తాడేపల్లి: విజయవాడ నగరంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారి పోయిందని, ప్రజల భద్రత కంటే మంత్రి నారా లోకేష్‌ను మెప్పించడమే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు ధ్యేయంగా మారిందని ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. సాయికృష్ణ లాకప్‌డెత్ విజయవాడ సీపీ ఆధ్వర్యంలోనే జరిగిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన కాకుండా రాజకీయ ప్రేరేపిత పోలీసింగ్ కొనసాగుతోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన దేవినేని అవినాష్ గుర్తు చేశారు. ప్రెస్‌మీట్‌లో దేవినేని అవినాష్ ఏమన్నారంటే.. విజయవాడ సీపీకి లా అండ్ ఆర్డర్‌పై శ్రద్ధ లేదు: విజయవాడ నగరంలో జరుగుతున్న సంఘటనలు దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ప్రాణాలు తీస్తున్నారు. కాపు యువకుడు సాయికృష్ణ ఘటన దేశమంతా నివ్వెర పోయేలా చేసింది. రాష్ట్రంలో భారత రాజ్యాంగం కాకుండా రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారం పోలీసు వ్యవస్థ నడుస్తోంది. సామాన్య ప్రజలకు రక్షణ, న్యాయం దొరుకుతుందనే నమ్మకం లేకుండా పోయింది. విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత రౌడీషీటర్లు, గంజాయి స్మగ్లర్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. గంజాయి, సెటిల్‌మెంట్లు, అక్రమ మద్యం వ్యాపారాలు యథేచ్ఛగా సాగుతున్నా సీపీ పట్టించుకోవడం లేదు. లా అండ్ ఆర్డర్‌పై శ్రద్ధ చూపకుండా కేవలం లోకేష్ కళ్లలో ఆనందం కోసం పనిచేస్తున్నారు. లాకప్‌డెత్‌కు ఎవరు బాధ్యత వహిస్తారు?: సాయికృష్ణను పోలీస్ కస్టడీలో ఎలా హింసించారు? లాకప్‌డెత్ ఎలా జరిగింది? ఆ తర్వాత శవాన్ని ఏ విధంగా కాల్చి బూడిద చేశారని రాష్ట్ర ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారో విజయవాడ సీపీ సమాధానం చెప్పాలి. ‘నా కొడుకు శవం కాకపోయినా, కనీసం కాల్చివేసిన బూడిదైనా ఇవ్వండి’ అంటూ ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇంతకంటే దారుణమైన ఘటన ఎక్కడా చూసి ఉండబోమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీపీ నుంచి ఎందుకు వివరణ కోరడం లేదు?: పోలీసు వ్యవస్థ సెటిల్‌మెంట్లకు అడ్డాగా మారిపోయిందని టీడీపీ అనుకూల మీడియానే చెబుతోంది. విజయవాడలో సెటిల్‌మెంట్లు జరుగుతున్నాయని ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికల్లోనే వార్తలు వస్తున్నాయి. గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని మీ మీడియానే ప్రచారం చేస్తోంది. అమాయకులపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసులు, సెటిల్‌మెంట్లు, పేకాట డెన్లు నిర్వహిస్తున్న వారిపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఒక తల్లి తన కుమారుడి మరణంతో బాధపడుతుంటే సీపీ ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు ఆమెను ఓదార్చడం లేదు? ప్రభుత్వం కూడా సీపీ నుంచి ఎందుకు వివరణ కోరడం లేదు? సాయికృష్ణ కేసు నీరుగార్చే కుట్ర: సాయికృష్ణ ఘటనపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పోలీసు అధికారులను పిలిపించి హడావుడి చేశారు. ఈ కేసును నీరుగార్చే విధంగా కుట్ర జరుగుతోందనే అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. సీఐని సస్పెండ్ చేయాలనే డ్రామా నడిపారే తప్ప సాయికృష్ణ కుటుంబానికి ఏం న్యాయం చేస్తారో ప్రభుత్వం చెప్పలేదు. టీడీపీ ఎమ్మెల్యేలకు సిగ్గుండాలి. సాయికృష్ణ మేనమామ చేత వీడియోలు చేయించి ప్రచారం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరిని అన్యాయంగా పోలీసులు చంపి కాల్చివేస్తే ఏ ఒక్క నాయకుడు పట్టించుకోలేదు. జనసేన ఇన్‌చార్జ్ వచ్చి రూ.50 లక్షలు ఇస్తామని బాధిత కుటుంబ సభ్యులతో పంచాయితీలు చేయడం సిగ్గుచేటు. సాయికృష్ణ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని, విజయవాడ సీపీపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇంకా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు.