమం, నిరుద్యోగ భృతి, సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సింగనమల నియోజకవర్గానికి హంద్రీ-నీవా జలాలు అందడం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దూరదృష్టి ఫలితమని పేర్కొన్నారు. రైతుల సమస్యలపై మాట్లాడితే రాజకీయమంటున్నారని, రైతుల పక్షాన పోరాడేందుకు వైయస్ఆర్‌సీపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి కంటే అరాచకాలు పెరిగాయని, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తాగునీరు, సాగునీరు, ఉపాధి, విద్య, వైద్యం వంటి రంగాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ప్రచారాలకే పరిమితమైందని విమర్శించారు. ప్రజల విశ్వాసానికి వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం నిలిచిపోయిందన్నారు. నియోజకవర్గ అబ్జర్వర్ ఎల్.ఎం. మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించడం చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేసిన ప్రభుత్వాలకు ప్రజలే తగిన సమయంలో తీర్పు చెబుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐటీ వింగ్ స్టేట్ సెక్రటరీ మంజునాథ్, నాయకులు నార్పల సత్యనారాయణరెడ్డి, గార్లదిన్నె నారాయణరెడ్డి, బొమ్మన శ్రీరాంరెడ్డి, వంశీ గోకుల్‌రెడ్డి, చామలూరు రాజగోపాల్, ఎల్లారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, పరంధామరెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.