ఏపీని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చిన చంద్రబాబు.

జీవో 363తో విశాఖ బీచ్‌ సంప్రదాయానికే ముప్పు

వైయస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకె రాజు ఫైర్‌

విశాఖపట్నం వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకె రాజు.

రుషికొండలో శివాలయానికి ఎదురుగా బార్లా?

బీచ్‌ షాక్స్‌ పేరుతో విశాఖ సంస్కృతిని మంటగలుపుతున్న బాబు 

జీవో నెంబరు 363 తక్షణమే వెనక్కి తీసుకోవాలి

కెకె రాజు డిమాండ్‌

రాష్ట్రంలో విశృంఖలంగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం

విజయవాడ కృష్ణలంక పీఎస్‌లో లాకప్‌డెత్‌

శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా దహనం

సాయికృష్ణ లాకప్‌డెత్‌పై ప్రభుత్వం సమాధానం చెప్పాలి

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన కెకె రాజు

విశాఖపట్నం:   పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం:363 విశాఖ సంప్రదాయాన్ని, ఎకో సిస్టమ్‌ను పూర్తిగా నాశనం చేసేలా ఉందని వైయస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకె రాజు మండిపడ్డారు. ‘బీచ్‌ షాక్స్‌’ పేరిట 12 తీరప్రాంత జిల్లాల్లో విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు. గతంలో రుషికొండ పవిత్రతపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబు.. ఇవాళ అక్కడ ఉన్న పవిత్ర శివాలయానికి, మూడు బావుల స్థలానికి ఆనుకుని, గుడికి ఎదురుగానే బార్లు పెట్టడం ఏ రకమైన సంస్కారమని నిలదీశారు. ‘బీచ్‌లో తాగితే తప్పేంటి’ అని విశాఖ ఎంపీ భరత్‌ మాట్లాడటం బాధ్యతారాహిత్యమని అభివర్ణించారు.
    విజయవాడలో కాపు యువకుడు సాయికృష్ణను లాకప్‌ డెత్‌ చేసి, కనీసం శవాన్ని కూడా అప్పగించకుండా బూడిద చేసిన అరాచక కూటమి ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని విశాఖలో మీడియాతో మాట్లాడిన కెకె రాజు తేల్చి చెప్పారు. 
ప్రెస్‌మీట్‌లో  కెకె రాజు ఇంకా ఏం మాట్లాడారంటే..:

జగన్‌ హయాంలో ’నాడు–నేడు’
చంద్రబాబు పాలనలో ’తాగు–తూగు’:

    గతంలో ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ విద్య, వైద్య రంగాల్లో ’నాడు–నేడు’ ద్వారా పెనుమార్పులు తీసుకువచ్చారు. వేలాది కోట్లు వెచ్చించి, ప్రభుత్వ బడులు, ఆస్పత్రులను ప్రైవేటు కంటే థీటుగా తీర్చిదిద్ది ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భద్రత కల్పించారు. ఇప్పుడు చంద్రబాబు మాత్రం తనను తాను ’విజనరీ’ అని చెప్పుకుంటూ.. రాష్ట్రంలో ’తాగు–తూగు’ అనే పథకాన్ని నడిపిస్తున్నారు. గ్రామాల్లో సూర్యుడు ఉదయించక ముందే బెల్టుషాపుల ద్వారా మద్యాన్ని విచ్చలవిడిగా సరఫరా చేస్తూ.. నిరుపేద కుటుంబాల్లోని ఆడబిడ్డల తాళ్లను తాకట్టు పెట్టించి, యువతను మద్యానికి బానిసలుగా మారుస్తున్నారు. మద్యం, గంజాయి, ఇసుక, మట్టి అక్రమ అమ్మకాలను ఆదాయ వనరులుగా మార్చి ’సంపద సష్టి’ పేరిట దోచుకోవడమే కూటమి లక్ష్యంగా పెట్టుకుంది.

జీవో:363తో పర్యాటక రంగం ఖూనీ.
ఎంపీ భరత్‌ వ్యాఖ్యలు దారుణం:

    పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్న నెపంతో బీచ్‌లలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడానికి జీవో నెం:363 జారీ చేయడం దారుణం.  రాష్ట్రంలో ఉన్న 971 కిలోమీటర్ల తీర ప్రాంతానికి ఆనుకుని ఉన్న 12 జిల్లాల్లో ’బీచ్‌ షాక్స్‌’ (ఆ్ఛ్చఛిజి  జ్చిఛిజుట) పేరుతో ప్రభుత్వం మద్యం దుకాణాలు ఏర్పాటుకు నిర్ణయించింది.  ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇక్కడ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తూ.. చివరకు సారా, విస్కీ, బ్రాందీ, గంజాయి, కొకైన్‌ అమ్మకాల ద్వారా చంద్రబాబు సంపద సృష్టిస్తున్నారు.

ఎంపీ భరత్‌ వత్తాసు సిగ్గుచేటు: 
    ఈ దుర్మార్గానికి విశాఖపట్నం ఎంపీ భరత్‌ వత్తాసు పలకడం దారుణం.‘18 ఏళ్లు దాటిన వారు మద్యం తాగొచ్చు కాబట్టి.. ఎక్కడికక్కడ మద్యం తాగే వెసులుబాటు కల్పిస్తే తప్పేంటి? బీచ్‌లో తాగి తిరగొచ్చు‘ అని ఎంపీ భరత్‌ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. 
విశాఖ బీచ్‌కు ఒడిశా, బెంగాల్‌తో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా పర్యాటకులు వస్తారు. విశాఖలో టెంపుల్, బీచ్, ఎకో టూరిజం ప్రధానంగా నడుస్తుంది. బీచ్‌లలో మద్యాన్ని తీసుకురావడం వల్ల ఇక్కడి ఎకో సిస్టమ్, సంప్రదాయ టూరిజం పూర్తిగా దెబ్బతింటాయి.

రుషికొండ శివాలయానికి ఎదురుగా బార్లా?:
    నిన్న (బుధవారం) పయ్యావుల కేశవ్‌ నేతృత్వంలోని మంత్రుల సబ్‌ కమిటీ రుషికొండ భవనాలను సందర్శించిన తర్వాత మాట్లాడిన తీరు తప్పు. గతంలో ఇదే రుషికొండ నిర్మాణాలపై చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ.. పూర్వం ఇక్కడ రుషులు తపస్సు చేశారని, వైయస్సార్సీపీ ప్రభుత్వం దీని పవిత్రతను దెబ్బతీసిందని అబద్ధాలు చెప్పారు. వాస్తవానికి రుషికొండ కింద భాగంలో బీచ్‌ సమీపంలోని శివాలయం వద్ద ఉన్న మూడు బావుల ప్రాంతాన్ని ప్రజలు ఎంతో పవిత్రంగా భావిస్తారు.
    నిజానికి ప్రార్థనాలయాలు, పాఠశాలలకు సమీపంలో మద్యం షాపులు ఏర్పాటు చేయకూడదనే కనీస నిబంధనలు ఉన్నా.. ఇవాళ అదే శివాలయానికి, పవిత్ర స్థలానికి ఆనుకుని, దానికి ఎదురుగానే చంద్రబాబు ’తాగు–తూగు’ బార్లను, మద్యం షాపులను ఏర్పాటు చేయడం అత్యంత అన్యాయం.

సాయికృష్ణ లాకప్‌ డెత్‌ అరాచకానికి పరాకాష్ట:
    రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా అస్తవ్యస్తమైందని చెప్పడానికి విజయవాడలో జరిగిన గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్‌ ఘటనే నిదర్శనం.
ఒక కాపు యువకుడిని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని లాకప్‌ డెత్‌ చేసి, కనీసం తల్లిదండ్రులకు మృతదేహాన్ని కూడా అప్పగించకుండా ఎవరికీ తెలియకుండా దహనం చేసి బూడిద చేశారంటే.. రాష్ట్రంలో ఏ స్థాయి రాక్షస పాలన సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, అప్రజాస్వామికంగా అమలు చేస్తున్న రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలులో ఈ లాకప్‌ డెత్‌ పరాకాష్ట అని కెకె రాజు అభివర్ణించారు.

Back to Top